రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?

Political Leaders Sirius on Suriya Comments Tamil Nadu - Sakshi

తమిళనాడు, పెరంబూరు: రీల్‌ ఎన్‌జీకే రియల్‌ ఎన్‌జీకే అవుతాడా? పుట్టుకతోనే ఎవరూ వృత్తితో రారు. పరిస్థితులు, ఆలోచనలు, అవకాశాలు, అభిరుచులు ,అన్నింటికీ మించి అదృష్టం ఒక్కో మనిషిని ఒక్కో మార్గంలో నడిపిస్తాయి. ఇదంతా నటుడు సూర్య ప్రస్తుత పరిస్థితి గురించే. సీనియర్‌ నటుడు శివకుమార్‌ పెద్ద కొడుకు సూర్య, రెండవ కొడుకు కార్తీ. ఇద్దరూ తండ్రి అడుగు జాడల్లోనే నటులుగా రాణిస్తున్నారు. నటుడు శివకుమార్‌ గత 40 ఏళ్లుగా తన పేరుతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి  పేద  విద్యార్థులకు చేయూత నిచ్చే విధంగా వారి చదువుకు ఆర్ధిక సాయం అందిస్తూ వస్తున్నారు. కాగా సమీపకాలంలో ఆయన బాధ్యతలను  కొడుకు సూర్య తీసుకుని అగరం పౌండేషన్‌ ద్వారా విద్యాదానంతో పాటు వ్యవసాయ రైతులను ఆదుకునే విధంగా సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. అందుకు తమ్ముడు కార్తీ అండదండలు ఉంటుంన్నాయి.  ఎలాంటి స్వలాపేక్షా లేకుండా శివకుమార్‌ కుటుంబం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు మంచి ప్రశంసలు లబిస్తున్నాయి. ఇంత వరకరూ బాగానే ఉంది. నటన, చిత్ర నిర్మాణం, విద్య, వ్యవసాయదారులకు సేయూత వంటి కార్యక్రమాలతో తన పని తాను చేసుకుపోతున్న నటుడు సూర్య ఇటీవల తన పౌండేషన్‌ ద్వారా నిర్వహించిన విద్యార్ధులకు ఆర్థిక సాయం కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా అమలు పరుస్తున్న నూతన విద్యా విధానం విద్యార్దులకు మేలు చేసే విధంగా లేదనీ, ఐదవ తరగతి నుంచే  ఎంట్రెన్స్‌ పరిక్షలు విధానంతో విద్యార్ధుల భవిష్యత్‌ ప్రశ్నార్ధకంగా మారుతుందనీ,ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల మూత పడే పరిస్థితి నెలకొంటుందనీ కాస్త ఆవేశంగానే మాట్లాడారు.

రాజకీయ నాయకులు విమర్శనల దాడి
కొందరు రాజకీయ నాయకులు సూర్య వ్యాఖ్యలపై విమర్శల దాడికి దిగారు. ముఖ్యంగా బీజేపీ, రాష్ట్ర అధికార పార్టీ నాయకులు సూర్యకు విద్య గురించి ఏం తెలుసని విమర్శిస్తున్నాడు? అంటూ ద్వజమెత్తారు. అయితే కాంగ్రేస్, మక్కళ్‌ నీది మయ్యం పార్టీ,నామ్‌ తమిళర్‌ వంటి రాజకీయ పార్టీలు సూర్యకు అండగా నిలిచారు. దీంతో సూర్యకు రాజకీయ రంగు పులిమేస్తున్నారా? అన్నంతగా పిరిస్థితులు కనిపిస్తున్నారు. కారణం కొందరు సినీ ప్రముఖులతో పాటు అనేక మంది అభిమానులు సూర్యకు మద్దతుగా నిలిచారు. ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా  సూర్య వ్యాఖ్యలను స్వాగతించడంతో పాటు ఆయన్ని విమర్శిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్య అభిమానులే కాకుండా, ఎప్పుడూ వాదులాడుకునే విజయ్,అజిత్‌ అభిమానులు ఒకటై సూర్యకు పూర్తిగా సపోర్టు చేస్తుండటం విశేషం. నటుడు సూర్య విద్యారంగంలో నిపుణులతో అగరం పౌండేషన్‌ను నడుపుతున్నారనీ, విద్యార్దులకు చేయూత నిస్తున్న ఆయనకు విద్యా గురించి తెలియదనడం సమంజసం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నూతన విద్యావిధానం గురించి ఎవరైన తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే వాటిని పరిగణలోకి తీసుకుని చర్చించాలి గానీ, ఎదురు దాడి చేస్తారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలా అనవసరంగా రాదాంతం చేస్తూ కొందరు రాజకీయ నాయకులు ఎలాంటి ఆలోచనా లేని నటుడు సూర్యను రాజకీయాల్లోకి బలవంతంగా వచ్చే పరిస్థితిని కల్పిస్తున్నారా? అనే మాటా వినిపిస్తోంది. విశ్వరూపం చిత్రం విషయంతో ఆ చిత్ర దర్శక,నిర్మాత, నటుడు కమలహసన్‌ను వేదింపులకు గురి చేయడం కారణంగానే ఆయన్ని  రాజకీయ పార్టీను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారనే భావన వ్యక్తం అవుతోంది. కాగా నటుడు సూర్య ఇటీవల నటించిన ఎన్‌జీకే చిత్రంలో  నిజాయితీగా తన పని తాను చేసుకుంటూ సామాజిక సేవలు చేసుకునే  సూర్యను కొందరు రాజకీయ నాయకుల చర్యలు రాజకీయాల్లోకి వచ్చేలా చేయడంతో పాటు ఏకంగా ముఖ్యమంత్రినే అయ్యి పోతాడు. అది రీల్‌ జీవితం అయితే ప్రస్తుతం సూర్య రియల్‌ జీవితంలోనూ రాజకీయనాయకులు బలవంతంగా రాజకీయాల్లోకి నెట్టే చర్యలకు పాల్పడుతున్నారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఇది ఇంతటితో ఆగిపోతుందా?లేక చిలువలు పలువలతో  జటిలంగా మారుతుందా? చూద్దాం. ఎందుకంటే ఏ అర్హత అవసరం లేనిది రాజకీయరంగం. ఎవరైనా తమ అదృష్టాన్ని పరిక్షించుకోవచ్చు. కాగా ప్రస్తుతానికి మాత్రం నటుడు సూర్యకు రాజకీయ రంగప్రవేశ ఆలోచన లేదన్నది ఆయన అనుచరుల మాట.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top