గోవా వెళ్లిన వారికి టికెట్ లేదు | Sakshi
Sakshi News home page

గోవా వెళ్లిన వారికి టికెట్ లేదు

Published Sat, Nov 22 2014 12:35 AM

AAP MLAs who toured Goa face axe

కొత్త వారి కోసం ఆప్ వేట
న్యూఢిల్లీ: గోవా వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేలకు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వరాదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిర్ణయించింది. గత సెప్టెంబర్‌లో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ నేతలతో భేటీ అయ్యేందుకు గోవా వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. వీరి స్థానంలో కొత్తవారికి టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారని పార్టీ వర్గాలు తెలిపాయి. సీమాపురి ఎమ్మెల్యే ధర్మేంద్ర సింగ్ కోలీ, అంబేద్కర్ నగర్ శాసనసభ్యుడు అశోక్ కుమార్ చౌహాన్, దియోలీ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్‌లు సెప్టెంబర్ 22న గోవా వెళ్లారు. వారు వెళ్లిన విషయం తెలియగానే పార్టీ అధిష్టానం వెంటనే తిరిగి వెనక్కి వచ్చేయాలని ఆదేశించింది.

ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ నేతలతో భేటీ అయ్యేందుకు వెళ్లినట్టు ఢిల్లీలో వార్తలు వెలువడ్డాయి. కానీ వారు కేవలం గోవాలో పర్యటించేందుకు మాత్రమే వెళ్లినట్లు అప్పట్లో ఆప్ నేతలు వివరణ ఇచ్చారు. కానీ, నిజానికి వీరు బీజేపీ ఢిల్లీ విభాగం ఉపాధ్యక్షుడు షేర్‌సింగ్ డాగర్‌ను కలిసేందుకు వెళ్లినట్టు ఆ తరువాత వెల్లడైంది. ఆ ఉదంతం తమను తీవ్ర ఇబ్బందికి గురి చేసిందని పార్టీ నాయకుడొకరు చెప్పారు. ఎమ్మెల్యేను ప్రలోభపెట్టేందుకు షేర్‌సింగ్ డాగర్ ప్రయత్నిస్తుండగా, చిత్రీకరించిన వీడియోను ఆప్ నేతలు విడుదల చేశారు.

ఇదిలా ఉండగా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజు ధింగన్ (త్రిలోక్‌పురి), వీణా ఆనంద్ (పటేల్‌నగర్)లకు కూడా ఈసారి టికెట్ లభించకపోవచ్చని భావిస్తున్నారు. అయితే వారి విషయాన్ని మరోసారి పరిశీలించాలని ఆప్ నేతలు నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ధింగన్ తన నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారని, అయితే ఆయనకు మీడియో మాట్లాడటం చేతకాదని ఓ నాయకుడు అన్నారు. అయితే ధింగన్ చేసిన అభివృద్ధి పనులపై ఒక నివేదికను రూపొందించాలని ఆప్ నేతలు పార్టీ వాలంటీర్లు, కార్యకర్తలను ఆదేశించారని చెప్పారు. మరో డజను మంది ఎమ్మెల్యేలకు మాత్రమే రెండోసారి ఆప్ టికెట్ దక్కే అవకాశాలున్నాయని ఆ నాయకుడు తెలిపారు.

Advertisement
Advertisement