ఎలా ఉండేదాన్ని ఇలాగయ్యా! | Shraddha Srinath Opens About her weight Loss | Sakshi
Sakshi News home page

ఎలా ఉండేదాన్ని ఇలాగయ్యా!

Oct 23 2019 9:24 AM | Updated on Oct 23 2019 9:24 AM

Shraddha Srinath Opens About her weight Loss - Sakshi

చెన్నై : ఎలా ఉండే తాను ఇలాగయ్యానని అందం కోసం తను పడినపాట్లు గురించి నటి శ్రద్ధాశ్రీనాథ్‌ ఏకరువు పెట్టింది. ఈ కన్నడ భామ మాతృభాషలోనే కాకుండా తమిళం, తెలుగు, మలయాళం అంటూ దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించేస్తోంది. కన్నడంలో యూటర్న్‌ చిత్రంతోనూ, టాలీవుడ్‌లో జెర్సీ చిత్రంలోనూ పేరు తెచ్చుకుంది. ఇక కోలీవుడ్‌లో విక్రమ్‌ వేదా చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న  శ్రద్ధాశ్రీనా«థ్‌ ఆ తరువాత కే–13, నేర్కొండపార్వై చిత్రాల్లో నటించింది. విశాల్‌ సరసన ఇరుంబుతిరై–2 చిత్రంలో నటించడానికి సిద్ధంఅవుతోంది. ఈ అమ్మడు బాగా లావుగా ఉన్న తన  ఒకప్పటి ఫొటోనూ, ఇప్పటి ఫొటోనూ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది. ఆ కథేంటో చూద్దాం.

అంతకుముందు... ఆ తర్వాత

’అది నేను అంతర్జాతీయ విహారయాత్ర చేసిన రోజులు. న్యాయశాఖలో పని చేశాను. ఆ వృత్తిలో ఏడాది గడిచింది. అప్పుడు ఇంతకు ముందెప్పుడూ చేయనంత ఖర్చు చేయడం ప్రారంభించాను. అంటే ఆహారం, దుస్తులు, సినిమాలు చూడడం వంటి అన్ని విషయాలకు ఎడాపెడా ఖర్చు చేసేదాన్ని. చేతినిండా ఆదాయం. సంతోషకరమైన జీవితాన్ని గడిపేశాను.  నెలకొకసారి మాత్రమే శరీరవ్యాయామం చేసేదాన్ని. నచ్చింది తినేసేదాన్ని. దీంతో బరువు పెరిగిపోయాను. నచ్చిన దుస్తులు ధరించేదాన్ని. అంతే కాదు నన్ను నేనెప్పుడూ అందం తక్కువగా భావించేదాన్ని కాదు. అప్పట్లో పలు వ్యక్తిగత సంతోషాలు నాలో ఉండేవి. అయితే నా బద్ధకం కారణంగా అవేవీ అనుభవించలేకపోయాను. అప్పుడు తీసుకున్న ఫొటోను చూసినప్పుడు ఇంత పరువ వయసులోనే అంత బరువు ఉండకూడదన్నది గ్రహించాను.

దీంతో అపార్టుమెంట్‌లోనే ఉన్న జిమ్‌కు వెళ్లడం మొదలెట్టాను. మొదట్లో ఐదు నిమిషాలు, ఆ తరువాత 15 నిమిషాలు. ఆపై గ్యాప్‌ లేకుండా 40 నిమిషాలు పరుగులు పెట్టాను. అలా ఐదేళ్లలో 18 కిలోల బరువు తగ్గాను. అందుకు చాలా శ్రమించాను. నిజానికి  నేనంత ఫిట్‌నెస్‌ కాదు. అయినా అంతగా వర్కౌట్లు చేశాను.  క్యాలరీల గురించి,  కసరత్తుల గురించి తెలిసింది. అయితే దురదృష్టవశాత్తు అనారోగ్యానికి గురయ్యాను. దీంతో క్రమబద్ధమైన ఆహారనియమాలకు, వ్యాయామాలకు మధ్య సమతుల్యతను పాటించలేకపోయాను. అయినా  శ్రమించాను. నన్నిలా చేయిండానికి కారణం చాలా సింపుల్‌. నేను చూడడానికి అందంగా ఉండాలని భావించడమే. మీరు అందంగా ఉండడానికి హద్దులు అంటూ ఉండవు. సామాజిక మాధ్యమాలు భయాన్ని పెంచుతూనే ఉంటాయి. వాటి ప్రలోభాలకు గురి కాకుండా  ఆరోగ్యం కోసం ఎంత వరకూ సాధ్యమో అంత వరకే కసరత్తులు చేయండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవించండి. సామాజిక మాధ్యమాల కోసం ఎలాంటి శ్రమ తీసుకోవద్దు‘ అని నటి శ్రద్ధాశ్రీనాథ్‌ పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement