
ఎవరో గౌరవించాలి..ఎవరో ప్రేమించాలి... లేకపోతే మనకు విలువ లేదు అని అనుకునే ప్రతి ఒక్కరికీ నిధి చెప్పేదొక్కటే.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి.. అని!
15 రోజుల క్రితం ప్రేమికుల దినోత్సవం ఎలా జరుపుకున్నారు? మీ బెస్ట్ వేలైంటైన్ ఎవరు?
వేలంటైన్స్ డే స్పెషల్ ఏమీ లేదు. ప్రేమను పంచడానికి ఒక్క రోజే ఎందుకు? నా పేరెంట్స్, ఫ్రెండ్స్.. ఇలా అందర్నీ ప్రతిరోజూ ప్రేమిస్తాను. ఇక బెస్ట్ వేలంటైన్ అంటే.. నేనే నా బెస్ట్ వేలంటైన్‌ని.అంటే మీకు మీరే మజ్ను అన్నమాట. మీరు కాకుండా వేరే ఎవరూ లేరా?(నవ్వేస్తూ). అవును. ప్రస్తుతానికి నాకు నేనే మజ్ను. నేనే నా బెస్ట్ ఫ్రెండ్ అని భావిస్తాను. మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది గొప్ప ఆర్ట్. అది ఆ మధ్య నేర్చుకున్నాను. ఓ ఏడాది నుంచి నన్ను నేను ప్రేమించుకోవడం మొదలుపెట్టాను. ఇంతకుముందు కన్నా ఇప్పుడు నన్ను నేను ఇంకా బాగా ప్రేమించుకోగలుగుతున్నాను.
ఈ స్వీయ ప్రేమను ఎలా నేర్చుకున్నారు?
ఏడాది క్రితం నాకు చాలా ‘టఫ్ టైమ్’. ప్రతిదానికీ కంగారుపడేదాన్ని. అప్పుడు మనల్ని మనం ప్రేమించుకోవడం చాలా ముఖ్యం అని మా అమ్మగారు చెప్పారు. ‘ఒక్క నిమిషం కూర్చుని ఆలోచించు. జీవితంలో ఇంత దూరం ఎలా రాగలిగావు? ‘ఏమీ లేను’ అనే స్థాయి నుంచి ఇక్కడి దాకా ఎలా చేరుకున్నావు? అందుకే కృతజ్ఞతతో ఉండు. హ్యాపీగా ఉండు. నీతో నువ్వు మరీ కఠినంగా ఉండకు’ అని మా అమ్మగారు చెప్పిన మాటలు నన్ను ఆలోచింపజేసేలా చేశాయి. అంతే.. టెన్షన్, కన్‌ఫ్యూజన్ పోయాయి. ఈ వేలంటైన్స్ డేకి నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే.. నన్ను నేనింకా ఎక్కువ లవ్ చేయాలని.
గతేడాది టఫ్‌గా గడిచిందన్నారు. ఆ క్లిష్టమైన పరిస్థితి గురించి?
చాలా రకాలుగా టఫ్‌గా గడిచింది. మా అమ్మానాన్నలు బెంగళూర్‌లో ఉంటారు. సినిమాల మీద ప్రేమతో నేను ముంబైలో ఉంటున్నాను. ఒంటరి జీవితం. ఇంటిని, జాబ్‌ని బ్యాలెన్స్ చేయాలి. బిల్స్ కట్టుకోవాలి. బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. సినిమా షెడ్యూల్స్ ప్లానింగ్ చేయాలి. ఇలా నా లైఫ్ మొత్తం నేనే హ్యాండిల్ చేసుకున్నాను. అది కొన్నిసార్లు చాలా టఫ్‌గా అనిపించింది. యాక్టర్ అయినప్పుడు చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. నా కంట్రోల్ లేకుండా చాలా పనులు జరిగిపోయాయి. అప్పుడు కొంచెం డౌన్ అయ్యాను. జీవితం మంచి పాఠం అంటారు. ఆ పాఠం మంచి అనుభవం అవుతుంది. అందుకే ఈ సంవత్సరం కచ్చితంగా అద్భుతంగా ఉంటుంది అనుకుంటున్నాను.
‘నా కంట్రోల్ లేకుండా కొన్ని జరిగిపోయాయి’ అన్నారు. అలాంటప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి?
అన్నింటికంటే ముఖ్యమైనది ‘ఇది మన కంట్రోల్ దాటిపోయింది’ అని తెలుసుకోగలగడం. మన చేతుల్లో ఏమీ లేనప్పుడు భారం దేవుడి మీద వేయడమే. నాకు దేవుడి మీద నమ్మకం ఎక్కువ. నా పరిధిలో ఉన్నవాటిని నేనే కంట్రోల్ చేసుకుంటాను. నావల్ల కానిది దేవుడికి వదిలేస్తాను. టఫ్ టైమ్స్‌ని ఎదుర్కొనే విషయంలో నేను పాటించేది ఇదే. ఇది కరెక్ట్ అనిపిస్తే ఎవరైనా ఫాలో అవ్వొచ్చు. లేకపోతే ఎవరి మనసు ఎలా చెబితే అలా వెళ్లిపోవడమే.
పాతికేళ్ల వయసులో మీలో చాలా పరిణతి కనిపిస్తోంది. ఓకే... మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్న తర్వాత గమనించిన మార్పులేంటి?
చాలా హ్యాపీగా, ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. మన బెస్ట్ కంపెనీ మనమే అని తెలుసుకుంటే లైఫ్ బాగుంటుంది. వంద మంది మధ్య పని చేసినా ఇంట్లో మన గదిలోకి వెళ్లాక మనం ఒక్కరమే ఉంటాం. అప్పుడు మనకు ఎవరు కంపెనీ ఉంటారు? మనమే కదా. మన కంపెనీని మనం ఇష్టపడగలగాలి. అప్పుడే మరుసటిరోజు మనం సంతోషంగా నిద్ర లేవగలం, సంతోషంగా ఉండగలం. అది మన పని మీద కూడా ప్రభావం చూపిస్తుంది.
అవునూ.. చిన్నప్పుడు ఐశ్వర్యారాయ్ హోర్డింగ్ (పోస్టర్) చూసి, ఎప్పటికైనా అలా హోర్డింగ్‌లో కనిపించాలనుకున్నారట. నిజమేనా?
(నవ్వేస్తూ) అవును. యాక్టర్ అవ్వాలనుకోవడానికి అదో కారణం.
మరి మీరు హీరోయిన్ అయ్యాక మీ హోర్డింగ్ చూసి ఏమనుకున్నారు?
ఫుల్ హ్యాపీ. మనమేనా? అనే ఫీలింగ్ కలిగింది. ఫొటోలు తీసుకున్నా. మా పేరెంట్స్ అయితే చాలా హ్యాపీ. వాళ్లిద్దరూ ఎప్పుడైనా మాల్స్‌కి వెళ్లినప్పుడు నా హోర్డింగ్స్‌తో ఫొటో దిగి నాకు పంపుతుంటారు. హీరోయిన్ కావాలన్నది నా చైల్డ్‌హుడ్ డ్రీమ్. ఎందుకంటే ఆర్టిస్టులను స్క్రీన్ మీద చూడగానే వాళ్లు మామూలు మనుషులు కాదనుకునేదాన్ని. దీపికా పదుకోన్ సిస్టర్‌ది మా స్కూలే. ఓసారి దీపికను నేరుగా చూసి, ‘హీరోయిన్లు కూడా మామూలు మనుషుల్లానే ఉంటారా?’ అయితే మనం కూడా హీరోయిన్ అవ్వొచ్చన్నమాట అనుకున్నాను.
ఒకవేళ మీరనుకున్నట్లు సినిమాలు కుదరకపోయి ఉంటే ఏం చేసేవారు?
చాన్సే లేదు. హీరోయిన్ అనే లక్ష్యం తప్ప వేరే ఏదీ లేదు. కచ్చితంగా అవుతాను అనే నమ్మకం ఉండేది. ఏదో ఓ మ్యాజిక్ జరుగుతుంది అని నమ్మాను. నాకున్న డ్రీమ్ ఇదొక్కటే. అయితే బాగా చిన్నప్పుడు అనుకుంటా... ఎవరు ఏ పని చేసినా అది కావాలనుకునేదాన్ని. కంటి ముందు టైలర్ కనిపిస్తే టైలర్ అవ్వాలని, డాక్టర్ ఎదురుపడితే డాక్టర్ అవ్వాలని, ఎవరైనా వంట చేస్తూ కనిపిస్తే వంట మనిషి అయిపోవాలని.. ఇలా అన్నమాట (నవ్వుతూ).
హీరోయిన్ అంటే 365 రోజులూ అందం మీద, ఫిజిక్ మీద దృష్టి పెట్టాలి. కష్టమే కదా?
కష్టమే. ఫిజిక్ ఒక్కటే కాదు స్కిన్, హైయిర్, స్టామినా అన్నీ చూసుకోవాలి. ఇవన్నీ జాబ్‌లో భాగమే. యాక్టర్ కావాలనుకుంటే మూడు నాలుగు విషయాలు కచ్చితంగా చూసుకోవాలి. యాక్టింగ్, డ్యాన్స్, లుక్స్. ఇవన్నీ నాకిష్టమే. ఎప్పుడూ వీటి మీద ఫోకస్డ్‌గా ఉంటాను. ఆర్టిస్ట్ అంటే మాటలా?
సరిగ్గా మీరు కథానాయికగా ఎంటరైన టైమ్‌లో ‘మీటూ’ ఉద్యమం వెలుగులోకొచ్చింది. సినిమాలెందుకని భయం వేసిందా?
సాధారణంగానే ఎవరికైనా పని చేసే వాతావరణం ఎలా ఉంటుందో అని భయం. పని సరిగ్గా చేయగలుగుతామా? లేదా? అని భయం. ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే? అనే భయం. ఇలాంటి భయాలు ఉన్నా అనుకున్నది సాధించాలనుకున్నప్పుడు భయాన్ని వెనక్కి నెట్టి, ధైర్యాన్ని ముందుకు తెచ్చుకోవాలి. నా అదృష్టమో ఏమో నాకు లైంగిక వేధింపులు ఎదురవ్వలేదు. అలాంటివి ఎదుర్కొన్నవాళ్లు లక్కీగా బయటకు చెబుతున్నారు కాబట్టి భయం మొదలైంది. దీనివల్ల దాడులు తగ్గుతాయని నా నమ్మకం.
ఒకవేళ అలాంటి సందర్భాలు ఎదురైతే వాటిని ఎదుర్కొనే ధైర్యం మీలో ఉందా?
మనందరికీ ధైర్యం ఉంటుంది. కొంతమంది దాన్ని లోపలే దాచేసుకుంటాం. అయితే ఎంతటి ధైర్యవంతులకైనా కొన్ని సందర్భాల్లో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి ఉంటుంది. నాకు కిక్ బాక్సింగ్ వచ్చు, ఏమైనా చేయగలను అనుకోవచ్చు. కానీ ఆ పరిస్థితిలో ఎలా రియాక్ట్ అవుతామో తెలియదు. నేనైతే కచ్చితంగా బ్యాడ్‌గా రియాక్ట్ అవుతాను.
కాలేజ్ డేస్‌లో ర్యాగింగ్ అప్పుడు ధైర్యంగా నిలబడ్డ సందర్భాలు?
కొంతమంది అమ్మాయిలు నన్ను ర్యాగింగ్ చేశారు. అది కూడా కొన్నాళ్లే. ఆ తర్వాత నన్నెవరూ ర్యాగ్ చేయలేదు. నేను ఎవర్నీ ర్యాగ్ చేయలేదు. ర్యాగింగ్ సరదా అనుకున్నా కొందరు సున్నిత మనస్కులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటారు కూడా. అందుకే నా దృష్టిలో ర్యాగింగ్ తప్పు.
ఓకే.. సవ్యసాచి, మిస్టర్ మజ్ను నటిగా మీకెంతవరకూ ఉపయోగపడ్డాయి?
ప్రతి సినిమా ఓ జర్నీ. ఆ జర్నీలో మనం ఏం నేర్చుకున్నామన్నదే ముఖ్యం. ఈ సినిమా కంటే నెక్ట్స్ సినిమాలో ఇంకా బాగా ఎలా యాక్ట్ చెయ్యాలా? అని ఆలోచిస్తుంటాను. అంతేగానీ ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది? అని ఆలోచించకూడదు. నటిగా బెటర్ అవ్వడానికి రెండు సినిమాలూ చాలా ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా ‘మిస్టర్ మజ్ను’లో కష్టమైన సీన్లు నటిగా మెరుగవ్వడానికి హెల్ప్ అయ్యాయి.
ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చేస్తున్నారు. మీరెంత స్మార్ట్?
వెరీ వెరీ స్మార్ట్. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో నాది స్మార్ట్ రోల్. నా రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉంటుంది. కొత్త టీమ్. చాలా సరదాగా ఉంది.
ఈ స్మార్ట్‌కి గర్ల్‌కి నచ్చాలంటే అబ్బాయిలో ఎలాంటి లక్షణాలు ఉండాలి?
‘మిస్టర్ మజ్ను’ సినిమాలో డైలాగ్ చెబుతా. అబ్బాయి విషయంలో నాకు హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి అంటాను. నిజజీవితంలో కూడా నాకు చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మన జీవితం అంతా ఒక వ్యక్తితో షేర్ చేసుకోవాలి కదా. అందుకే రైట్ పర్సన్ అయుండాలి. సింపుల్‌గా గుడ్ మ్యాన్ అయితే చాలు. అలాగే మంచి స్మైల్ ఉండాలి. ఎందుకంటే ఇద్దరం కలసి స్మైల్ చేయాలి కదా.
ఓకే.. పెళ్లెప్పుడు చేసుకోవాలనుకుంటున్నారు?
హహ్హహ్హ (పెద్దగా నవ్వుతూ) పెళ్లా! నాకు తెలియదు. ఇంకా చాలా సినిమాలు చేయాలి. పెళ్లి సంగతి దేవుడు చూసుకుంటాడు. అయితే పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తాను. అయినా పెళ్లి గురించి మాట్లాడే వయసులో లేను. ఎవరైనా ‘మీ అమ్మాయికి పెళ్లెప్పుడు చేస్తారు?’ అని నా పేరెంట్స్‌ని అడిగితే.. ‘ఇంకా చిన్నపిల్లే. అప్పుడే పెళ్లా?’ అంటారు. అవునండీ.. నాకప్పుడే పెళ్లేంటి?
ఖాళీ సమయాల్లో వంటింట్లో గరిటె తిప్పుతారా?
వంట అస్సలు రాదని కాదు.. ఓ సంవత్సరం సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఉన్నాను. త్వరగా వండేవన్నీ నేర్చుకున్నాను. నన్ను నేను బతికించుకోవడానికి వండుకోగలను (నవ్వుతూ).
మీరు ఫుడ్ లవరా?
అంతేం కాదు. ఇంట్లో తిని బయటకు వెళ్లే టైప్ నేను. భోజనంలో కొత్త్త ప్రయోగాలు చేయలేను. ఇడ్లీ, పెరుగన్నం వంటి కంఫర్టబుల్ ఫుడ్‌ని ఇష్టపడతాను.
మరి నాన్‌వెజ్?
తినను. వెజిటేరియన్‌గా మారాను.
ఎప్పుడు మారారు? కారణం ఏదైనా ఉందా?
నా పదకొండేళ్ల వయసప్పుడు అనుకుంటా. నేను నాన్‌వెజ్ తినడంవల్ల జంతువులు చచ్చిపోతున్నాయి అనిపించింది. అంతే.. మానేశాను. వెజిటేరియన్ అయిపోయా. వెజిటేరియన్ హెల్తీ డైట్ కూడా. మనల్ని ఎప్పుడూ లైట్‌గా ఫీల్ అయ్యేలా చేస్తుంది.
ఫైనల్లీ డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా?
డ్రీమ్ రోల్ కన్నా డ్రీమ్ డైరెక్టర్స్ ఉన్నారు. రాజమౌళి, మణిరత్నం, సంజయ్ లీలా భన్సాలీగార్ల సినిమాల్లో చేయాలని ఉంది.
డి.జి. భవాని
హైదరాబాద్‌లో పుట్టి, బెంగళూరులో పెరిగి ఇప్పుడు తెలుగు సినిమాల ద్వారా మళ్లీ హైదరాబాద్‌కి దగ్గరయ్యారు. తెలుగు ఫ్యాన్స్ గురించి?
నా పేరుతో ఓ ఫ్యాన్ ట్యాటూ వేయించుకున్నాడు. లవ్ లైటర్స్ కంటే కూడా అది టచింగ్‌గా అనిపించింది. ఇండస్ట్రీ మ్యాజికే అది. మనకు ఎంతో ప్రేమను ఇస్తుంటారు. సినిమాల్లోకి రాకమందు నేనూ థియేటర్స్‌లో ఓ ప్రేక్షకురాలిలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు నన్ను స్క్రీన్ మీద చూసి, ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. జీవితం నాకు చాలా ఇచ్చింది. అందుకే ఫ్యాన్స్‌కి నా మనసులో స్పెషల్ ప్లేస్ ఇచ్చేశా.
మీ రోజు ఎలా మొదలవుతుంది.?
ప్రస్తుతానికైతే షూటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. మొన్న నాలుగున్నరకే నిద్రలేచాను. ఆ రోజు ఏడు గంటలకల్లా షూటింగ్ లొకేషన్లో ఉండాలి. షూటింగ్ లేకపోతే 8–8.30కి లేస్తాను. ఈ మధ్య చాలా ప్రయాణం చేస్తున్నాను. ఎన్ని ప్రయాణాలు చేస్తున్నాను అని లెక్కేస్తున్నాను. ఈ ఏడాది ఈ నెలన్నరలో ఈ మధ్య చేసిన ఫ్లైట్ జర్నీ 22వది. చూడాలి.. ఈ ఏడాది ఇంకా ఎన్ని చేస్తానో?