‘లోక్‌సభ’ సమరానికి ఆప్ సై | AAP releases first list of 20 candidates | Sakshi
Sakshi News home page

‘లోక్‌సభ’ సమరానికి ఆప్ సై

Feb 17 2014 2:49 AM | Updated on Mar 9 2019 3:34 PM

ఢిల్లీలో అధికారం నుంచి అస్త్రసన్యాసం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మరో నెలలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై గురిపెట్టింది.

 20 మందితో తొలి జాబితా
 
 న్యూఢిల్లీ: ఢిల్లీలో అధికారం నుంచి అస్త్రసన్యాసం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మరో నెలలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై గురిపెట్టింది. అవినీతి మంత్రులు, ఎంపీలను మరోసారి పార్లమెంటులోకి అడుగుపెట్టనీయబోమన్న ఆప్.. అందుకు తగినట్లుగానే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను వెల్లడించింది. ఢిల్లీలో 2, ఉత్తరప్రదేశ్‌లో 7, మహారాష్ట్రలో 6, హర్యానా, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, పంజాబ్ నుంచి ఒక్కో స్థానానికి.. మొత్తం 20 మంది పేర్లతో జాబితా వెలువడింది. వీరిలో ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి మేధాపాట్కర్, అవినీతి వ్యతిరేక ఉద్యమకారిణి అంజలి దమానియా కూడా ఉన్నారు.
 
 ఎవరు ఎక్కడి నుంచి..
  రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి ముందుగా అనుకున్నట్లుగా కుమార్ విశ్వాస్ పోటీ చేయనున్నారు.
 
  టీవీ జర్నలిస్టు నుంచి రాజకీయ నేతగా మారిన అశుతోష్ ఢిల్లీలోని చాందినీ చౌక్ స్థానంలో పోటీకి దిగుతారు. ఇక్కడ కేంద్ర మంత్రి కపిల్‌సిబల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
 
  మరో కేంద్ర మంత్రి ఖుర్షీద్ ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలోని ఫరూకాబాద్ టికెట్‌ను మాజీ జర్నలిస్టు ముకుల్ త్రిపాఠీకి ఇచ్చారు.
 
  ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌కు కంచుకోట అయిన మెయిన్‌పురి స్థానంలో హర్దేవ్ సింగ్ తలపడనున్నారు.
 
  అంజలి దమానియా నాగ్‌పూర్‌లో బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీపై పోటీ చేయనున్నారు.
  ఈశాన్య ముంబై టికెట్ మేధాపాట్కర్‌కు కేటాయించారు. దీంతో సిట్టింగ్ ఎంపీ ఎన్సీపీ నేత సంజయ్‌పాటిల్‌కి ఇబ్బందికర పరిస్థితేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
 
  క్రికెటర్ అజహరుద్దీన్ ప్రాతినిధ్యం వహిస్తున్న మొరాదాబాద్ నుంచి ఖలీద్‌పర్వేజ్, కల్మాడీ ప్రాతినిధ్యం వహిస్తున్న పుణే నుంచి సుభాష్ వారే, గుర్గావ్ నుంచి యోగేంద్ర యాదవ్ పోటీ చేస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement