మూడేళ్లకే సంగీతంలో రికార్డు సాధించా

Singer Srinidhi Special Chit Chat With Sakshi

సినీ గాయని శ్రీనిధి

తల్లిదండ్రుల నుంచే సంగీత ఓనమాలు దిద్దారు. మూడేళ్ల వయస్సులోనే సంగీత స్వరాలు గుర్తించడంలో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు సాధిం చారు. ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సినీ గాయనిగా బిజీగా ఉన్నారు. ఆమే మన తెలుగు గాయని శ్రీనిధి. భీమవరంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె గురువారం ‘సాక్షి’తో ముచ్చటించారు.ఆ ఇంటర్వ్యూ విశేషాలు ఇలా..

సాక్షి : ఏమి చదవుకున్నారు,మీ స్వస్థలం ఎక్కడ?
శ్రీనిధి :మాది అనంతపురం. నేను ఇంజినీరింగ్‌ హైదరాబాద్‌జేఎన్‌టీయూలో చేశాను. సంగీతంలో మాస్టర్‌ డిగ్రీ అందుకున్నాను. పీహెచ్‌డీ కూడా చేస్తున్నాను. మా తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యచార్యులు, తల్లి శారద సంగీత కళాకారులు. వారి నుంచి  సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నాను. నా గురువు నేదులూరి కృష్ణమూర్తి వద్ద శిక్షణ తీసుకున్నాను.

సాక్షి : సింగర్‌గా మీ ప్రయాణం?
శ్రీనిధి : నేను 3 ఏళ్ల వయస్సు నుంచే సంగీతంపై ఆకర్షించడబడ్డాను. ఆ తర్వాత ఈటీవీ పాడుతా తీయగా, మా టీవిలో పాడాలని ఉంది పాటల పోటీల కార్యక్రమాల్లో పాల్గొని విజేతగా నిలిచాను.

సాక్షి : మీకు మొదటి అవకాశం ఎవరు ఇచ్చారు?
శ్రీనిధి : వందేమాతరం శ్రీనివాస్‌ గ్రీటింగ్‌ సినిమాకు పాటలు పాడే అవకాశం ఇచ్చారు.

సాక్షి : ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడారు.. గుర్తింపు వచ్చిన పాట?
శ్రీనిధి :నేను ఇప్పటి వరకు సుమారు 100 పాటల వరకు పాడాను. తెలుగు అమ్మాయి, ఎన్టీఆర్‌ కథానాయకుడు, బాహుబలి తదితర సినిమాల్లో పాడే అవకాశం దక్కింది. బాహుబలి సినిమాలో నిదరించరా కన్నా పాట గుర్తింపు తెచ్చింది. తెలుగు, తమిళం, కన్నడలో కూడా పాటలు పాడాను.

సాక్షి : ఇప్పుడు ఏ సినిమాలకు పాడుతున్నారు?
శ్రీనిధి :ప్రస్తుతం మూడు కొత్త సినిమాలకు పాటలు పాడుతున్నాను. అందులో ఎన్టీఆర్‌ మహానాయకుడులో మూడు పాటలు పాడుతున్నాను. కొన్ని మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ చేస్తున్నాను. అలాగే అన్నమయ్యకు పట్టాభిషేకం పాటలకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నాను.

సాక్షి : తోటి గాయకులతో పోటీ ఉంటుందా?
శ్రీనిధి :అదృష్టం ఏమిటి అంటే మన తెలుగు సినిమాల పాటల విషయానికి వస్తే తోటి గాయకులతో ఎటువంటి పోటి ఉండదు. అందరం చాలా స్నేహంగా ఉంటాం. నేను ఎవరితోను పోటి పడను. నాకు ఇష్టం అయితే పాడతాను.

సాక్షి : భీమవరం రావడం, త్యాగరాజఉత్సవాల్లో సంగీత కచేరి చేయడంఎలా అనిపించింది?
శ్రీనిధి : భీమవరం చాలా బాగుంది.ఇక్కడ అందరూ చాలా ఆప్యాయంగా ఉంటారు. ఇక్కడ వాతవారణం నాకు బాగా నచ్చింది. త్యాగరాజ స్వామి ఉత్సవాల్లో పాల్గొని  సంగీత కచేరి చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. త్యాగరాజ మ్యూజిక్‌ అకాడమీ ఏర్పాటు చేసి వందేళ్ల పాటు త్యాగరాజ స్వామిని ఆరాధించడం చాలా గొప్ప విషయం. త్యాగరాజు శత వార్షికోత్సవాల్లో పాల్గొంటున్నాను అని తోటి సింగర్స్‌కు చెప్పగా చాలా గొప్ప అవకాశం వచ్చిందని అన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top