సీనియర్‌ జర్నలిస్ట్‌ రామారావు మృతి  | Senior journalist Rama Rao Passed Away | Sakshi
Sakshi News home page

సీనియర్‌ జర్నలిస్ట్‌ రామారావు మృతి 

Feb 12 2020 1:38 AM | Updated on Feb 12 2020 1:38 AM

Senior journalist Rama Rao Passed Away - Sakshi

పసుపులేటి రామారావు

సీనియర్‌ జర్నలిస్ట్, సినీ పీఆర్‌ఓ పసుపులేటి రామారావు (70) ఇక లేరు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పసుపులేటి రామారావు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు. డిగ్రీ వరకు చదువుకున్న ఆయన ప్రజానాట్యమండలి, కమ్యూనిస్టు పార్టీలో చురుగ్గా పని చేశారు. పాత్రికేయుడిగా దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం ఆయనది. తొలుత విశాలాంధ్ర విలేకరిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత జ్యోతిచిత్ర పత్రికలో జర్నలిస్ట్‌గా పనిచేశారు. నంబర్‌ వన్, సంతోషం వంటి పలు వారపత్రికల్లోనూ చేశారు. సినిమాలకు పీఆర్వోగానూ వ్యవహరించారు. దాసరి నారాయణరావు, టి.కృష్ణ, యస్వీఆర్, చిరంజీవి, సావిత్రి, శ్రీదేవి.. వంటి సినీ దిగ్గజాలపై పుస్తకాలు రచించారు.

సీనియర్‌ ఎన్టీఆర్, ఏయన్నార్, జగ్గయ్య, కృష్ణ, కృష్ణంరాజు, శోభ¯Œ బాబు, చంద్రమోహన్, మురళీ మోహన్, మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటే శ్‌లతో పాటు ఎంతో మంది నటీనటులను, సాంకేతిక నిపుణులను ఇంటర్వ్యూలు చేశారు. వాటిలో కొన్నింటిని ‘నాటి మేటి సినీ ఆణిముత్యాలు’ పేరుతో పుస్తకరూపంలో తీసుకువచ్చారు. ఆయనకు భార్య వెంకటలక్ష్మి, కుమారుడు కల్యాణ్‌ నాగ చిరంజీవి ఉన్నారు. రామారావు మృతికి సినీ ప్రముఖులు, సినీ జర్నలిస్టులు సంతాపం తెలిపారు. నటుడు చిరంజీవి, దర్శకులు రేలంగి నరసింహారావు,  ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాతలు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, సీవీ రెడ్డి, పోకూరి బాబూరావు, అచ్చిరెడ్డి, నటుడు మాదాల రవి తదితరులు పసుపులేటి రామారావు భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులర్పించారు. నటులు పవన్‌ కల్యాణ్, నాని, కల్యాణ్‌ రామ్, వరుణ్‌ తేజ్, శర్వానంద్, నితిన్, దర్శకులు హరీష్‌ శంకర్, కొరటాల శివ తదితరులు సంతాపం తెలి పారు. రామారావు అంత్యక్రియలు నేడు హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.

రామారావుగారి వ్యక్తిత్వం నాకెంతో ఇష్టం. నేనంటే ఆయనకు ఎంతో అభిమానం.. ఆయనన్నా నాకూ అంతే అభిమానం. లేకలేక పుట్టిన ఆయన కుమారుడికి మా ముగ్గురు అన్నదమ్ముల పేర్లు (చిరంజీవి, నాగబాబు, పవన్‌ కల్యాణ్‌) కలిసి వచ్చేలా కల్యాణ్‌ నాగ చిరంజీవి అని పేరు పెట్టారు. ఆయన మోకాలికి ఆపరేషన్‌ చేయించడం కోసం డాక్టర్‌ని కూడా సంప్రదించాం. అయితే తన అక్కయ్యకు ఆరోగ్యం బాగాలేదని, తర్వాత చేయించుకుంటానని అన్నారు. ఆయన్ను నీతికి, నిజాయతీకి, నిబద్ధతకు మరో రూపంలా చూస్తా. రామారావుగారి కుటుంబానికి అండగా ఉంటాను.        
– నటుడు చిరంజీవి

నాకు సన్నిహితుడైన రామారావుగారి మరణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. నేను నటుడిగా పరిచయమైనప్పట్నుంచి ఆయనతో స్నేహం ఉంది. మద్రాసులో ఎంత సన్నిహితంగా ఉన్నామో, హైదరాబాద్‌కి వచ్చాక కూడా అంతే సాన్నిహిత్యం మా మధ్య కొనసాగింది. అప్పుడూ, ఇప్పుడూ తెల్లటి దుస్తులు, భుజాన కాటన్‌ సంచి.. ఇదే ఆయన ఆహార్యం. నిజాయతీకి నిలువెత్తు నిదర్శనంగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఎన్నోసార్లు నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఒక తరం సినీ జర్నలిస్టులకు మార్గదర్శిగా నిలిచిన ఆయన మరణం తీరని లోటు.
– నటుడు మోహన్‌బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement