‘కోట్ల’ కర్నాటకం

Another round of resort politics in Karnataka as JD(S)-Cong coalition governament - Sakshi

ప్రత్యేక విమానాలు, రిసార్టులకు భారీగా వెచ్చిస్తున్న రాజకీయ పార్టీలు

కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఇటు అధికార కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి, అటు బీజేపీ అధికారం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇందుకోసం కోట్లాది రూపాయలను మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నాయి. ఓవైపు సొంత కూటమి నుంచి ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాంగ్రెస్‌–జేడీఎస్‌ పార్టీలు అన్నిప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు ఈ రెండు పార్టీల్లోని అసంతృప్త నేతలను చీల్చడం ద్వారా అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కర్ణాటక రాజకీయ వ్యవహారాలను సునిశితంగా పరిశీలిస్తున్నవారి అంచనా ప్రకారం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు తమ ఎమ్మెల్యేలకు రూ.20 కోట్ల చొప్పున నగదును ముట్టజెప్పినట్లు సమాచారం. కేవలం నగదు మాత్రమే కాకుండా ప్రత్యేకంగా హోటళ్లు, రిసార్టుల్లో గదులు బుక్‌చేయడంతో పాటు వారి డిమాండ్లన్నింటిని తీరుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ హోటల్‌/ రిసార్టుల్లో ఒక్కో గదికి రోజుకు రూ.4000 నుంచి రూ.11,000 వరకూ ఖర్చవుతోంది. ఈ మొత్తాన్ని ఆయా రాజకీయ పార్టీలే భరిస్తున్నాయి.

ఒక్కో ట్రిప్‌కు రూ.4 లక్షల ఖర్చు..
ఇక ముంబైలో క్యాంప్‌ ఏర్పాటుచేసిన 15 మంది రెబెల్‌ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానాల్లో ముంబై–బెంగళూరు మధ్య రాకపోకలు సాగిస్తున్నారు. ఈ  మార్గంలో ఒక్కో ట్రిప్‌కు రూ.4 లక్షల వరకూ ఖర్చవుతోంది. కర్ణాటక సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలు పలుమార్లు ఇలా రాకపోకలు సాగించారు. మహారాష్ట్రలోని ప్రముఖ ఆలయాలను కూడా సందర్శించుకుంటున్నారు. అలాగే సుప్రీంకోర్టులో ముకుల్‌ రోహత్గీ వంటి సీనియర్‌ న్యాయవాదిని కూడా నియమించుకున్నారు. కొద్ది రోజులుగా ఇలా ప్రత్యేక విమానాల్లో ప్రయాణం, హోటళ్లలో బస కోసం రాజకీయ పార్టీలు రూ.50 లక్షల మేర ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే సొంత డబ్బుతోనే తాము హోటళ్లలో ఉంటున్నామని రెబెల్‌ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కానీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే మాత్రం బీజేపీవైపు వేలెత్తి చూపిస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల వెనుక బీజేపీ లేకుంటే, రాజీనామాలు చేసినవెంటనే ఎమ్మెల్యేలకు ప్రత్యేక విమానాలు, హోటళ్లలో గదులు ఎలా సమకూరాయని ప్రశ్నిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో రిసార్టుల రాజకీయం మొదలైంది. తమ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగిపోకుండా కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీలు 14 నెలల్లో శాసనసభ్యులను మూడుసార్లు రిసార్టులకు తరలించాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top