‘వాట్సాప్‌’ సందేశాలతో సమాధి కూల్చారు

Bhima Koregaon attack may be fall-out of vandalism of Dalit icon’s tomb last week - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పుణెకు సమీపంలోని ‘భీమా కోరేగావ్‌’లో ఘర్షణలు చెలరేగినప్పుడే ఆ గ్రామానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘వాడు బుద్రుక్‌’ గ్రామంలో కూడా ఘర్షణలు చెలరేగాయి. బుద్రుక్‌ గ్రామానికి కూడా చారిత్రక విశేషం ఉంది. మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు సంభాజీ మహరాజ్‌ సమాధి ఈ గ్రామంలో ఉంది. (సాక్షి ప్రత్యేకం) వారి ప్రగతిశీల భావాలకుగాను ఈ ఇద్దరు రాజులను మరాఠాలతోపాటు దళితులు కూడా సమంగా ఆరాధిస్తూ వస్తున్నారు.

ఇక్కడ ప్రచారంలో ఉన్న ఓ చారిత్రక కథ ప్రకారం మొగల్‌ చక్రవర్తి ఔరంగాజేబ్‌కు బద్ద శత్రువైన సంభాజీ మహరాజ్‌ను 1689లో హత్య చేయగా, ఆయన శరీర భాగాలు వాడు ముద్రుక్‌ గ్రామంలో చెల్లా చెదురుగా పడిపోయాయి. ఆ రాజుకు ఎవరు దహన సంస్కారాలు కూడా చేయకూడదంటూ ఢిల్లీ సుల్తాన్‌ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఉత్తర్వులకు స్థానిక ప్రజలు కూడా ఎక్కువ మంది భయపడి పోయారు. (సాక్షి ప్రత్యేకం) అప్పుడు బుద్రుక్‌ గ్రామానికే చెందిన మహర్‌ అనే దళితుడు గోవింద్‌ గైక్వాడ్‌ ముందుకు వచ్చి ధైర్యంగా మహరాజ్‌కు దహన సంస్కారాలు నిర్వహించారు. అందుకని ఆయన పేరిట గ్రామంలో ఓ స్మారక గహం వెలిసింది.

భీమా కోరేగావ్‌ స్థూపాన్ని సందర్శించే వారంతా ఈ వాడు బుద్రుక్‌ గ్రామాన్ని కూడా సందర్శిస్తారు. ముందుగా సంభాజీ మహరాజ్‌ సమాధిని సందర్శించి, ఆ తర్వాత గైక్వాడ్‌ స్మారక భవనాన్ని సందర్శకులు సందర్శిస్తారని స్థానికులు తెలియజేస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఈసారి తమ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులను చూశామని పూర్తి పేరు వెల్లడించడానికి ఇష్టపడని గ్రామానికి చెందిన ఓ గైక్వాడ్‌ తెలిపారు. ఆరెస్సెస్‌ లాంటి సంస్థలు వాట్సాప్‌ ద్వారా హిందూ యువతను రెచ్చగొట్టడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయని తాము గ్రహించామని ఆయన చెప్పారు. (సాక్షి ప్రత్యేకం) ఘర్షణలను నివారించేందుకు ముందు జాగ్రత్తగా డిసెంబర్‌ 28వ తేదీనే గ్రామంలో ఓ శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేశామని, ఎట్టి పరిస్థితుల్లో గొడవలు జరుగకుండా చూడాలని నిర్ణయించామన్నారు. ముఖ్యంగా ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ చేతుల్లోకి రాళ్లు, ఇతర ఆయుధాలు తీసుకోరాదని యువకులకు పిలుపునిచ్చామని గైక్వాడ్‌ తెలిపారు.

శివప్రతిష్టాన్‌ నాయకుడు మనోహర్‌ అలియాస్‌ సంభాజీ భిడే (గురూజీ–85 ఏళ్లు), సమస్త హిందూ అఘదీ నాయకుడు మిలింద్‌ ఎక్‌బోటే (60) పిలుపుతో కొంత మంది ఆరెస్సెస్‌ కార్యకర్తలు డిసెంబర్‌ 30వ తేదీన వాడు ముద్రుక్‌లోని గోవింద్‌ గైక్వాడ్‌ సమాధిని ధ్వంసం చేయడంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఢిల్లీ సుల్తానుల చేతుల్లో మరణించిన సంభాజీ మహరాజ్‌కు దళితుడైన గోవింద్‌ గైక్వాడ్‌ అంత్యక్రియలు నిర్వహించారని, అందుకే అక్కడ ఆయన స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారన్న విషయాన్ని జీర్ణించుకోలేకనే ఈ ఇద్దరు వద్ధ హిందూ నాయకులు గోవింద్‌ గైక్వాడ్‌ సమాధి ధ్వంసానికి ఆరెస్సెస్‌ కార్యకర్తలను వాట్సాప్‌ సందేశాల ద్వారా రెచ్చగొట్టినట్లు తెలుస్తోందని గైక్వాడ్‌ అభిప్రాయపడ్డారు. (సాక్షి ప్రత్యేకం) బీసీ నాయకుల డిమాండ్‌ మేరకు మహారాష్ట్ర పోలీసులు ఈ ఇరువురు హిందూ నాయకులపై కేసులు పెట్టారు. అయితే వారిని ఇంతవరకు అరెస్ట్‌ చేయలేదు. ఎక్బోటే, బిడేలు ఆరెస్సెస్‌తో లోతైన సంబంధాలు కలిగి ఉన్నవారు.
 
అల్లర్లు నివారించేందుకు తాము ఎంత కషి చేసినా ఫలితం లేకపోవడం బాధాకరంగా ఉందని గైక్వాడ్‌ అన్నారు. దళితులే ముందుగా దాడికి దిగారని, అందుకే తాము ఎదురుదాడికి దిగాల్సి వచ్చిందని మరాఠాలు చెబుతున్నారని, తమ గ్రామంలో వంద మంది దళితులు ఉండగా, ఏడువేల మంది మరాఠాలు ఉన్నారని, అలాంటప్పుడు దళితులు దాడి చేయడం అటుంచి, రెచ్చగొట్టే పరిస్థితి కూడా లేదని గైక్వాడ్‌తోపాటు గ్రామంలో శాంతిని కోరుకుంటున్న కొందర పెద్దలు మీడియాతో వ్యాఖ్యానించారు. (సాక్షి ప్రత్యేకం)

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top