ఎస్‌యూవీ ఇంజన్లు, కారుసీట్లతో హెలికాప్టర్!

ఎస్‌యూవీ ఇంజన్లు, కారుసీట్లతో హెలికాప్టర్! - Sakshi


అద్భుతాలు సృష్టించాలంటే చదువే అక్కర్లేదు.. ఆలోచన ఉంటే చాలని నిరూపించాడు అసోంకు చెందిన ఓ యువకుడు. స్కూలు చదువు సగంలోనే ఆపేసినా.. తనలో ప్రతిభకు ఏమాత్రం కొదవ లేదని చూపించాడు. తమ గ్రామంలో ప్రజల ప్రయాణ కష్టాలను తీర్చడమే ధ్యేయంగా కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. మెకానిక్‌గా పనిచేసిన అనుభవంతో ఏకంగా హెలికాప్టర్ తయారు చేశాడు.



అసోంలోని శ్యామ్ జులి గ్రామానికి చెందిన చంద్ర శివకోటి శర్మ ఈ సొంత హెలికాప్టర్‌ను తయారు చేసి, దానికి 'పవనపుత్ర' అని పేరు పెట్టాడు. ఆటో మొబైల్ మెకానిక్‌గా పనిచేసే అతడు... తాను పొదుపు చేసిన డబ్బు నుంచి 15 లక్షల రూపాయలను ఖర్చు చేసి హెలికాప్టర్ డిజైన్ చేశాడు. గౌహతికి 450 కిలోమీటర్ల దూరంలోని ధెమాజీ జిల్లాకు చెందిన తమ గ్రామానికి ఎటువంటి వాహనాలు చేరలేకపోవడమే ఇతడి సృష్టి వెనుక కారణం. నిజానికి కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా మూడో క్లాస్ తర్వాత శివకోటి చదువు ఆపేశాడు. అయితేనేం తన కల నిజం చేసుకోవాలనుకున్న శివకోటి.. పొదుపు చేసిన డబ్బుతోపాటు, ఉన్న భూమిని కూడా అమ్మేసి హెలికాప్టర్‌ను రూపొందించాడు.  



శివకోటి తయారుచేసిన హెలికాప్టర్‌లో ఇద్దరు వ్యక్తులు ప్రయాణించవచ్చు. భూమికి 30 నుంచి 50 అడుగుల ఎత్తులో ఎగిరే దీన్ని మెటల్ షీట్లు, కారు సీట్లు, రెండు ఎస్‌యువి ఇంజన్లతో తయారుచేశాడు. ఈ 'పవనపుత్ర' గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని, దీన్ని నడిపిందుకు ఆయా విభాగాలకు చెందిన అధికారుల క్లియరెన్స్ కోసం వేచి చూస్తున్నానని శివకోటి చెబుతున్నాడు. ఏవియేషన్‌లో ఎలాంటి డిగ్రీ లేకపోయినా... శివకోటి ఇలాంటి వాహనం తయారు చేయడాన్నిజిల్లా డిప్యూటీ కమిషనర్ విక్టర్ కార్పెంటర్ ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా ఆయన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు, హెలికాప్టర్ ట్రయల్ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చే విభాగాలకు ఉత్తరాలు కూడా రాశారు. అయితే అతడు నిబంధనలను పాటించాల్సిన అవసరం కూడా ఉందని విక్టర్ చెబుతున్నారు.



శివకోటి ప్రయోగానికి ముగ్ధులౌతున్న స్థానికులు ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి తెలిపారు. స్థానిక అధికారులు, ఆర్మీ క్యాంపులోని ఆఫీసర్లు సైతం హెలికాప్టర్ ట్రయల్‌కు వస్తామని శివకోటికి హామీ ఇచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top