గళం గాళ్స్‌

Special story to heroins dubbing own voice - Sakshi

కళ్లు మూసుకున్నా వీళ్లే కనపడతారు. అవునూ.. తెర మీద ఈ బంగారు బొమ్మలు కనపడుతుంటే కళ్లు మూసుకునే ఫూల్‌ ఎవరైనా ఉంటారా? చాన్స్‌ లేదు. కళ్లు మూసే చాన్సే లేదు. మరి.. కళ్లు మూసుకున్నా వీళ్లే కనపడతారంటున్నారు. వాయిస్‌ అమ్మా వాయిస్‌. ఇక యాక్టింగ్, పెర్ఫార్మెన్సే కాదు.. డబ్బింగ్‌ కూడా వాళ్లే చెప్పుకుంటున్నారు. వీళ్లిక గ్లామర్‌ గాళ్సే కాదు.. గళం గాళ్స్‌ కూడా. చెప్పాం కదా.. ఇక ముందు కళ్లు మూసుకున్నా వీళ్లే కనిపిస్తారు... కాదు.. వినిపిస్తారు.

పాత రోజుల్లో మన హీరోయిన్లు ఎంచక్కా వాళ్ల పాత్రలకు వాళ్లే డబ్బింగ్‌ చెప్పుకుని పాటలు కూడా పాడుకునేవారు. ఆ తర్వాత బొంబాయి హీరోయిన్ల దిగుమతి ప్రారంభం కావడంతో వాళ్లు షూటింగ్‌ స్పాట్‌లో హిందీలో చిలుక పలుకులు పలికితే దానికి మన తెలుగు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌లు వెనుక నుంచి గాత్రదానం చేయడం మొదలైంది. ఆ తర్వాత అడపాదడపా మన భాష రాని హీరోయిన్లు తెలుగు భాష నేర్చుకొని మరీ డబ్బింగ్‌లు చెబుతున్నారు. ఈ మధ్య ఈ జోరు పెరిగింది. ఇప్పుడు కథానాయికలు మాకింక మాట సాయం వద్దు అంటున్నారు. పాత్రకు పరిపూర్ణత తీసుకురావడం కోసం తమ సొంత గొంతుని వినిపించడానికి రెడీ అవుతున్నారు. అలా ఈ ఏడాది ఇప్పటివరకూ వచ్చిన, రానున్న చిత్రాల్లో తమ సొంత గొంతునే వినిపించడానికి ప్రిపేర్‌ అయిన హీరోయిన్లు ఎవరో చూద్దాం.

దేవదాస్‌లో సొంత గొంతు 
‘ఛలో, గీత గోవిందం’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో తెలుగు ఇండస్ట్రీలో టాప్‌ హీరోయిన్‌ దిశగా అడుగులేస్తున్న నటి రష్మికా మండన్నా. తన నెక్ట్స్‌ రిలీజ్‌ నాగార్జున, నానీ మల్టీస్టారర్‌ చిత్రం ‘దేవదాస్‌’. ఈ సినిమాలో తన గొంతుతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చెయ్యడానికి   ఉవ్విళ్లూరుతున్నారు రష్మిక. సెప్టెంబర్‌ నెలాఖరులో రిలీజ్‌ కానున్న ఈ సినిమా కోసం డబ్బింగ్‌ చెప్పడానికి సిద్ధమవుతున్నారు ఈ కన్నడ భామ. కన్నడం, తెలుగు కొంచెం దగ్గర దగ్గరగా ఉండటంతో తెలుగు మాట్లాడటం తనకు పెద్ద కష్టం అనిపించకపోవచ్చు.

సొంత గొంతు సమేతంగా..!
ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘అరవింద సమేత వీర రాఘవ’లో అరువు గొంతుకు స్ట్రిక్ట్‌గా నో అన్నారు పూజా హెగ్డే. త్రివిక్రమ్‌ సినిమాల్లో సంభాషణలకే ఫస్ట్‌ సీట్‌ దక్కుతుంది. అలాంటప్పుడు భాష మీద పట్టుంటే తప్ప అనుకున్నంత సులువు అవ్వదు తెలుగు డబ్బింగ్‌. అయినా రిస్క్‌ తీసుకోదలిచారు పూజా హెగ్డే. ఈ సినిమా కోసం స్వయంగా డబ్బింగ్‌ చెబుతున్నారామె. ఆల్రెడీ డబ్బింగ్‌ పనులు కూడా స్టార్ట్‌ చేశారు. దసరాకు రిలీజ్‌ కానున్న ఈ సినిమాలో పూజ ఫస్ట్‌ టైమ్‌ తెలుగు సంభాషణలు ఎలా పలుకుతారో వేచి చూడాలి. ఆల్రెడీ ఈ ఏడాది రిలీజ్‌ అయిన ‘అజ్ఞాతవాసి’  సినిమాలో హీరోయిన్స్‌ కీర్తీ సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్‌తో తెలుగు డబ్బింగ్‌ చెప్పించిన త్రివిక్రమ్‌ ‘అరవింద సమేత..’కు కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నారు.

సూటిగా నత్తి లేకుండా
నటిగా ఎనిమిదేళ్ల కెరీర్, తెలుగు తమిళ భాషల్లో టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు సమంత. కానీ చాలా సంవత్సరాలు తన గొంతును మనకు వినిపించలేదు. ఆమె సక్సెస్‌లో చిన్న వాటా సింగర్, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయికి దక్కక మానదు. సమంత తొలి తెలుగు సినిమా ‘ఏ మాయ చేసావె’లో జెస్సీ పాత్రకు ఆమె చెప్పిన డబ్బింగ్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌. అప్పుడు మొదలైన ఈ మాట సాయం చాలా కాలం సాగింది. చిన్మయి వాయిస్‌ సమంతదేనా అనిపించేంత పాపులర్‌ అయిందంటే మామూలు విషయం కాదు. ఈ ఏడాది రిలీజ్‌ అయిన ‘మహానటి’ సినిమా ద్వారా అభిమానులకు తన సొంత గొంతును వినిపించారు సమంత. మధురవాణి అనే జర్నలిస్ట్‌ పాత్ర. పేరుకే మధురవాణి కానీ సూటిగా సుత్తి లేకుండా మధురంగా మాట్లాడలేదు. కంగారు వస్తే నత్తి వచ్చేస్తుంది. నిజానికి నత్తి నత్తిగా డబ్బింగ్‌ చెప్పడం కష్టం. పైగా ఫస్ట్‌ టైమ్‌ డబ్బింగ్‌. కానీ సమంత నత్తి డైలాగ్స్‌ పలికి చప్పట్లు కొట్టించుకున్నారు. రీలీజ్‌కు రెడీ అయిన ఆమె లేటెస్ట్‌ సినిమా ‘యు టర్న్‌’ సినిమాలో కూడా తన పాత్రకు స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకున్నారు. ఈ ద్విభాషా చిత్రంలోనూ జర్నలిస్ట్‌ పాత్ర పోషిస్తున్నారామె. సమంత తన పాత్రకు స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకున్న రెండు సినిమాల్లో ఆమె జర్నలిస్ట్‌ పాత్ర పోషించడం విశేషం.

‘హలో.. నమష్కారం’ అంటూ ఆడియో వేడుకల్లో, ప్రెస్‌మీట్స్‌లో ముద్దు ముద్దుగా తెలుగు పలికే పరభాషల కథానాయికలు తెలుగు నేర్చుకుని మరీ సొంత గొంతు వినిపించాలనుకోవడం అభినందనీయం. సొంత గొంతు వినిపిస్తే ‘కంప్లీట్‌ ఆర్టిస్ట్‌’ అనిపించుకునే అవకాశం ఉందని డబ్బింగ్‌ చెప్పేసుకుంటున్నారు. కొన్ని సార్లు పరిపూర్ణత కోసం అత్యుత్సాహం ప్రదర్శించి డబ్బింగ్‌ చెప్పుకున్నా  పదాలు సరిగ్గా రాకపోతే మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే భాషలోని మాధుర్యం బట్టీ పడితే వచ్చేది కాదు కదా. అందుకే వీలైనంత పర్ఫెక్ట్‌ తెలుగు సంభాషణలు పలకడానికి కథానాయికలు ట్రై చేస్తున్నారు. ఇలా ఆల్రెడీ డబ్బింగ్‌ చెప్పుకున్న వాళ్లందరూ ఇక మీదట కంటిన్యూ చేస్తామని అంటున్నారు. రాబోతున్న నటీమణులు కూడా త్వరలోనే సొంతంగా డబ్బింగ్‌ చెబుతాం అంటున్నారు.  ఇలా హీరోయిన్స్‌ అందరూ తమ పాత్రలకు వాళ్లే డబ్బింగ్‌ చెప్పుకోవడం మంచి పరిణామమే. ఈ లిస్ట్‌ ఇలానే పెరుగుతూ ఉంటుందని, ఉండాలని కోరుకుందాం.

