‘టి మా’ అభివృద్ధికి కృషి చేస్తా

Telanana MAA Team Announced - Sakshi

– గీతాంజలి

‘‘నా 55ఏళ్ల సినిమా జీవితంలో ఎన్నో కష్టనష్టాలు  అనుభవించాను. అయినా, ఏ రోజూ నిరుత్సాహపడలేదు. నటులు  ఎప్పుడూ నిరుత్సాహ పడకూడదు’’ అని సీనియర్‌ నటి, ‘టి మా’ ఉపాధ్యక్షురాలు గీతాంజలి అన్నారు. తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు డా. ప్రతాని రామకృష్ణ గౌడ్‌ నూతనంగా ఏర్పాటు చేసిన  ‘టి మా’ (తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) కార్యవర్గ సభ్యులను హైదరాబాద్‌లో బుధవారం ప్రకటించారు.

‘టి మా’ అధ్యక్షునిగా జేవీఆర్, ఉపాధ్యక్షులుగా గీతాంజలి, నటుడు బాలాజీ, హీరో దిలీప్‌ రాథోడ్‌ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గీతాంజలి మాట్లాడుతూ– ‘‘సీతారామ కళ్యాణం’ చిత్రంతో ఎన్టీరామారావుగారు సీతగా సినీ పరిశ్రమలో నాకొక మంచి గుర్తింపునిచ్చారు. ఆ పాత్ర దొరకడం నా అదృష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో నటీ నటులకు మంచి వేషాలు రావడంలేదు. అలా కనిపించి ఇలా వెళ్లిపోయే పాత్రలకు ఒకటి, రెండు రోజుల కాల్‌ షీట్స్‌ అడుగుతున్నారు. ‘టి మా’ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను’’ అన్నారు.

ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ– ‘‘తెలంగాణ ఫిలించాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో 85 సినిమాలకు సెన్సార్‌  పూర్తి చేశాం. ఎన్నో సినిమాల టైటిల్స్‌ను రిజిస్ట్రేషన్‌ చేయించాం. సభ్యులకు హెల్త్‌కార్డ్స్‌ అందిస్తున్నాం. తెలంగాణ ఫిలిం చాంబర్‌ కేవలం తెలంగాణ వారికి చెందినది మాత్రమే కాదు. భారతదేశ వ్యాప్తంగా ఐదువేల మందికి పైగా నటీనటులు, సాంకేతిక నిపుణులు  మా చాంబర్‌లో ఇప్పటికే సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే ‘తెలంగాణ స్టేట్‌ ఫిలించాంబర్‌’ ఉంది కదా అనేది కొంత మంది ప్రశ్న.

అది నలభై ఏళ్లుగా ఉంది కానీ అందులో పంపిణీదారులే ప్రముఖంగా ఉంటారు. తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలిలో నిర్మాతలే ముఖ్య పాత్ర వహిస్తారు’’ అన్నారు. ‘తెలంగాణ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ ఉపాధ్యక్షుడు గురురాజ్, సెక్రటరీ కాచం సత్యనారాయణ పాల్గొన్నారు. కాగా ‘టి మా’ జనరల్‌ సెక్రటరీగా స్నిగ్ధ మద్వాని, జాయింట్‌ సెక్రటరీలుగా కిరణ్, లత, ఇమ్మడి ధర్మారెడ్డి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీలుగా వై.శ్రీనివాస్, ఆదర్శిని, యోగి, ఎగ్జిక్యూటివ్‌  కమిటీ సభ్యులుగా గుండు రవితేజ, ప్రేమ్, శ్రీశైలం, గీతాసింగ్, గాయత్రీ, మహాలక్ష్మి, టి న్యూస్‌ రాజేష్, ప్రవీణ, మమత, దయ ఎన్నికయ్యారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top