
షారుఖ్ సినిమా ప్రేరణతోనే కిడ్నాప్!
స్నాప్‌డీల్ ఉద్యోగిని దీప్తి శర్న కిడ్నాప్ వ్యవహారంలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
ఘజియాబాద్: స్నాప్‌డీల్ ఉద్యోగిని దీప్తి శర్న కిడ్నాప్ వ్యవహారంలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాపర్లకు సహకరించిన వారిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.
అనేక మలుపులు తిరిగి ఆఖరికీ దీప్తి ఇంటికి సురక్షితంగా చేరిన ఈ కిడ్నాప్ వ్యవహారానికి ప్రేరణ 'డర్' సినిమా అట. షారుఖ్ ఖాన్, సన్నీ డియోల్, జుహ్లీ చావ్లా జంటగా నటించిన 'డర్' సినిమా ప్రేరణతోనే తాము ఈ కిడ్నాప్ కుట్రకు పథకం రచించామని ప్రధాన నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించాడు. 27 ఏళ్ల ప్రధాన నిందితుడు హర్యానా పానిపట్‌కు చెందిన వాడు కాగా, అతనికి సహకరించిన వారు ఉత్తరప్రదేశ్‌లోని బద్వాన్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
24 ఏళ్ల దీప్తి ఈ నెల 5న కిడ్నాప్ అయింది. ఐదురోజుల తర్వాత గత బుధవారం సాయంత్రం ఆమెను కిడ్నాపర్లు విడిచిపెట్టారు. వాళ్లు ఆమెకు ఎలాంటి హాని తలపెట్టలేదు. తమ చెరలో ఉన్నన్ని రోజులు కిడ్నాపర్లు తనను బాగానే చూసుకున్నారని, ఆహారం అందించడమే కాకుండా తిరిగి ఇంటికి వెళ్లేందుకు డబ్బు కూడా ఇచ్చారని దీప్తి పోలీసులకు తెలిపింది. సినిమా ఫక్కీలో జరిగిన ఈ కిడ్నాప్ వ్యవహారం గుట్టును ఛేదించేందుకు పోలీసులు ఇప్పుడు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.