నన్ను నేను కోల్పోయినట్లుగా ఉంది

Mohan Babu condolences to Ambarish - Sakshi

మోహన్‌బాబు

‘‘స్క్రీన్‌ నేమ్‌ ‘రెబల్‌ స్టార్‌’. కానీ రియల్‌గా ‘సింపుల్‌ స్టార్‌.. హంబుల్‌ స్టార్‌’’... ప్రముఖ కన్నడ స్టార్‌ అంబరీష్‌ గురించి పలువురు చిత్రరంగ ప్రముఖులు వ్యక్తపరిచిన అభిప్రాయం ఇది. ‘‘నలుగురూ బాగుండాలని కోరుకునే  వ్యక్తి’’ అని కూడా పేర్కొన్నారు. ఇంత మంచి పేరు ఉంది కాబట్టే... తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ఇండస్ట్రీవాళ్లు ‘ఇక అంబరీష్‌ లేరు’ అనే మాటను జీర్ణించుకోలేకపోతున్నారు. అన్ని భాషల్లోనూ స్నేహితులను సంపాదించుకున్న అజాతశత్రువు అని అంబరీష్‌ గురించి వినిపించే మాట. బెంగళూరులో ఆయన భౌతికకాయానికి నివాళులర్పించడానికి వెళ్లిన మోహన్‌బాబు, ఖుష్బూ, సీనియర్‌ నరేశ్‌లు ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

► అంబరీష్‌గారితో మీ స్నేహం ఎప్పుడు మొదలైంది?
ఎవరు పరిచయం చేశారు అన్నది గుర్తు లేదు కానీ 36 సంవత్సరాల క్రితం మదరాసులో మా ఇంట్లో కలిశాం. ఆ స్నేహం ‘అరేయ్‌.. ఒరేయ్‌’ అని పిలుచుకునేంత గాