నటుడు చంద్రమౌళి కన్నుమూత

Senior Actor Chandramouli Passed Away  - Sakshi

సీనియర్‌ నటుడు, డబ్బింగ్‌ కళాకారుడు చంద్రమౌళి గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చిత్తూరు జిల్లా కుమ్మరి కండ్రిగలో జన్మించారు చంద్రమౌళి. ప్రముఖ నటుడు మోహన్‌బాబు తండ్రి నారాయణస్వామి వద్ద చంద్రమౌళి, ఆయన అన్నయ్య 5వ తరగతి వరకూ చదువుకున్నారు. మేనమామ ప్రేరణతో 20 ఏళ్లకే నాటకాలంటే ఆయనకు మక్కువ ఏర్పడింది. దాంతో 1971లో మద్రాసు వెళ్లిన ఆయనకు ‘అంతా మన మంచికే’ చిత్రంలో వేషం దొరికింది. అప్పటి నుంచి సుమారు 200 సినిమాల్లో నటించారాయన.

45 ఏళ్లకు పైబడిన తన సినీ ప్రస్థానంలో నటుడిగా విభిన్న పాత్రలు పోషిస్తూనే, డబ్బింగ్‌ కళాకారుడిగానూ పేరు తెచ్చుకున్నారు.పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. సినిమాల్లో ఆయన చిన్న చిన్న పాత్రల్లో నటించినా తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజులతో పాటు నేటి అగ్ర నటులందరి సినిమాల్లోనూ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పలు పాత్రలు పోషించి, తనదైన గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఎన్ని సినిమాలు చేసినా పేద, మధ్య తరగతి పాత్రల్లో నటించిన ఆయనకు ఒక్కసారి కూడా తెరపై కోటీశ్వరుడిగా చూసుకునే అవకాశం దక్కలేదట. అయితే.. అందుకు ఏ మాత్రం బాధగా లేదని పలు సందర్భాల్లో చెప్పారాయన. చంద్రమౌళికి ఇద్దరు కుమారులున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ, టీవీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top