నేనంటే భయానికి భయం

Rakshasudu Movie Trailer Launch - Sakshi

‘నేనంటే భయానికే భయం.. నన్ను పట్టుకోవాలనుకోకు... పట్టుకుందామనుకున్నా అది నేనవను’ అంటూ పోలీస్‌ అధికారి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు ఓ కిల్లర్‌ వార్నింగ్‌ ఇస్తున్న డైలాగ్‌తో ప్రారంభమైన ‘రాక్షసుడు’ ట్రైలర్‌ ఉత్కంఠ రేకెత్తించేలా ఉంది. ‘మనం వెతుకుతున్నవాడు రేపిస్టో, కిడ్నాపరో లేకపోతే వన్‌సైడ్‌ లవరో కాదు... పథకం ప్రకారం హత్యలు చేసే ఒక మతిస్థిమితం లేని వ్యక్తి’, ‘మనం ఊహించిన దానికంటే ఈ కేసులో ఏదో సీరియస్‌నెస్‌ ఉంది మేడమ్‌’ అంటూ బెల్లంకొండ శ్రీనివాస్‌ చెప్పే డైలాగులు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. 

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా రమేష్‌ వర్మ పెన్మత్స దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాక్షసుడు’. ఎ హవీష్‌ లక్ష్మణ్‌ కోనేరు ప్రొడక్షన్స్‌ పతాకంపై కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 2న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘రాక్షసుడు’ ట్రైలర్‌ని విడుదల చేశారు. కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘ఏడాది క్రితం నేను, రమేష్‌ వర్మ కలిసి చెన్నైలో తమిళ చిత్రం ‘రాక్షసన్‌’ని చూశాం.

బాగా నచ్చడంతో రీమేక్‌ చేశాం. హీరోగా నలుగురైదుగురు పేర్లు అనుకుని, సాయిశ్రీనివాస్‌ను తీసుకున్నాం. పోలీసాఫీసర్‌ పాత్రలో బాగా నటించాడు. ఒక మంచి సినిమా తీశామనే తృప్తి కలిగింది’’ అన్నారు. ‘‘సాయిశ్రీనివాస్‌ కెరీర్‌లో ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ అవుతుంది’’ అన్నారు అభిషేక్‌ నామా. ‘‘డైరెక్టర్‌గా చాన్స్‌ ఇచ్చిన కోనేరు సత్యనారాయణగారికి, బెల్లంకొండ సురేశ్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు రమేశ్‌ వర్మ. ‘‘కవచం’ సమయంలో రమేష్‌ వర్మ ఈ రీమేక్‌ గురించి చెప్పారు.

మళ్లీ పోలీస్‌ పాత్రే అనుకుని ముందు ఆసక్తి చూపలేదు. కానీ, తమిళ సినిమా చూశాక అద్భుతంగా అనిపించింది. ఇలాంటి సినిమాను మిస్‌ చేసుకోకూడదనిపించి చేశా. అద్భుతమైన థ్రిల్లర్‌. కోనేరు సత్యనారాయణలాంటి నిర్మాత ఈ చిత్రానికి లభించడం అదృష్టం. ఈ బ్యానర్‌లో తొలి చిత్రం నాదే కావడం హ్యాపీ. రమేష్‌ వర్మతో సహా అందరూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు’’ అన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. నటుడు కాశీ విశ్వనాథ్, బేబీ దువా కౌశిక్, కెమెరామేన్‌ వెంకట్‌ సి. దిలీప్, ఎడిటర్‌ అమర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top