
‘షల్ వీ బిగిన్’కు రూ.16.75 కోట్లు!
జూనియర్ ఎన్టీఆర్ నటిం చిన అదుర్స్ సినిమా... అందులో చారి పాత్రలో విలన్ ఇంట్లో చేరిన ఎన్టీఆర్ మాట్లాడే మూడు ముక్కలు గుర్తున్నాయా..!
జూనియర్ ఎన్టీఆర్ నటిం చిన అదుర్స్ సినిమా... అందులో చారి పాత్రలో విలన్ ఇంట్లో చేరిన ఎన్టీఆర్ మాట్లాడే మూడు ముక్కలు గుర్తున్నాయా..! ‘ఏమో గుర్తులేదు.. తెలీదు.. మర్చిపోయా’ అం టూ లక్షల రూపాయలు తీసుకుం టాడు. సరిగ్గా అలాంటి సన్నివేశమే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎపిసోడ్‌లో జరిగింది. అందులో ఓ నటి మూడే మూడు ముక్కలు ‘షల్ వీ బిగిన్’ అని పలికి 2.6 మిలియన్ డాలర్లు (రూ. 16.75 కోట్లు) రెమ్యునరేషన్ తన ఖాతాలో వేసుకుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనేది ఒక అమెరికన్ ఫాంటసీ, యాక్షన్ సీరియల్.
ఈ సిరీస్ అంటే అభిమానులు పడిచచ్చిపోతారు. ఇప్పటివరకు ఆరు సిరీసుల్లో వచ్చిన ఈ సీరియల్ తాజాగా ఏడో సిరీస్‌ను ప్రారంభించింది. ఈ సీరియల్ వసూళ్లు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. ఇందులో నటించే వారి పారితోషికాలు చూస్తే మాత్రం సగటు అభిమాని ముక్కున వేలేసుకోవాల్సిందే. ఇందులో ఎమిలియా క్లార్క్, కిట్ హరింటన్, లేనా హెడీ, పీటర్ డింక్లేజ్, నికోలస్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒక్కొక్కరూ సుమారు రెండు మిలియన్ డాలర్లు పుచ్చుకున్నారు. వారు మాట్లాడిన మాటలను బట్టి రేటు పెరుగుతుంది.
ఒక్కొక్కరూ ఎపిసోడ్‌కు 2.6 మిలియన్ డాలర్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇందులో కిట్ హరింటన్ మాట్లాడిన పదాలు 560. అంటే ఒక్కొక్క పదానికి సుమారు 4,642 డాలర్లు తీసుకున్నారు. లీనా హెడీ పలికిన పదాలకి 6,565 డాలర్లు, నికోలస్ కోస్టర్ పదాలకి 7,647 డాలర్లు తీసుకోగా, ఎమిలియా క్లార్క్ మాత్రం ఎపిసోడ్‌లో మూడే మూడు ముక్కలు మాట్లాడి 2.6 మిలియన్ డాలర్లు తీసుకుంది. అది కూడా ‘షల్ వీ బిగిన్’ అని చిలుక పలుకులు మాత్రమే పలికి!