ఆయనతో నటించడం చాలా కూల్‌..

sayyeshaa saigal act in gajinikanth movie with arya - Sakshi

ఆయనతో నటించడం చాలా కూల్‌ అంటోంది నటి సాయేషా సైగల్‌. వనమగన్‌ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ బాలీవుడ్‌ బ్యూటీకి ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా, అవకాశాలకు మాత్రం ఆ చిత్రమే కారణం అంటుంది. జయంరవికి జంటగా నటించిన వనమగన్‌ చిత్రంలో సాయేషా నటన, ముఖ్యంగా ఆమె డాన్స్‌ పలువురిని ఆకర్షించింది. తాజాగా ఆర్యకు జంటగా గజనికాంత్‌ చిత్రంలో నటిస్తోంది. ఇంతకు ముందు హరహర మహేదేవకి చిత్రంలో దర్శకుడిగా పరిచయమైన పి.విజయకుమార్‌ ఈ చిత్రానికి దర్శకుడు. స్టూడియోగ్రీన్‌ అధినేత కేఈ. జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న చిత్రాల్లో ఇది ఒకటి.  

సాధారణంగా ఆర్యతో నటించే హీరోయిన్లు ఆయన గురించి కాస్త ఎక్కువగానే చెబుతుంటారు. వారిని ఏం మాయ చేస్తారోగానీ, హీరోయిన్ల హీరోగా పేరు తెచ్చుకున్నారు. చాలా మంది హీరోయిన్లకు నచ్చే ఆర్య సాయేషాకు తెగ నచ్చేశారట. ఇటీవల జరిగిన చిత్ర విలేకరుల సమావేశంలో ఈ భామ ఆర్యతో నటించడం చాలా కూల్‌ అంటూ కితాబిచ్చేసింది. అంతే కాదు గజనికాంత్‌ లాంటి చిత్రాల్లో నటించడం జాలీ అని చెప్పింది. వనమగన్‌ చిత్రంలో తన నటనను చూసే జ్ఞానవేల్‌రాజా తనకు ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించారని తెలిపింది. తన కేరీర్‌లో గజనీకాంత్‌ మరో మంచి చిత్రంగా నిలిచిపోతుందని చెప్పింది. 

ఇక ఆర్య కూడా సాయేషాపై పొగడ్తల వర్షం కుపించారు. సాయేషాసైగల్‌ డాన్స్‌ చూసి భయపడిపోయానని, ఆమెతో డాన్స్‌ చేయడానికి చాలా కష్టపడ్డానని ఆర్య చెప్పారు. ఈ చిత్రం తరువాత సాయేషా కార్తీతో కడైకుట్టి సింగం చిత్రంలో నటిస్తోంది. మొత్తం మీద ఈ ఉత్తరాది బ్యూటీ కోలీవుడ్‌లో వరుసగా అవకాశాలను బాగానే రాబట్టుకుంటోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top