అల్లూరి నేషనల్‌ హీరో – సి. సునీల్‌కుమార్‌

New telugu movie updates - Sakshi

‘‘స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజుగారిని ఒక ప్రాంతీయ హీరోగా కాకుండా జాతీయ హీరోగా చూపించాలనే ఆలోచనతో ‘సీతారామరాజు: ది ట్రూ వారియర్‌’ అనే సినిమా చేయబోతున్నాం’’ అని దర్శకుడు పి. సునీల్‌కుమార్‌ రెడ్డి అన్నారు. రిసాలి ఫిల్మ్‌ అకాడమీ అండ్‌ స్టూడియోస్‌ సమర్పణలో శ్రావ్య ఫిల్మ్స్‌ సహకారంతో పి. సునీల్‌కుమార్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘సీతారామరాజు: ది ట్రూ వారియర్‌’. ఈ సినిమా విశేషాల గురించి హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో పి.సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ– ‘‘జాతీయ చరిత్రలో అల్లూరి సీతారామరాజుగారికి సముచితమైన స్థానం దక్కకపోవడం తెలుగువారి దురదృష్టం అనుకోవాలి. ఈ సినిమాలో రావు రమేష్, ఎల్బీ శ్రీరామ్, జీవా, షఫీ లాంటి నటులతో పాటు తమిళ, హిందీ నటీనటులు నటిస్తారు. యూరోపియన్‌ యాక్టర్స్‌ను కూడా తీసుకున్నాం. నా కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం. జూన్‌ రెండో వారంలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్లాన్‌ చేస్తున్నాం.

ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనుకుంటుటన్నాం’’ అని అన్నారు. ‘‘అల్లూరి సీతారామరాజు బయోపిక్‌ నిర్మించడం ఆనందంగా ఉంది. రిసాలి ఫిల్మ్‌ అండ్‌ స్టూడియోస్‌తో సినిమా రంగంలోకి రావడం ఆనందంగా ఉంది. మంచి సౌకర్యాలతో వైజాగ్‌లో ఏర్పాటు చేశాం. అకాడమీ స్టూడెంట్స్‌కు ఈ సినిమాకు వర్క్‌ చేసే అవకాశం ఇస్తున్నాం. ఈ ఏడాదిలోనే రెండు సినిమాలను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాం. కన్నడలో కూడా ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నాం. ఇందుకు సునీల్‌కుమార్‌ బాగా సహకరిస్తున్నారు’’ అన్నారు అకాడమీ ప్రతినిధి కె. శ్రీనివాస్‌. ‘‘ గతంలో మేం తీసిన చిత్రాలు బాగా ఆడాయి. నంది అవార్డులు తెచ్చిపెట్టాయి. రిసాలి ఫిల్మ్‌ అకాడమీతో కలిసి ఈ సినిమా చేయడం హ్యాపీ’’ అన్నారు రవీందర్‌. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top