వంక పెట్టలేని కీర్తి
‘అజ్ఞాతవాసి’  సినిమాలో  ఫస్ట్‌ టైమ్‌ తన గొంతును వినిపించారు కీర్తీ సురేశ్‌. అదో చాలెంజ్‌. ఆ తర్వాత మరో పెద్ద చాలెంజ్‌ను ఎంచుకున్నారామె. అదేంటంటే.. ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్రను పోషించడమే కాకుండా ఆ పాత్రకు స్వయంగా సంభాషణలు చెప్పడం. కానీ ఎక్కడా కూడా వంక పెట్టలేనట్టుగా నటించడమే కాకుండా సంభాషణలు కూడా బాగా పలికారు కీర్తీ సురేశ్‌. సావిత్రి జీవితంలో అన్ని దశలను చూపించిన కథ ఇది. యవ్వనంలోని కొంటెతనం, సూపర్‌ సక్సెస్‌లో ఉన్నప్పుడు హుందాతనం, అన్నీ కోల్పోయిన తర్వాత నైరాశ్యం..  ఇలా అన్ని రకాల్లో సంభాషణలు పలకడం కష్టం. కానీ వీటన్నింటినీ అవలీలగా చేసి చూపించారు కీర్తి. తాగుడుకు బానిస అయిన పాత్రలో లావుగా కనిపిస్తారు. ఆ సీన్స్‌కు డబ్బింగ్‌ చెప్పడం కోసం నోట్లో దూదులు ఉంచుకొని మరీ డబ్బింగ్‌ చెప్పారామె. ఈ కష్టాన్నంతా బాక్సాఫీస్‌ సక్సెస్‌ ఇచ్చి తుడిచేసింది.

కో–స్టార్స్‌కీ డబ్బింగ్‌!

విశేషం ఏంటంటే తమ పాత్రలకే కాదు తమ కో–స్టార్స్‌కి కూడా కొన్ని సందర్భాల్లో డబ్బింగ్‌ చెప్పి ఆశ్చర్యపరిచారు పరభాష నటీమణులు. ‘చందమామ’ సినిమాలో కాజల్‌ పాత్రకు చార్మీ డబ్బింగ్‌ చెప్పారు. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో తన పాత్రకు తనే డబ్బింగ్‌ చెప్పుకోవడంతో పాటు మరో హీరోయిన్‌ ఇషా తల్వార్‌ పాత్రకు కూడా గొంతు సాయం చేశారు నిత్యామీనన్‌. 

వీళ్లకన్నా ముందు
ప్రస్తుతం డబ్బింగ్‌ చెబుతున్నవాళ్ల గురించి తెలుసుకున్నాం. వీళ్లకంటే ముందే ఈ లిస్ట్‌లో ఉన్న కొందరు నటీమణుల లిస్ట్‌ గమనిస్తే ‘అలా మొదలైంది’లో నిత్యామీనన్,  ‘రాఖీ’ సినిమాలో చార్మీ, ‘కృష్ణం వందే జగద్గురుం’  సినిమాలో నయనతార, ‘మొగుడు’ సినిమా కోసం తాప్సీ, ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో రకుల్‌ ప్రీత్‌సింగ్, ఇంకా నివేథా థామస్, రాశీ ఖన్నా, అనుపమా పరమేశ్వరన్‌ సొంత గొంతు వినిపించారు. ‘ఫిదా’లో సాయి పల్లవి తెలంగాణ యాస నేర్చుకొని మరీ డబ్బింగ్‌ చెప్పారు. కుర్ర తారలు ఎంత పట్టుదలగా ఉన్నారో చెప్పడానికి ఇదో నిదర్శనం.

తెలుగు రాని సూపర్‌ స్టార్‌
మణిరత్నం ‘చెలియా’ సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్‌ను పలకరించారు బాలీవుడ్‌ బ్యూటీ అదితీ రావ్‌ హైదరీ. అయితే అది డబ్బింగ్‌ సినిమా ఖాతాలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత తెలుగులో చేసిన ‘సమ్మోహనం’లో తన గొంతునే వినిపించారు. ఈ సినిమాలో తెలుగు వచ్చీ రానీ, తెలుగుతో ఇబ్బంది పడే స్టార్‌ హీరోయిన్‌ సమీరా రాథోడ్‌లా నటించారు అదితీరావ్‌ హైదరీ. సో.. అక్కడక్కడా పదాల ఉచ్ఛారణ స్పష్టంగా లేకపోయినా పాత్ర స్వభావంలో కొట్టుకుపోయింది. పాత్ర నచ్చడంతో డబ్బింగ్‌ చెప్పుకున్నాను అని పేర్కొన్నారామె. తన నటనకే కాకుండా డబ్బింగ్‌కి కూడా మంచి మార్క్స్‌ పడ్డాయి. సినిమాతో పాటు అదితీ కూడా సూపర్‌ హిట్‌ అయ్యారు.
– ఇన్‌పుట్స్‌: గౌతమ్‌ మల్లాది

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top