
‘ఏ మాయ చేశావే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత.. నేటికీ తన మ్యాజిక్‌తో అభిమానులను మాయ చేస్తూనే ఉన్నారు. ఈ సినిమాలో తనతో కలిసి నటించిన హీరో నాగ చైతన్యను ప్రేమించిన ఈ ఆపిల్ బ్యూటీ... తొలి సినిమా జ్ఞాపకాలను వివాహ బంధంతో ముడివేసుకుని.. శాశ్వతంగా గుండెగూటిలో పదిలపరచుకున్నారు. ఇక భార్యాభర్తలిద్దరికీ కెరీర్ పరంగా బిగ్‌బ్రేక్ ఇచ్చిన ఈ సినిమా విడుదలై నేటికి పదేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా... అక్కినేని ఇంటి కోడలికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పదేళ్ల సినీ ప్రస్థానంలో చిరస్థాయిగా నిలిచిపోయే క్షణాల గురించి సమంత తన అభిమానులతో పంచుకున్నారు. లెజండరీ నటుడు, దివంగత అక్కినేని నాగేశ్వరరావు తన గురించి గతంలో చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నారు.
‘‘ఈ సినిమాలో ఎవరి నటనకు వంద మార్కులు వేయాలంటే... చైతన్యకు 49, సమంతకు 51 మార్కులు వేస్తాను’’ అంటూ నాగేశ్వరరావు పేర్కొన్న వీడియోను ఆమె షేర్ చేశారు. కాగా ఏ మాయ చేశావే, ఆటోనగర్ సూర్య సినిమాల్లో నాగ చైతన్యతో కలిసి నటించిన సమంత.. మనం సినిమాలో చైతూ, నాగార్జున, నాగేశ్వరరావు, అఖిల్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైతూను పెళ్లాడిన సమంత.. అక్కినేని వారింట కోడలిగా అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగిస్తూ నటిగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక రీల్‌లైఫ్ భార్యాభర్తలుగా నటించిన సామ్- చైతూ రియల్ లైఫ్‌లో భార్యాభర్తలుగా మారిన తర్వాత కలిసి నటించిన తొలి చిత్రం మజిలీ ఎంత హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమంత నటించిన తాజా చిత్రం జాను కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
❤️🙏 my most favourite moment in these 10 years would have to be this https://t.co/WHrRATC3pC
— Samantha Akkineni (@Samanthaprabhu2) February 26, 2020