 
															నచ్చిన పాత్రలే చేస్తా
													 
										
					
					
					
																							
											
						 నటి లైలా గుర్తుందా? 2000 ప్రాంతంలో హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన నటి లైలా. ముంబయికి చెందిన ఈ బ్యూటీ తొలుత ఎగిరే పావురం చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది.
						 
										
					
					
																
	 నటి లైలా గుర్తుందా? 2000 ప్రాంతంలో హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన నటి లైలా. ముంబయికి చెందిన ఈ బ్యూటీ తొలుత ఎగిరే పావురం చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత తమిళం, మలయాళం, కన్నడం, హిందీ తదితర భాషలలో నటించింది. కోలీవుడ్‌లో పితామగన్, నందా, దీనా, దిల్ అంటూ పలు హిట్ చిత్రాల్లో నటించింది. కెరీర్ మంచి స్ప్రింగ్‌లో ఉండగానే వివాహం చేసుకుని సంసార జీవితంలోకి అడుగుపెట్టింది. ఇద్దరు బిడ్డలకు తల్లి కూడా అయ్యింది. అలాగే చాలామంది సీనియర్ హీరోయిన్ల మాదిరిగానే ఈమె కూడా మళ్లీ 
	 ముఖానికి రంగేసుకోవడానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా నటి లైలాతో చిన్న భేటి....
	 
	  పెళ్లికి ముందు లైలాకు ఆ తర్వాత లైలాకు తేడా?
	  పెళ్లికి ముందు పూర్తిగా నటిగానే పరుగులెత్తాను. ఇప్పుడు కుటుంబం, పిల్లల సంరక్షణతో బిజీగా ఉన్నాను. కొంచెం బాధ్యత కూడా పెరిగింది.
	 
	  అనూహ్యంగా మళ్లీ ఇప్పుడు బుల్లితెరపై ఆసక్తి చూపడానికి కారణం?
	  ప్రస్తుతం ఎక్కువ కమిట్‌మెంట్స్ పెట్టుకోవడం సాధ్యం కాదు. సినిమాపై అధిక దృష్టి సారించాలనుకోవడం లేదు. అందువల్లనే బుల్లితెరను ఎంచుకున్నాను. ఇది కొత్త అనుభవం. చాలా సంతోషంగా ఉంది. నాకు సమయం, సౌలభ్యంగా ఉంటేనే బుల్లితెర కార్యక్రమాలు అంగీకరిస్తున్నాను.
	 
	  కోలీవుడ్ అభిమానులను మిస్ అవుతున్న ఫీలింగ్ లేదా?
	  అలాంటి ఫీలింగ్ ఉంది. ఇక్కడి కొందరు స్నేహితులు, సన్నిహితులతో తరచూ మాట్లాడుతునే  ఉన్నాను. ప్రస్తుతం టీవీ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల చెన్నైకి రాకపోకలు అధికమయ్యాయి.
	 
	  మీరే చిన్న అమ్మాయిలా ఉన్నారు. మీకు ఇద్దరు పిల్లలంటే ఆశ్చర్యంగా ఉంది?
	 మునుపటి లైలా వేరు. ఇప్పటి లైలా వేరు. ముందే చెప్పినట్లుగా చాలా బాధ్యతలు పెరిగాయి. సహాయానికి మనుషులున్నా పిల్లల పోషణను నేనే చూసుకుంటాను. ఇదో కొత్త ప్రపంచం. ఎంతగానో ఆస్వాదిస్తూ జీవిస్తున్నాను.
	 
	  సినిమాల్లో అక్క, వదిన పాత్రల్లో నటించడానికి సిద్ధమేనా?
	  అయ్యయ్యో. నా అభిమానులకు అలాంటి కష్టాన్ని కల్పించను. నాకలాంటి ఆసక్తి లేదు. మంచి బలమైన పాత్ర లభిస్తే నటిస్తాను. డబ్బు కోసం ఏ పాత్ర పడితే ఆ పాత్ర అంగీకరించను.
	 
 
					
					
					
						