వాళ్లది ఆత్మహత్య కాదు.. హత్యే!

11 bodies, a pet dog and a mysterious diary - Sakshi

బురారీ సామూహిక ఆత్మహత్య ఘటనపై కుటుంబ సభ్యుల ఆరోపణ

న్యూఢిల్లీ: ఢిల్లీలోని బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద స్థితిలో చనిపోవడంపై వారి బంధువులు స్పందించారు. తమ కుటుంబం ఆత్మహత్య చేసుకోలేదని, వారిని చంపేశారని మృతుల్లో ఒకరైన నారాయణ్‌ దేవీ భాటియా కుమార్తె సుజాత ఆరోపించారు. ‘ప్రతి రెండ్రోజులకు ఓసారి నేను మా అమ్మతో మాట్లాడేదాన్ని. అందరూ ఆనందంగా ఉన్నారు. కుటుంబంలో ఎవ్వరూ బాబాలను నమ్మరు.మీడియా అసత్యాలను ప్రచారం చేస్తూ, మా కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారని తప్పుడు కథనాలను ప్రచురిస్తోంది’ అని మండిపడ్డారు.  

ఊపిరాడకే చనిపోయారు..
చనిపోయిన 11 మందిలో 8 మంది ఊపిరాడకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారని పోస్ట్‌మార్టంలో తేలినట్లు పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మృతులకు పోస్ట్‌మార్టం కొనసాగుతోందని పేర్కొన్నారు. మృతుల శరీరంపై ఎలాంటి గాయాలు లేవని వెల్లడించారు.

మోక్షం పొందేందుకే..
మోక్షం పొందేందుకు ఎలా ప్రాణత్యాగం చేయాలన్నదానిపై చేతిరాతతో ఉన్న కాగితాలు బాధితుల ఇంట్లో లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. రెండు రిజిస్టర్లలో లభ్యమైన ఈ కాగితాల్లో ‘మోక్షం పొందాలంటే దీన్ని మంగళ, గురు, శనివారాల్లోనే పాటించాలి. ఆ రోజు ఇంట్లో భోజనం వండకూడదు. మిగతా కుటుంబ సభ్యులు ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకునేంతవరకూ ఒకరు పర్యవేక్షించాలి. వాస్తవానికి ఈ బలిదానంతో చనిపోరు. వాళ్లను దేవుడు కాపాడతాడు.’ అని ఉంది. ఈ కుటుంబం బాధ్‌ తపస్యా అనే విధానాన్ని ఆచరించి ఆత్మహత్య చేసుకుందని ఇంట్లో దొరికిన రిజిస్టర్లను బట్టి తేలిందన్నారు.  వీరందరూ మర్రిచెట్టు ఊడల నిర్మాణం తరహాలో ఒకేచోట తాళ్లతో ఉరివేసుకున్నారని వెల్లడించారు. 2015 నుంచి ఈ కుటుంబం తాంత్రిక క్రతువుల్ని నిర్వహించినట్లు రిజిస్టర్లను బట్టి తెలుస్తోందన్నారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top