సాయం మాని 'సెల్'తో ఫోటోలా? | Prakash Raj shaken for some time by the inhuman attitude of the people | Sakshi
Sakshi News home page

సాయం మాని 'సెల్'తో ఫోటోలా?

Aug 15 2014 2:17 PM | Updated on Sep 2 2017 11:55 AM

సాయం మాని 'సెల్'తో ఫోటోలా?

సాయం మాని 'సెల్'తో ఫోటోలా?

ఆపదలో ఉన్నవారికి సాయం అందించాలన్న స్పృహ లేకుండా తన ఫోటోలు తీసుకోవడంలో నిమగ్నమైన యువతను చూసి ప్రకాశ్రాజ్ ఆందోళన చెందారు.

ఆధునిక యుగంలో మానవత్వం అడుగంటిపోతోంది. సాటి మనిషి కళ్లెదుటే కష్టాల్లో ఉంటే చేతనైన సాయం చేయడానికి కూడా ముందుకురాని మనుషులెందరో. ఎవడికే సమస్య వస్తే తానెందుకు స్పందించాలన్న సంకుచిత ధోరణి ఎక్కువగా కనబడుతోంది. సాటివాడు చావుబతుకుల్లో ఉన్నా పట్టించుకునే తీరికేలేని సమాజంలో మన మున్నామంటే ఆందోళన కలుగుతోంది. సమాచార సాంకేతిక వెల్లువలో కొట్టుకుపోతూ మానవత్వాన్ని మర్చిపోతున్నాం. టెక్నాలజీకి ఇచ్చే విలువ మనిషి ప్రాణానికి ఇవ్వడం లేదంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఇందుకు హైటక్ సిటీకి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదమే సజీవ రుజువు.

ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్ ప్రయాణిస్తున్న ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ప్రకాశ్రాజ్ ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన బస్సు ఢికొట్టింది. మరో ఆటోను కూడా ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఓ కుటుంబం రోడ్డు మీద పడింది. గాయాలపాలైన కుటుంబాన్ని పట్టించుకోవడం మానేసి అక్కడున్నవారిలో చాలా మంది తన ఫోటోలు తీసుకోవడాన్ని చూసి ప్రకాశ్రాజ్ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆపదలో ఉన్నవారికి సాయం అందించాలన్న స్పృహ లేకుండా తన ఫోటోలు తీసుకోవడంలో నిమగ్నమైన యువతను చూసి ఆయన ఆందోళన చెందారు. జరిగిన ప్రమాదం కంటే మనుషుల అమానవీయ నైజమే తనను ఎక్కువ భయానికి గురిచేస్తోందని తర్వాత ట్విటర్ లో పేర్కొన్నారు. మానవత్వాన్ని మరిచి మనం ఎక్కడకు పోతున్నామంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాటివాడికి సాయం చేయలేని దుస్థితిలో ఉన్నందుకు సిగ్గుతో తలవంచుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి ఘటనలు రోజూ ప్రతిచోట జరుగుతూనే ఉన్నాయి. అయితే మనుషులు స్పందించే తీరే అభ్యంతరకరంగా ఉంది. డిజిటల్ మోజులో పడి మనిషి స్పందన రహితుడుగా మారిపోతున్నాడు. చేయి చాచి సాయం అందించడం మానేసి సెల్ ఫోన్ లో బంధించడానికే ప్రాధాన్యత ఇస్తున్నాడు. ప్రతి విషయంలోనూ ఇలానే ప్రవర్తిస్తున్నాడు. ఎదురుగా ఉన్న మనిషిని వదిలేసి ఏమాత్రం విశ్వసనీయత లేని 'డిజిటల్' బంధాల కోసం వెంపర్లాడుతున్నాడు. ప్రాణం కంటే విలువైనది, మానవత్వం కంటే గొప్పది ఏదీ లేదని తెలుసుకుంటే మంచిది. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న.  కాదంటారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement