ఆమె చివరి భావోద్వేగ పోస్ట్‌ అతడి గురించే

Saroj Khan Insta Post On Sushant Lost - Sakshi

ముంబై: దాదాపు నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్‌ హిట్‌ చిత్రాలకు నృత్య దర్శకురాలిగా పనిచేసిన ‘మాస్టర్‌జీ’ సరోజ్‌ ఖాన్‌(72) శుక్రవారం ఉదయం గండెపోటుతో కన్నుమూశారు. ‘మదర్‌ ఆఫ్‌ డ్యాన్స్‌’గా కీర్తింపబడే సరోజ్‌ ఖాన్‌ మృతి పట్ల బాలీవుడ్‌ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. మరో పెద్దదిక్కును కోల్పోయామని, ఆమె మరణం తీరని లోటని పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు పేర్కొన్నారు. సరోజ్‌ మరణం అనంతరం ఆమె సోషల్‌ మీడియాలో చేసిన చివరి పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. జూన్‌ 14న యువ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య ఘటనపై భావోద్వేగ పోస్ట్‌ చేశారు. (ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్నుమూత)

‘నేను మీతో ఎప్పుడూ పని చేయలేదు కానీ చాలాసార్లు కలుసుకున్నాం. నేను మీ అన్ని చిత్రాలను చూశాను. మీరన్నా, మీ చిత్రాలన్నా నాకెంతో ఇష్టం. అయితే మీ జీవితంలో ఏం పొరపాటు జరిగింది? మీరు మీ జీవితానికి సంబంధించి తీసుకున్న ఈ నిర్ణయంతో తీవ్ర షాక్‌కు గుర్యయ్యాను. నీ కష్టాలను, బాధలను పెద్దవాళ్లతో పంచుకుంటే పరిస్థితి వేరేలా ఉండేది. అప్పుడు మీ కుటుంబ పరిస్థితి ఎంటో నాకు తెలియదు.  మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. సుశాంత్‌ కుటుంబానికి నా ప్రగాఢ సానభూతి తెలుపుతున్నాను’ అంటూ సుశాంత్‌ మృతి పట్ల సరోజ్‌ ఖాన్‌ తన సంతాపం తెలిపారు. (బాలీవుడ్‌లో విషాదం: గుండెపగిలే వార్త)

కాగా 200కు పైగా సినిమాలకు కొరియోగ్రఫి అందించిన సరోజ్ ఖాన్ చివరగా 2019లో కరణ్ జోహర్ తెరకెక్కించిన ‘కళంక్’ సినిమాకు పనిచేశారు. 1950వ దశకంలో బాలనటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సరోజ్‌ఖాన్‌ ఆ తర్వాత కొరియోగ్రాఫర్‌గా మారి మంచి గుర్తింపు పొందారు. మాధురీ దీక్షిత్‌కు పేరు తెచ్చిన ‘తేజాబ్‌’ చిత్రంలోని ‘ఏక్‌.. దో.. తీన్‌’ పాటకు సరోజ్‌ ఖానే కొరియోగ్రఫీ చేశారు.  

హిందీలో వచ్చిన దేవదాస్‌ చిత్రంలోని ‘డోలా రే డోలా’ పాటకు 2003లో, శృంగారం సినిమాలోని అన్ని పాటలకు 2006లో, ‘జబ్‌ వి మెట్‌’లోని ‘యే ఇష్క్‌ హాయే’ గీతానికి 2008లో.. అమె జాతీయ అవార్డులు అందుకున్నారు. తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన ‘చూడాలని ఉంది’ సినిమాకు కూడా ఆమె కొరియోగ్రాఫర్‌గా చేశారు. ఈ చిత్రానికిగాను ఆమె 1998లో నంది అవార్డు దక్కించుకున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top