
21వ శతాబ్దం భారత్‌దే
విజ్ఞాన యుగమైన 21వ శతాబ్దాన్ని భారతదేశమే ఏలుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 35 ఏళ్ల లోపున్న 80 కోట్లమంది యువశక్తే భారత్‌కు బలమని పేర్కొన్నారు.
♦ 80 కోట్ల యువతే భారత్‌కు బలం
♦ శ్రీ వైష్ణోదేవి వర్సిటీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ
♦ వాజ్‌పేయి, ముఫ్తీ సయీద్ బాటలోనే కశ్మీర్ అభివృద్ధి
కట్రా: విజ్ఞాన యుగమైన 21వ శతాబ్దాన్ని భారతదేశమే ఏలుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 35 ఏళ్ల లోపున్న 80 కోట్లమంది యువశక్తే భారత్‌కు బలమని పేర్కొన్నారు. జమ్మూకు 35 కిలోమీటర్ల దూరంలోని కట్రాలోని శ్రీమాతా వైష్ణోదేవి వర్సిటీ ఐదో స్నాతకోత్సవానికి హాజరైన మోదీ అనంతరం ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ.. 21వ శతాబ్దాన్ని నడిపేందుకు అవసరమైన విజ్ఞానాన్ని ప్రపంచానికి భారత్ అందిస్తోందన్నారు. భారత యువత కలలే దేశ చరిత్రను మారుస్తాయన్నారు. ‘తర్వాత ఏం చేయాలనేదే ఎప్పుడూ మనస్సులో మెదులుతూ ఉండాలని.. ఎవరికైతే ఈ విషయం అర్థమవుతుందో వారు ఇతరులపై ఆధారపడకుండా దూసుకుపోతారు. ఇప్పటివరకు ఏం చేశారనేది మరిచిపోండి. ఇకపై ఎలా ముందుకెళ్లాలనేదానిపై దృష్టిపెట్టండి’ అని విద్యార్థులకు సూచించారు. దేశంలోని మిగతా వర్సిటీలు ప్రజల పన్నులద్వారా నడిస్తే.. ఈ విశ్వవిద్యాలయం దేశ, విదేశాలనుంచి అమ్మవారి దర్శనానికి వచ్చే పర్యాటకులిచ్చిన విరాళాలతో నడుస్తోందన్నారు.
వాజ్‌పేయి చూపిన బాటలో.. మాజీ ప్రధాని వాజ్‌పేయి నినాదమైన ‘ఇన్సానియత్, కశ్మీరియత్, జమూరియత్’ను మరోసారి మోదీ ప్రస్తావించారు. శ్రీ వైష్ణోదేవి నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవంలోమాట్లాడుతూ.. ‘ఈ రాష్ట్ర ప్రజలకు వాజ్‌పేయిపై పూర్తి నమ్మకం ఉంది. చాలా తక్కువమందికే ఈ గౌరవం లభించింది. వాజ్‌పేయి ఆలోచనా విధానాలతో కశ్మీర్‌ను అభివృద్ధికి బాటలు వేద్దాం’ అని అన్నారు. అంతకుముందు మాట్లాడిన జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ కశ్మీర్‌ను ‘మినీ ఇండియా’ అన్నారు. దీనికి ముఫ్తీని మోదీ ప్రశంసించారు. తనను ముఫ్తీ ఎప్పుడు కలిసినా రాష్ట్రాభివృద్ధి గురించే మాట్లాడతారన్నారు. దివంతగ సీఎం ముఫ్తీ సయీద్ ఆలోచనలకు అనుగుణంగాకశ్మీర్ పురోగతిపై ముందుకెళదామన్నారు.
లోయలో కుదురుకుంటున్న పరిస్థితి
వారం రోజులుగా ఆందోళనలతో అట్టుడికిన హంద్వారాలో పరిస్థితులు మెల్లిగా కుదురుకుంటున్నాయి. హంద్వారాతోపాటు కుప్వారాలో సాయంత్రం 6 గంటలవరకు కర్ఫ్యూను ఎత్తివేశారు. స్థానికుల సుదీర్ఘకాల డిమాండ్ మేరకు హంద్వారా మార్కెట్ నుంచి4 ఆర్మీ బంకర్లను తొలగించారు. అయితే ఇది కీలకమైన ప్రాంతమని.. ఇక్కడినుంచి పక్కకొస్తే పట్టుకోల్పోవాల్సి వస్తుందని ఆర్మీ తెలిపింది.ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ జమ్మూ కశ్మీర్‌లో భద్రతను సమీక్షించారు. హంద్వారాలో బాలికపై అత్యాచారం ఘటనపై ఆర్మీ అధికారులతో చర్చించారు. కాగా, సీఎం మెహబూబా ముఫ్తీ ఇంటి ముట్టడికి ప్రయత్నించిన కుప్వారా స్వ తంత్ర ఎమ్మెల్యే షేక్ అబ్దుల్ రషీద్, మ ద్దతుదారులను పోలీసులు అరెస్టు చేశారు.
కశ్మీర్ బాధను పరిష్కరించాలి: మెహబూబా
కశ్మీర్ లోయలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని.. తద్వారా దేశంలో రాష్ట్రంలోని యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. కశ్మీర్ యువతకు భద్రతపై భరోసా ఇవ్వటమే తన ప్రథమ కర్తవ్యమన్నారు. ముస్లిం దేశాలైన పాకిస్తాన్, సిరియా, లిబియాల్లో అస్థిరత నెలకొని ఉందని.. షియాలు,సున్నీలు ఒకరిపై ఒకరినొకరు చంపుకుంటున్నారని.. అదే భారతదేశంలో వివిధ మతాలు సామరస్యంగా ఉంటున్నాయన్నారు. కశ్మీర్ లోయలో నెలకొన్న అనిశ్చితికి శాశ్వతంగా ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో హంద్వారాతోపాటు కశ్మీర్‌లోయలో శాంతి నెలకొల్పుతానన్న విశ్వాసం తనకుందని మెహబూబా తెలిపారు. జమ్మూకు కశ్మీరీ పండిట్లు తిరిగొచ్చినపుడు స్థానికులు ఘనస్వాగతం పలకటం శుభపరిణామం అని ఆమె తెలిపారు.