తమన్నా.. పూజ... ఓ సారీ | Tamanna and Pooja Hegde Rejected Bollywood Offer | Sakshi
Sakshi News home page

తమన్నా.. పూజ... ఓ సారీ

Jan 9 2018 12:09 AM | Updated on Aug 22 2019 9:35 AM

Tamanna and Pooja Hegde Rejected Bollywood Offer - Sakshi

మిల్కీ బ్యూటీ తమన్నా, గ్లామర్‌ గర్ల్‌ పూజా హెగ్డే సారీ చెప్పారు. సారీ చెప్పేటంత తప్పు వీరేం చేశారు? ఎవరికి క్షమాపణ చెప్పారు? అనేగా మీ డౌట్‌. అసలు సంగతి ఏంటంటే.. జాన్‌ అబ్రహాం, మనోజ్‌ బాజ్‌పేయి ముఖ్య పాత్రల్లో ‘రాక్‌’ అనే సినిమా తెరకెక్కనుంది. మిలాప్‌ ఝవేరి దర్శకత్వంలో నిఖిల్‌ అద్వానీ అంతర్జాతీయ ప్రమాణాలతో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కించనున్నారట. ఇందులో కథానాయిక చాన్స్‌కి అటు తమన్నా ఇటు పూజా హెగ్డే ‘సారీ.. కుదరదు’ అన్నారని బాలీవుడ్‌ టాక్‌. ‘రాక్‌’ చిత్రంలో జాన్‌ అబ్రహాంతో జోడీ కోసం తొలుత తమన్నాను సంప్రదించారట చిత్రబృందం.

మొదట సరే అన్న మిల్కీబ్యూటీ తర్వాత ‘సారీ నేను చేయలేను’ అంటూ తప్పుకున్నారట. ఆ పాత్రకు ఎవరైతే బాగుంటారా? అని సెర్చ్‌ చేసిన చిత్రబృందం ‘మొహెంజొదారో’తో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన పూజా హెగ్డే కరెక్ట్‌ అనుకున్నారట. ఆమెను సంప్రదించగా సింపుల్‌గా ‘సారీ’ అన్నారట. తమన్నా ఎందుకు తప్పుకున్నారు? ఇటువంటి మంచి అవకాశాన్ని పూజా హెగ్డే వదులుకోవడానికి కారణం ఏంటి? అన్నది తాజా బాలీవుడ్‌ టాక్‌. అబ్రహాంకి మంచి హిట్లు లేకపోవడం వల్లే అని కొందరు అంటుంటే.. కాదు.. కాదు.. ‘రాక్‌’లో కొన్ని బోల్డ్‌ సన్నివేశాలు ఉండటం వల్లే తప్పుకున్నారంటున్నారు మరికొందరు గాసిప్‌రాయుళ్లు. మరి.. జాన్‌కి జోడీగా ఎవరు ‘యస్‌’ అంటారో?

Advertisement
 
Advertisement
Advertisement