దళపతిగా గణపతి పదవీ విరమణ

Basavaraj New Boss To Maoist Party - Sakshi

మావోయిస్టు పార్టీ నూతన కార్యదర్శిగా బసవరాజు బాధ్యతలు

స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన గణపతి

26 ఏళ్లు దళపతిగా పనిచేసిన గణపతి

సాక్షి, హైదరాబాద్‌ : సీపీఐ (మావోయిస్టు) పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతి (ముప్పాళ్ల నాగేశ్వరరావు) పదవీ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఆయన స్థానంలో పార్టీ సీనియరైన బసవరాజు (నంబాళ్ల కేశవరావు)ను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు మావోయిస్టు​ పార్టీ కేంద్ర కమిటీ ప్రకటించింది. ఆయన ఎన్నికపై ఇదివరకే కేంద్ర కమిటీలో చర్చజరగగా నేడు (బుధవారం) ప్రధాన కార్యదర్శిగా బసవరాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్‌ బహిరంగ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీలో సుదీర్ఘ అనుభవం కలిగిన గణపతి వయోభారంతో, ఆరోగ్య సమస్యలతో పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర కమిటీని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో నూతన నాయకత్వానికి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కేంద్ర కమిటీ తెలిపింది.

1992 జూన్‌లో మావోయిస్టు పార్టీకి గణపతి జనరల్‌ సెక్రటరీగా ఎన్నికయ్యారు. పార్టీ కష్టకాలములో ఉన్న సమయంలో కీలక బాధ్యతలు స్వీకరించిన గణపతి.. పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసే పనిని తన భుజాలకెత్తుకున్నారు. ఆ సమయంలో కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న కొండపల్లి సీతారామయ్య కమిటీకి నాయకత్వం వహిస్తూ సమస్యలు పరిష్కరించగలిగే స్థితిలో​ లేరు. ఆ సమయంలో కేంద్రకమిటీలో అంతర్గత సవాళ్లు, కొన్ని అవకాశవాద ముఠాలు పార్టీని చీల్చడానికి ప్రయత్నించాయి. వాటిన్నింటిని తిప్పికొట్టేందుకు కేంద్ర కమిటీ గణపతిని ప్రధాన కార్యదర్శిగా నియమించింది.

1998లో సీపీఐ (ఎంఎల్‌) పీపుల్స్‌, సీపీఐ (ఎంఎల్‌, యూనిట్‌) విలీనమై సీపీఐ (ఎంఎల్‌) పీపుల్స్‌ వార్‌గా ఆవిర్భవించింది. ఈ పరిణామంతో పార్టీ అనేక రాష్ట్రాలకు విస్తరించి మరింత బలంగా మారింది. ఈ సందర్భంగా ఏర్పడిన నూతన కమిటీకి గణపతి నూతన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2000 నాటికి మిలటరీ పంథాను అభివృద్ధి చేసుకుని ప్రజావిముక్తి గెరిల్లా సైన్యాన్ని నిర్మించుకుంది. అనేక పరిణామాల నేపథ్యంలో 2004లో సీపీఐ (ఎంఎల్‌) పీపుల్స్‌వార్‌, కమ్యూనిస్టు సెంటర్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీపీఐ)లు విలీనమై సీపీఐ (మావోయిస్టు)గా ఆవిర్భవించింది. రెండు పార్టీలు విలీనం కావడంతో భారత విప్లవోద్యమంలో మావోయిస్టు పార్టీ మహా స్రవంతిగా మారింది. 

ఈ పార్టీలో ఎంతో కీలకమైన నేతలతో సహా, నక్సల్బరీ తరం నాయకులు కూడా ఉన్నారు. 1992 నుంచి 2018 వరకు దాదాపు 26 ఏళ్లు గణపతి ప్రధాన కార్యదర్శి బాధ్యతలను నిర్వహించిన కాలమంతా ఉద్యమం అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ కేంద్ర నాయకత్వంలో పురోగమించింది. ఈ నేపథ్యంలో నూతన నాయకత్వాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా బసవరాజును కేంద్రకమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. ఆయన 17 ఏళ్లకు పైగా కేంద్రకమిటీ సభ్యుడుగా కొనసాగుతూ వస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వ నిర్భందం మరోవైపు విప్లవ బాటలో అనేక సవాళ్లను ఎదుర్కొని ముందుకు వెళ్లటం నూతన నాయకత్వం ముందు ఉన్న పరీక్ష అని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top