సిని'మా' సక్సెస్ ఎవరిదో! | who will win in maa election? | Sakshi
Sakshi News home page

సిని'మా' సక్సెస్ ఎవరిదో!

Mar 29 2015 2:30 PM | Updated on Aug 14 2018 4:32 PM

సిని'మా' సక్సెస్ ఎవరిదో! - Sakshi

సిని'మా' సక్సెస్ ఎవరిదో!

హైదరాబాద్: ఎట్టకేలకు నీకా.. నాకా అంటూ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా)ఎన్నికలు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ముగిశాయి. మొత్తం 702 ఓట్లకు గాను 394 ఓట్లు పోలయ్యాయి.

హైదరాబాద్: అది టాలీవుడ్ తెలుగు చిత్ర పరిశ్రమ. ఒక ప్రత్యేక కుటుంబాన్ని తలపిస్తుంది. తామంతా కళామతల్లి బిడ్డలం అని ఎప్పుడూ వారు చెప్పుకుంటుంటారు. వారిమధ్య కూడా వైరుధ్యాలు ఉంటాయని అప్పుడప్పుడూ కొన్ని వేధికల ద్వారా కనిపిస్తున్నప్పటికీ ఇప్పుడు మాత్రం అవి ఏకంగా అందరి ముంగిటకు వచ్చి బట్టబయలయ్యాయి. సాధారణంగా సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులకు సామాన్య జనానికి.. వారి వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలనే ఆత్రుత కూడా కాస్త ఎక్కువగానే కనిపిస్తుంటుంది. ఇటీవల కాలంలో ఆ ఆత్రుతకు తాజాగా జరిగిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా)  ఎన్నికలు మరింత ఆజ్యం పోశాయి. 

ఒక్కసారిగా తెలుగు లోగిళ్లలోని చిన్నాపెద్దలను తమవైపు చూసేలా చేశాయి. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మా అసోసియేషన్ ఎన్నికలు ప్రతిసారి ఎలాంటి ఆర్భాటం హంగు లేకుండా జరిగిపోతుంటాయి. యూనానిమస్గా ప్రతిసారి ఆ ఎన్నికను నిర్వహిస్తుంటారు. కానీ, ఈసారి మాత్రం ఆ సంప్రదాయానికి స్వస్థిపలికి తాజాగా వార్తల్లోకి ఎక్కింది తెలుగు సినిమా ప్రపంచం. మా అసోసియేషన్కు ఇప్పటివరకు అధ్యక్షుడిగా పనిచేసిన మురళీమోహన్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. దీంతో ఎన్నికలు అనివార్యం కావడంతో ఇందులో ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్, జయసుధ బరిలోకి దిగారు.

అయితే, జయసుధకు మురళీ మోహన్ మద్దతిస్తుండగా.. నటుడు నాగేంద్రబాబు, శివాజీరాజాలాంటివారు రాజేంద్రుడికి మద్దతిచ్చారు. అయితే, మా అసోసియేషన్ మొత్తాన్ని తన గుప్పిట్లోకి ఉంచుకోవాలనే ఉద్దేశంతోనే మురళీ మోహన్ ఈ పోటి తలెత్తేలా చేశారని పలు వదంతులు వ్యాపించాయి.  రాజేంద్ర ప్రసాద్ను ఒంటరి చేయాలనే ప్రయత్నం చేశారనే ఆరోపణలు కూడా ఆయనపై తలెత్తాయి. మరోపక్క, తొలుత రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ నుంచి పోటికి తప్పుకున్న శివాజీ రాజా అనూహ్యంగా మళ్లీ బరిలోకి వచ్చారు. రాజేంద్రప్రసాద్ను ఒంటరి చేయడం ఇష్టం లేకే తాను మళ్లీ వచ్చానని, తాము మార్పు కోరుకుంటున్నామని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా అసలు తెలుగు చిత్ర పరిశ్రమలో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. 

అంతేకాకుండా, 'మా' (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్)ఎన్నికలు ఆపాలంటూ నటుడు ఓ కళ్యాణ్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసోసియేషన్ బైలాస్కు విరుద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని ఆ పిటిషన్లో ఆరోపించారు. ఎలక్షన్ ఆఫీసర్లను మార్చాలని ఆయన కోరారు. 2,500 రూపాయలు ఉన్న నామినేషన్ ఫీజును పది వేల రూపాయలకు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు ఎన్నికలు నిర్వహించుకోవచ్చని, అయితే.. తదుపరి తీర్పు వచ్చేవరకు కౌంటింగ్ నిర్వహించవొద్దని, ఫలితాలు వెల్లడించవద్దని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ఆదివారం ఉదయం 8గంటలకు మా ఎన్నికలు ప్రారంభమయ్యాయి.  ఈ ఎన్నికల్లో ఎన్నడూ లేనివిధంగా చాలామంది ఓటు వేసేందుకు వచ్చారు.

బాలకృష్ణతోపాటు కృష్ణ, కృష్ణంరాజు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ, స్వాతి, హేమ, ఉత్తేజ్, లాంటి అగ్ర, చిన్న నటీ నటులతోపాటు చిన్నచిన్నపాత్రలు పోషించేవారు కూడా వచ్చారు. అయితే, కామన్ ఆర్టిస్ట్ లే ఎక్కువగా ఓటువేశారని తెలుస్తోంది. గతంలో పోటి చేసి ఓడిపోయిన.. రాజేంద్ర ప్రసాద్నే గెలిపించాలని సాధారణ నటులు అనుకుంటున్నట్లు సమాచారం. అదీకాకుండా ఆయన ఎంతో బాధ్యతగా నడుచుకుంటారని, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తని కూడా కామన్ ఆర్టిస్ట్లు చెప్తున్నారు. తాము 'మా' లో మార్పు కోరుకుంటున్నామని చెప్తుండటం కూడా మురళీ మోహన్ మద్దతిచ్చే జయసుధ ప్యానెల్కు కాస్త ఇబ్బందిని కలిగించవచ్చని కూడా అనిపిస్తోంది.

మరోపక్క, అగ్రహీరోలంతా ఎన్నికలో పాల్గొంటే విజయం జయసుధను పలకరిస్తుందని మరికొందరు చెప్తున్నారు. ఏదేమైన ఈ ఎన్నికల కోసం తెలుగు చిత్ర పరిశ్రమ రెండుగా చీలినట్లు మాత్రం స్పష్టంగా కనిపించింది.  అయితే, ఈ ఎన్నికలు తమ నటనపై ఎలాంటి ప్రభావం చూపించబోవని ఇరు వర్గీయులు చెప్తున్నారు.  సాధారణ ఎన్నికల రీతిలో తలపించిన ఈ ఎన్నికల్లో మొత్తం ఓట్లేంతో తెలుసా.. కేవలం 702 మాత్రమే. మధ్యాహ్నం 2గంటలకు ముగిసిన ఈ పోరులో పోలైంది 394 ఓట్లే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement