యూఏఈ నుంచి మృతదేహం తరలింపు కోసం

Assam Doctor Helped Kerala Couple Fly Son Body From UAE - Sakshi

తిరువనంతపురం: కరోనా వైరస్‌ మనుషుల ప్రాణాలు.. తీయడమే కాదు.. మనలో మాయమవుతున్న మానవత్వాన్ని తట్టి లేపుతుంది. ఒకరితో ఒకరికి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికి.. బాధితులను ఆదుకోవడానికి ఎందరో ముందుకు వస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో మరణించిన కన్నబిడ్డను స్వదేశం తీసుకెళ్లి.. సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలనుకున్నారు తల్లిదండ్రులు. కానీ లాక్‌డౌన్‌ వల్ల వారికి ఆ అవకాశం లభించలేదు. అన్ని ప్రయత్నాలు విఫలమై.. ఆశలు వదులుకున్న వేళ ఓ అపన్న హస్తం వారిని ఆదుకుంది. కనీసం ముఖ పరిచయం కూడా లేని ఓ వ్యక్తి వారికి సాయం చేసి.. ఇండియాకు వెళ్లే ఏర్పాట్లు చేశాడు. ఆ వివరాలు.. 

కేరళ పాలక్కడ్‌కు చెందిన కృష్ణదాస్‌ కుటుంబం ఏడేళ్ల క్రితం ఉద్యోగ నిమిత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని షార్జా వెళ్లారు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం వారి 4 ఏళ్ల కుమారుడు వైష్ణవ్‌ కృష్ణదాస్‌కు ల్యూకేమియా అని.. అది కూడా ఆఖరి దశ అని తెలిసింది. వ్యాధి బయటపడిన 15 రోజుల్లోనే వైష్ణవ్‌ మరణించాడు. అల్లారుముద్దుగా పెంచిన కుమారుడు అర్థాంతరంగా మరణించడంతో ఆ తల్లిదండ్రులు కృంగి పోయారు. చనిపోయిన కొడుకును బతికించుకోలేము.. కనీసం అంత్యక్రియలైన స్వదేశంలో.. మతాచారం ప్రకారం నిర్వహించాలనుకున్నారు కృష్ణదాస్‌ దంపతులు. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కోరలు చాచడంతో దేశాలన్ని లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి. దాంతో ఏం చేయాలో పాలు పోలేదు. తమ సమస్య గురించి  కాన్సులేట్‌ అధికారులతో చెప్పుకున్నారు. కానీ వారు కూడా ఏం  చేయలేకపోయారు.(111 మందిని క‌లిసిన క‌రోనా పేషెంట్‌) 

అయితే ఇదే సమయంలో విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘వందే భారత్’‌ విమానాలను నడుపుతుంది. దాంతో వాటిల్లో ప్రయాణించేందుకు ప్రయత్నించాడు కృష్ణదాస్‌ దంపతులు. కానీ అవి చాలా పరిమిత సంఖ్యలో ఉండటం.. జనాలు ఎక్కువ ఉంటడంతో కృష్ణదాస్‌ కుటుంబానికి అవకాశం లభించలేదు. దాంతో చేసేదేం లేక దేవుడి మీదే భారం వేసి కుమారుడు మృతదేహాన్ని అల్ ఐన్ లోని అల్ తవాం హాస్పిటల్ మార్చురీలో భద్రపర్చారు. అయితే దేవుడు వారి మొర ఆలకించాడో ఏమో.. సాయం లభించింది. అది కూడా తమకు ఏ మాత్రం పరిచయం లేని ఓ వ్యక్తి నుంచి. అవును కేరళకు చెందిన కృష్ణదాస్‌కు సాయం చేసింది అస్సాం దిబ్రుగఢ్‌ ప్రాంతానికి చెందిన భాస్కర్‌ పపుకోన్‌ గోగోయ్ అనే వైద్యుడు‌.(సాంత్వననిచ్చే కోవిడ్‌ సాథీ)
                                           (వైద్యుడు, సామాజిక కార్యకర్త భాస్కర్‌ పపుకోన్‌ గోగోయ్‌)

వైద్యుడు, సామాజిక కార్యకర్త అయిన గోగోయ్‌ సోషల్‌ మీడియా ద్వారా కృష్ణదాస్‌ సమస్య గురించి తెలుసుకున్నాడు. వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా గోగోయ్‌ మాట్లాడుతూ.. ‘కృష్ణదాస్‌ కుటుంబం ఎదుర్కొంటున్న కష్టం నన్ను కలచివేసింది. వారికి నా వంతు సాయం చేయాలనుకున్నాను. కృష్ణదాస్‌ సమస్య గురించి యూఏఈలోని ఒక ముఖ్యమైన వార్త పత్రికలో కూడా వచ్చింది. యూఏఈలోని మిత్రుల ద్వారా ఆ కథనం రాసిన రిపోర్టరును సంప్రదించి.. కృష్ణదాస్‌ కుటుంబ పూర్తి వివరాలు తెలుసుకోగలిగాను. ఆ తర్వాత మే 13న విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌ జైశంకర్‌ను కలిసి, సమస్యను వివరించాను. ఆయన వెంటనే స్పందించారు. మరుసటి రోజే కృష్ణదాస్‌ కుటుంబాన్ని ఇండియా రప్పించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు’ అని తెలిపాడు గోగోయ్‌.(ప్రైవేట్‌లోనూ కరోనా)

ఈ సందర్భంగా కృష్ణదాస్‌ మాట్లాడుతూ.. ‘గోగోయ్‌ స్పందిచకపోయి ఉంటే.. మేము ఇండియాకు తిరిగి వచ్చే వారం కాదు. ఆయన రుణం ఎప్పటికి తీర్చుకోలేము’ అన్నారు. ఎక్కడి కేరళ... ఎక్కడి యూఏఈ.. ఎక్కడి అస్సాం. వీరిని కలిపింది మాత్రం మానవత్వం అంటున్నారు ఇది విన్నవారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top