కరోనా : మరోసారి ఉదారత చాటుకున్న షారుక్‌

Shah Rukh Khan Provides PPE Kits To Healthcare workers In Mumbai - Sakshi

ముంబై : బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్‌ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు పోరాటం చేస్తున్న మహారాష్ట్రలోని ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్‌ వర్కర్లకు తన వంతు సహాయంగా 25వేల పీపీఈ (పర్సనల్‌ ప్రొటక్షన్‌ ఎక్విప్‌మెంట్‌) కిట్లను అందించాడు. ఇదే విషయమై మహారాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి రాజేష్ తోపే స్పందిస్తూ షారుక్‌కు ట్విటర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ' థాంక్యూ షారుక్‌.. మీ వంతుగా 25వేల పీపీఈ కిట్లను అందించినందుకు ధన్యవాదాలు. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న మెడికల్‌ సిబ్బందికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయంటూ' ట్విటర్‌లో పేర్కొన్నాడు. (తల్లి నుంచి నవజాత శిశువుకు వచ్చే ప్రమాదం)

దీనిపై షారుక్‌ స్పందిస్తూ.. ' నేనిచ్చిన కిట్లను హెల్త్‌ వర్కర్లకు వినియోగిస్తునందుకు మీకు ధన్యవాదాలు. అయినా దేశమంతా ఒకే కుటుంబంగా ఉంటూ కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి ఆపత్కాల సమయంలో నా వంతుగా సహాయం చేశా. కరోనాను తరిమికొట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తున్న వైద్య రంగం, వారి కుటుంబసభ్యులు ఆరోగ్యంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అంటూ రీట్వీట్‌ చేశాడు.

అంతకుముందు షారుక్‌ భార్య గౌరీఖాన్‌ తమ నాలుగంతస్తుల ఆఫీస్‌ బిల్డింగ్‌ను క్వారంటైన్‌ సెంటర్‌గా మార్చుకునే అవకాశం ఇస్తున్నట్లు బృహత్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌కు లేఖను అందజేశారు. క్వారంటైన్‌ సెంటర్లో మహిళలకు, చిన్నపిల్లలతో పాటు, మిగతావాళ్లకు కూడా అవసరమైన అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు లేఖలో పేర్కొన్నారు.  దీనిపై బృహత్‌ ముంబై కార్పొరేషన్‌ ట్విటర్‌లో స్పందిస్తూ.. ' మీ ఆఫీసుని క్వారంటైన్‌ సెంటర్‌గా నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆపత్కాల సమయంలో మీరు చేస్తున్న పనికి మాకు సంతోషంగా ఉందంటూ' తెలిపారు. ఇక భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు మరింత పెరిగిపోతుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10వేల కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 300 దాటేసింది.
(మే 3 వరకు లాక్‌డౌన్‌ : మోదీ)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top