రాజ్‌కుమార్‌కు సినీ ప్రముఖుల చేయూత

Puri Jagannadh Help to Director Gudapati Rajkumar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌‌: మెగాస్టార్‌ చిరంజీవి నటించిన తొలి సినిమా ‘పునాదిరాళ్లు’కు దర్శకత్వం వహించిన గూడపాటి రాజ్‌కుమార్‌ ప్రస్తుతం అనారోగ్యంతో మంచానపడి వైద్య ఖర్చులకు కూడా భారమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ విషయాన్ని ‘పునాదిరాళ్లకు పుట్టెడు కష్టాలు’ శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. బుధవారం ప్రముఖ సినీ దర్శకులు పూరి జగన్నాథ్‌ రూ.50 వేలు, మెహర్‌ రమేష్‌ రూ.10 వేలు, కాశీవిశ్వనాథ్‌ రూ.5 వేలు చొప్పున ఆయనకు ఆర్థిక సహాయం అందించారు. వారి స్పందనకు రాజ్‌కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. రాజ్‌కుమార్‌ దీనస్థితి గురించి ‘సాక్షి’  ద్వారా తెలుసుకుని ఇంతకుముందు ప్రసాద్స్‌ క్రియేటివ్‌ మెంటర్స్‌ ఫిలిం మీడియా స్కూల్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ సురేష్‌రెడ్డి రూ.41వేలు అందజేశారు. ‘మనం సైతం’ తరఫున నటుడు కాదంబరి కిరణ్‌కుమార్‌ రూ.25 వేల నగదు అందజేశారు.

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో హిట్‌ కొట్టిన పూరి జగన్నాథ్‌ తన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్‌ 28న దర్శకత్వ విభాగంలో 30 మంది సభ్యులకు 50 వేల చొప్పున 15 లక్షలు సహాయం చేసి మంచి మనసు చాటుకున్నారు. ప్రతి ఏడాది పూరి జగన్నాథ్‌ పుట్టినరోజున ఇలాంటి దాతృత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు నటి, నిర్మాత ఛార్మీ ఈ సందర్భంగా వెల్లడించారు. దర్శకులకు సహాయం చేయాలనే ఆలోచన పూరి జగన్నాథ్‌కు రావడం అభినందనీయమని, ఎన్నో కుటుంబాల ఆశీస్సులు ఆయనకు ఉంటాయని కాశీ విశ్వనాథ్‌ అన్నారు. తాజాగా రాజ్‌కుమార్‌కు కూడా పూరి జగన్నాథ్‌ సహాయం చేయడంతో ‘దటీజ్‌ పూరి’ అంటూ అభిమానులు మెచ్చుకుంటున్నారు. (చదవండి: ‘పునాదిరాళ్ల’కు పుట్టెడు కష్టం)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top