తల్లీ బిడ్డకు ఉన్న అనుబంధమే కణం – సాయి పల్లవి

Sai Pallavi Speech At Kanam Pre Release Event - Sakshi

నాగ శౌర్య, సాయి పల్లవి జంటగా ఏఎల్‌.విజయ్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.ఆర్‌ సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ నిర్మించిన చిత్రం ‘కణం’. ఈ సినిమా ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత ఎన్‌వీ. ప్రసాద్‌ మాట్లాడుతూ –‘‘ఈ సినిమాను మా బ్యానర్‌పై తెలుగులో రిలీజ్‌ చేయడం ఆనందంగా ఉంది. సాయి పల్లవి, నాగ శౌర్యకు ఈ సినిమా హ్యాట్రిక్‌ తెచ్చిపెడుతుంది అనుకుంటున్నాను. శ్యామ్‌ సి మ్యూజిక్, నిరవ్‌ షా విజువల్స్‌ ఈ సినిమాకు ప్లస్‌ అవుతాయి.

దర్శకుడు విజయ్‌ ఏ ఉద్దేశంతో ఈ సినిమా తీశారో ఆ ఉద్దేశం నెరవేరాలని కోరుకుంటున్నాను. 37 రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేయడం నిజంగా చిన్న విషయం కాదు. తెలుగులో రిలీజ్‌ చేసే అవకాశం ఇచ్చిన లైకా ప్రొడక్షన్స్‌ వాళ్లకు థ్యాంక్స్‌’’ అన్నారు.  సాయి పల్లవి మాట్లాడుతూ– ‘‘తల్లీబిడ్డకు మధ్య ఉన్న అనుబంధం, తపనే ఈ కథ. చాలా ఎమోషనల్‌   కనెక్ట్‌తో ఈ సినిమా చేశా.  మంచి సినిమా చూశాం అనే ఫీలింగ్‌తో ఆడియన్స్‌ థియేటర్‌ బయటకు రావాలని విజయ్‌ చక్కగా రూపొందించారు.

నాగ శౌర్య చాలా బాగా నటించారు. ఇంత మంచి సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్‌కు థ్యాంక్స్‌. ‘ఫిదా, ఏంసీఎ’ సినిమాల్లాగే ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘మంచి సినిమాలను తెలుగు ఆడియన్స్‌ ఎప్పుడూ ఎంకరేజ్‌ చేస్తూనే ఉంటారు. 2013లోనే ఈ సినిమా ఆలోచన వచ్చింది. టైమ్‌ తీసుకొని చేద్దాం అని వెయిట్‌ చేశాను. నాగ శౌర్య, సాయి పల్లవి, వెరోనికా చాలా బాగా యాక్ట్‌ చేశారు.

ఎన్‌.వీ.ప్రసాద్‌ గారు ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేయడానికి ముందుకు వచ్చారు’’ అన్నారు దర్శకుడు విజయ్‌. ‘‘నాగ శౌర్య, సాయి పల్లవి, వెరోనికా, దర్శకుడు విజయ్‌ అలాగే సినిమాకు పని చేసిన యూనిట్‌ అందరికీ  ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు జెమినీ కిరణ్‌.  ‘‘సినిమాలో నటించిన అందరికి, అలాగే నా మిత్రుడు ఎన్‌.వి.ప్రసాద్‌కు అభినందనలు’’ అన్నారు నిర్మాత బీవీయస్‌ఎన్‌. ప్రసాద్‌.  ‘‘నాగశౌర్య, సాయి పల్లవి మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈ సినిమా కూడా వాళ్లకు పెద్ద సక్సెస్‌ తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నాను’’ అన్నారు శానం నాగ అశోక్‌ కుమార్‌.  ఈ సినిమాకు సంగీతం: శ్యామ్‌ సి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.ప్రేమ్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top