అప్పుడు ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతాను

Niharika Konidela interview about Suryakantham - Sakshi

‘‘ఒక సినిమా హిట్‌ కానంత మాత్రాన డిప్రెషన్‌లోకి వెళ్లిపోవాలా? హిట్‌ అయితే విజయం తలకెక్కాలా? అలా ఏం లేదు. నా గత రెండు చిత్రాలు (ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్‌) ఎగ్జిక్యూషన్‌లో ఫెయిల్‌ అయ్యాయని అనుకుంటున్నాను. యాక్టింగ్‌ కావొచ్చు. ప్రొడక్షన్‌ కావొచ్చు. సోషల్‌ వర్క్‌ కావొచ్చు. నేను ఏ పని చేసినా వంద శాతం కష్టపడతాను. సగం సగం చేయడం, ఎమోషన్స్‌ దాచుకోవడం నాకు ఇష్టం ఉండదు’’ అని నిహారిక కొణిదెల అన్నారు. ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో రాహుల్‌ విజయ్, నిహారిక, పెర్లెన్‌ భేసానియా ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘సూర్యకాంతం’. వరుణ్‌ తేజ్‌ సమర్పణలో సందీప్‌ ఎర్రం రెడ్డి, సుజన్‌ ఎరబోలు, రామ్‌ నరేష్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా నిహారిక పంచుకున్న విశేషాలు...

► సూర్యకాంతంగారంటే సినిమాల్లో ఎక్కువగా ఆమె చేసిన గయ్యాళి పాత్రలే గుర్తుకు వస్తాయి. కానీ అవే సినిమాల్లో ఆమెకు నచ్చిన పాత్రలకు భలే సపోర్ట్‌గా మాట్లాడతారు. ఆ సూర్యకాంతాన్ని మనం మర్చిపోతున్నాం. ఈ సినిమాలో మాత్రం నా క్యారెక్టర్‌ సూర్యకాంతమే పెద్ద సమస్య. ఈ క్యారెక్టర్‌ చేసిన తర్వాత మనం నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలు కూడా చేయవచ్చేమో అనిపించింది. సీనియర్‌ నటి సుహాసినిగారితో నటించడం మంచి అనుభూతిని ఇచ్చింది. ఆమె ఇన్‌పుట్స్‌ భవిష్యత్‌లో నాకు ఉపయోగపడతాయి.

► టైటిల్‌ ఐడియా డైరెక్టర్‌ ప్రణీత్‌దే.‘నాన్నకూచి’ వెబ్‌ సిరీస్‌ను ప్రణీత్‌ చేసినప్పుడు ఓ సీన్‌లో భాగంగా నా కూతురు సూర్యకాంతం అన్నారు మా నాన్నగారు. అవును... ఆయన నన్ను చూసి భయపడతారు (నవ్వుతూ). అందుకే అలా అన్నారేమో. ప్రణీత్‌ ఆ విషయాన్నే గుర్తు పెట్టుకుని ఈ సినిమాకు ఆ టైటిల్‌ పెట్టాడనిపిస్తోంది. విజయ్‌ మంచి కోస్టార్‌. ఈ సినిమా తర్వాత యాక్టర్‌గా అతనికి మంచిపేరు వస్తుంది. ఈ సినిమా స్క్రిప్ట్‌ గురించి అన్నయ్య వరుణ్‌కి చెబితే, బాగుందని సమర్పకుడిగా ఉంటానని అన్నారు. మాతో పాటు కొన్ని సినిమాలు విడుదలవుతున్నప్పటికీ మాది డిఫరెంట్‌ జానర్‌. మంచి ఎంటర్‌టైనింగ్‌ మూవీ. ఎలక్షన్‌ బిజీలో ఉన్నవారు మా సినిమాకు వస్తే రెండు గంటలు హాయిగా నవ్వుకోవచ్చు.

