మోహన్‌బాబు గురించి నెగిటివ్‌గా చెప్పారు..!

మోహన్‌బాబు గురించి నెగిటివ్‌గా చెప్పారు..!

 ‘మైండ్‌లో ఫిక్స్ అయితే... బ్లైండ్‌గా వెళ్లిపోతా...’ అనే ‘దూకుడు’ సినిమా డైలాగ్ రామ్‌గోపాల్‌వర్మకు సరిగ్గా సరిపోతుంది. మనసులో ఏది అనిపిస్తే అది అనేయడం, ఏది అనిపిస్తే అది చేసేయడం వర్మ స్టయిల్. ఆయన మోహన్‌బాబుతో ‘రౌడీ’ సినిమా చేయడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సినిమాలో ఆశ్చర్యపరిచేవి ఇంకా చాలా ఉంటాయని వర్మ నమ్మకంగా చెబుతున్నారు. ‘రౌడీ’ ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా వర్మతో ‘సాక్షి’ జరిపిన సంభాషణ...

 

 మోహన్‌బాబు, వర్మ.. ఊహించని కలయిక ఇది. అసలు మీ ఇద్దరూ కలసి సినిమా చేయడం ఎలా సాధ్యమైంది?

 ‘శివరంజని’ సినిమా చూసిన రోజుల నుంచే మోహన్‌బాబుగారంటే నాకిష్టం. నిజజీవితంలో కూడా ఆయన వ్యక్తిత్వాన్ని నేను ఇష్టపడతాను. చిత్రమైన వ్యక్తిత్వం, భిన్నమైన స్టయిల్, ముక్కుసూటితనం, దాపరికం లేకుండా మాట్లాడటం... ఆయనలోని ఈ లక్షణాలన్నీ నన్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆయన స్పందించే తీరు గమనించాక ఆయన ఓ డైనమిక్ పర్సన్ అని నాకర్థమైంది. ఆయన్ను దృష్టిలో పెట్టుకొనే ‘రౌడీ’ కథ రాశాను. నిజజీవితంలో ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే పాత్ర ఇది. ఇందులో ఆయన ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్ చూస్తారు. ఇంతవరకూ నా సినిమాల్లో కనిపించని భావోద్వేగాలు ఇందులో ఉంటాయి.  

 

 మీరు, మోహన్‌బాబు ఉత్తర దక్షిణ ధ్రువాలు. అలాంటి మీ మధ్య చిత్రీకరణ సమయంలో భేదాభిప్రాయాలు రాలేదా?

 షూటింగ్ జరిగిన 43 రోజుల్లో ఒక్కసారి కూడా మాకు అభిప్రాయ భేదాలు తలెత్తలేదు. షూటింగ్ మొదలు కాకముందు చాలామంది మోహన్‌బాబుగారి గురించి నెగిటివ్‌గా చెప్పారు. కోపిష్ఠి అనీ, నచ్చకపోతే కొట్టినంత పనిచేస్తారనీ ఏవేవో అన్నారు. అయితే.. ఒక్కసారి లొకేషన్‌కి వెళ్లాక నా అనుమానాలన్నీ పటాపంచలై పోయాయి. నిజంగా ఆయన చాలా మంచి వ్యక్తి. విగ్ తీసేసి నటించమని అడిగితే... ఎవరూ తేలిగ్గా అంగీకరించరు. కానీ... ఆయన మారు మాట్లాడకుండా విగ్ తీసేశారు. నా కెరీర్‌లో ఇంత సాఫీగా పూర్తయిన సినిమా ఇదే. 

 

 హిందీలో మీరు తీసిన ‘సర్కార్’ సినిమాకే 

 రాయలసీమ నేపథ్యాన్ని జోడించి ‘రౌడీ’గా తీశారని బయట టాక్..

 యాక్షన్ నేపథ్యానికి కుటుంబ విలువల్ని జోడించి తీసిన ఏ సినిమాలోనైనా.. ‘గాడ్‌ఫాదర్’, ‘సర్కార్’ చిత్రాల ఛాయలు కనిపిస్తాయి. ‘సర్కార్’లో ఉండే భావోద్వేగాలు వేరు, ఇందులోని భావోద్వేగాలు వేరు. అందులోని సమస్యలు వేరు, ఇందులోని సమస్యలు వేరు. తండ్రీ కొడుకుల కథ అనగానే.. అందరికీ ‘సర్కార్’ సినిమా గుర్తుకు రావడం సహజం.  అసెంబ్లీ రౌడీ, రౌడీగారి పెళ్లాం, రౌడీ మొగుడు... ఇలా ‘రౌడీ’ అనే టైటిల్ ఉన్న మోహన్‌బాబు సినిమాలన్నీ హిట్లే. 

 

 ఆ సెంటిమెంట్‌తోనే  ఈ టైటిల్ పెట్టారా?

 ఓ సందర్భంలో విష్ణు... ఈ సినిమాల లిస్ట్ చెప్పాడు. నా కెందుకో ఆ ‘రౌడీ’ అనే పదం బాగా కనెక్ట్ అయ్యింది. ఆ పదం ఓ ధిక్కార గుణాన్ని సూచిస్తుంది. అందుకే వెంటనే ‘ఓకే’ చేశాం. ముందు వెళుతున్నవాళ్లను బలవంతగా వెనక్కులాగి ముందుకెళ్లడం నా దృష్టిలో రౌడీయిజం. కానీ, ఇందులో అయినవారి కోసం వెనక్కు వెళ్లడానికి కూడా వెనుకాడదు మోహన్‌బాబు పాత్ర. అంటే... మంచి రౌడీ అన్నమాట. రియల్‌లైఫ్‌లో కూడా మోహన్‌బాబుది ఇలాంటి క్యారెక్టరే. అందుకే...  మోహన్‌బాబుని మంచి రౌడీగా అభివర్ణిస్తాన్నేను. 

 

 ఇందులో విష్ణు పాత్ర ఎలా ఉంటుంది?

 పోస్టర్లపైనా, తెరపైనా హీరో అనవసరంగా నవ్వుతూ ఉంటే నాకు నచ్చదు. నా చిత్రాల్లో హీరోలు నవ్వినా అది సీరియస్‌గానే ఉండాలి. అదే చెప్పా. ఈ సినిమాలో నువ్వు నవ్వడానికి వీల్లేదని కండిషన్ పెట్టా. చెప్పినట్లే చేశాడు తను. అతనిలో మంచి నటుడున్నాడు.  ఈ సినిమాలో అతని నటన చూసి, జనం ఆశ్చర్యపోతారు.

 

 రాజశేఖర్‌తో ‘పట్టపగలు’ సినిమా చేస్తున్నట్లున్నారు. ఉన్నట్టుండి ఆయనతో సినిమా చేయాలని ఎందుకనిపించింది?

 ఓ సందర్భంలో ఇద్దరం కలిశాం. అనుకోకుండా సెట్టయ్యింది. షూటింగ్ తొమ్మిదింటికి అంటే... ఎనిమిదిన్నరకే లొకేషన్లో ఉండేవారాయన. అందుకే 24 రోజుల్లో ఆ షూటింగ్ పూర్తి చేయగలిగాం. 

 

 తెలుగులో అగ్ర హీరోలతో సినిమాలు చేశారు. ఇక మిగిలింది బాలకృష్ణే. మరి ఆయనతో ఎప్పుడు చేస్తారు?

 బాలకృష్ణగారిని డెరైక్ట్ చేసే స్థాయి నాకు లేదు. ఆయన అభిమానుల్ని ఆనందింప చేసేంత సామర్థ్యం నా దగ్గర లేదు.

 

 త్వరలో రాజకీయాల్లోకొస్తున్నారట. హైదరాబాద్‌లో ముస్లిమ్ రాజకీయ వేత్తకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నారట?

 అది మీడియా సృష్టి. నాకు రాజకీయాలు బొత్తిగా తెలీవు.

 

 మోడీని కలవగానే పవన్‌పై ప్రజల అభిప్రాయం మారిపోయింది!

 

 పవన్‌కల్యాణ్ రాజకీయాల్లోకి రావాలని మీరెందుకు కోరుకున్నారు?

 బావుంటాడు కదా. ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో పెద్ద అందంగా ఉండేవాళ్లు ఎవరూ లేరు. పవన్‌కల్యాణ్ పాలిటిక్స్‌లోకొస్తే చూడటానికైనా రాజకీయాలు బావుంటాయని! 

 

 రాజకీయంగా ఆయన సక్సెస్ అవుతాడని భావిస్తున్నారా?

 చెప్పలేం. తొలి సభలో అతను మాట్లాడిన తీరు నాకు నచ్చింది. రెండు గంటలు బాగానే కూర్చోబెట్టాడు. అయితే... నరేంద్రమోడీని ఎప్పుడైతే కలిశాడో... అప్పుడే అతనిపై జనాలకున్న అభిప్రాయం  మొత్తంగా మారిపోయింది. ఇటీవల వైజాగ్‌లో జరిగిన బహిరంగ సభలో కూడా అతని మాటలు పూర్తిగా తేలిపోయాయి. అస్సలు ఆకట్టుకోలేకపోయాడు. ఒక్కమాటలో చెప్పాలంటే... తుస్సుమనిపించాడు!

 

 పవన్‌కల్యాణ్ ‘ఇజమ్’ పుస్తకం చదివారా?

 రెండు పేజీలు చదివాను. నాకేం అర్థం కాలేదు. అసలు రాసిన వాళ్లకైనా ఈ పుస్తకం అర్థమవుతుందా అని నా అనుమానం. నాకు తెలిసి ఈ పుస్తకం పవన్‌కల్యాణ్‌కి కూడా అర్థమై ఉండదు. ఈ పుస్తకం ద్వారా తాను ఏం చెప్పబోతున్నాడు? అసలు అతని ‘ఇజం’ ఏంటి? అనేది ఎవరికీ అర్థం కాని విషయం. ఆ పుస్తకంలో వాడిన ఇంగ్లిష్ పదాలు కానీ, రాజకీయ భావజాలం కానీ ఆంగ్ల సాహిత్యం, ఫిలాసఫీ పుస్తకాలెన్నో చదివిన నాకే అర్థం కాలేదు. 

 

 ‘చిరంజీవి హఠావో... దేశ్ బచావో’ ... ఆ వ్యాఖ్య మీరు ఎందుకు చేసినట్టు? 

 (నవ్వేస్తూ...) చిరంజీవి హఠావో అంటే ఆయనను వ్యక్తిగతంగా అన్నానని ఎందుకనుకుంటున్నారు? ఇవాళ పార్టీ ప్రచార సారథిగా చిరంజీవి అంటే కాంగ్రెస్. కాంగ్రెసంటే చిరంజీవి. అందుకే చిరంజీవి ‘హఠావో’ అనేశా.

 

 మరి, ‘కాంగ్రెస్ హఠావో’ అన్న పవన్ కల్యాణ్ మాత్రం ఆ మాట అనలేకపోయారేం? 

 (నవ్వేస్తూ...) నో కామెంట్!

 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top