12 మంది ఐటీ అధికారులపై వేటు

12 senior I-T Officers ordered compulsory retirement by Finance Ministry - Sakshi

కేంద్రం సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ: అవినీతి, విధుల్లో నిర్లక్ష్యం, మహిళా అధికారులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది సీనియర్‌ ఆదాయపన్ను శాఖ అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. ఉద్వాసనకు గురైన వారిలో చీఫ్‌ కమిషనర్, ప్రిన్సిపల్‌ కమిషనర్, కమిషనర్‌ స్థాయి అధికారులుండటం గమనార్హం. వీరిపై జనరల్‌ ఫైనాన్షియల్‌ నిబంధన 56 ప్రకారం వీరిని బాధ్యతల నుంచి తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగ బాధ్యతల నుంచి తొలగింపునకు గురైన వారిలో జాయింట్‌ కమిషనర్‌ స్థాయి అధికారి అశోక్‌ కుమార్‌ అగర్వాల్‌(ఐఆర్‌ఎస్‌–1985) ఉన్నారు.

ఈయన తీవ్ర అవినీతికి పాల్పడటంతోపాటు ఓ వ్యాపారి నుంచి బలవంతపు వసూళ్లు, ఒకప్పటి ఆథ్యాత్మిక గురువు చంద్రస్వామికి సాయం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కమిషనర్‌ స్థాయి మహిళా అధికారులను లైంగికంగా వేధించిన నోయిడాలోని కమిషనర్‌(అప్పీల్‌) ఎస్‌కే శ్రీవాస్తవ (ఐఆర్‌ఎస్‌) అధికారిపైనా ప్రభుత్వం వేటువేసింది. అధికార దుర్వినియోగం, అక్రమ మార్గాల్లో రూ.3.17 కోట్లు కూడబెట్టిన ఐఆర్‌ఎస్‌ అధికారి హోమీ రాజ్‌వంశ్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అజోయ్‌ కుమార్‌, అలోక్‌‡ మిత్రా, చందర్‌ భార్తి, అందాసు రవీందర్, వివేక్‌ బాత్రా, శ్వేతబ్‌ సుమన్, రాజ్‌ భార్గవ, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులను బాధ్యతల నుంచి తప్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

నిర్బంధ పదవీ విరమణ చేయించాల్సిన అధికారులను గుర్తించాల్సిందిగా గత కొంతకాలంగా కేబినెట్‌ సెక్రటేరియట్, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌లు తమ అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చినట్లు సమాచారం. సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌–1972 చట్టంలోని నిబంధన 56(జే) ప్రకారం ఒక అధికారికి 50, 55 సంవత్సరాలు నిండిన తర్వాత లేదా 30 ఏళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత అతని పనితీరుపై సమీక్ష చేపట్టేందుకు ప్రభుత్వానికి వీలుంటుంది. పనిచేయని అధికారులపై వేటువేసేందుకు ఉద్దేశించిన ఈ విధానాన్ని 2014లో మోదీ అధికారంలోకి రాగానే పునరుద్ధరించారు. ఇటీవలి కాలంలో వేటుపడిన ఉన్నతాధికారుల్లో ఎంఎన్‌ విజయ్‌కుమార్‌(ఐఏఎస్‌), కె.నరసింహ(ఐఏఎస్‌), మయాంక్‌ షీల్‌ చోహన్‌(ఐపీఎస్‌), రాజ్‌ కుమార్‌ దేవాంగన్‌(ఐపీఎస్‌) ఉన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top