► నా రెండు సినిమాలు ఆడనంత మాత్రాన పెద్దగా బాధపడాల్సింది ఏమీ లేదు. నిహారిక సరిగా యాక్ట్‌ చేయడం లేదనే మాటలు నా వరకు అయితే రాలేదు. బాగా నటించడానికి ప్రయత్నించిందనే మాటలు వినిపించాయి. పెదనాన్న చిరంజీవిగారి కెరీర్‌లో కూడా కొన్ని సినిమాలు ఆడలేదు. యాక్టింగ్‌ లోపం మాత్రం కాదు. సినిమాలు ఆడకపోవడానికి డైరెక్షన్, ప్రొడక్షన్, ఎగ్జిక్యూషన్, సరైన రిలీజ్‌ డేట్‌ దొరక్కపోవడం.. ఇలా చాలా  సమస్యలు ఉంటాయి. పెదనాన్న చిరంజీవిగారిని మైండ్‌లో పెట్టకుని ముందుకు వెళ్తున్నాను. ‘సైరా’ చిత్రంలో నా వంతు షూటింగ్‌ పూర్తయింది. చిరంజీవిగారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నాను. కానీ డైలాగ్స్‌ లేవు.

► నాకు ప్రొడక్షన్‌ అంటే చాలా ఇష్టం. మా నాన్నగారు, అరవింద్‌గారిని చూస్తూ పెరిగాను. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో వెబ్‌ సిరీస్‌లు ప్రొడ్యూస్‌ చేస్తాను. ప్లాన్స్‌ జరుగుతున్నాయి. నా దగ్గర ఉన్న కంటెంట్‌ సినిమాకు పనికొస్తుందని అనిపిస్తే చేస్తాను. కానీ సినిమా నా అల్టిమేట్‌ గోల్‌ కాదు.

► చివరిసారిగా కోడిరామకృష్ణగారితో మాట్లాడినప్పుడు ‘కర్తవ్యం’ లాంటి సినిమా నేను చేయాలనే చర్చ జరిగింది. పరుచూరి బ్రదర్స్‌ కూడా ఉన్నారు. ఆయన చనిపోయినప్పుడు ఇదేవిషయం నాకు గుర్తుకు వచ్చింది. నా కోసం పాత్రలు రాయించుకునేటంత పరిచయాలు అయితే ఇండస్ట్రీలో నాకు లేవు. ఆ పాత్రలు నేను చేయగలని నమ్మినప్పుడు దర్శక–నిర్మాతలు వారే వస్తారు.

ఒక యాక్టర్‌తో చేయాలి. మరో యాక్టర్‌తో చేయకూడదు అనే నియమాలు పెట్టుకోలేదు. నా సినిమాల్లో ఎక్కువగా కొత్తవారితోనే నటించాను. ఏదైనా సినిమాకు సైన్‌ చేసేప్పుడు ముందు స్క్రిప్ట్‌ ఆ తర్వాత నా పాత్ర గురించి తెలుసుకుంటాను. ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌లో తొలిసారి విజయ్‌ దేవరకొండను చూశాను. మా ఇద్దరి (విజయ్‌దేవరకొండ, నిహారిక లవ్‌లో ఉన్నారనే వార్త) గురించి వచ్చిన రూమర్‌కు ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌లో క్లారిటీ ఇచ్చాం.

నా యాక్టింగ్‌ కెరీర్‌ పట్ల నేను సీరియస్‌గానే ఉన్నాను. ఏదో వస్తున్నాయి కదా అని సినిమాలు చేయాలనుకోవడం లేదు. మా ఫ్యామిలీకి ఫుడ్‌ పెట్టేది ఇండస్ట్రీ. నిజంగా నాకు సినిమాల పట్ల ఆసక్తి లేకపోతే ఇండస్ట్రీకి వచ్చేదాన్ని కాదు. ‘ఇంద్ర’ సినిమాకు థియేటర్స్‌లో నేను పిచ్చి పిచ్చిగా అరచిన రోజులు గుర్తు ఉన్నాయి. పెదనాన్న చిరంజీవిగారు పడ్డ కష్టాలను దగ్గరగా చూశాను. అలాంటి నేను ఇండస్ట్రీని లైట్‌గా తీసుకోను. ఒకవేళ తీసుకున్నానని నాకు అనిపించిన రోజు ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతాను.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top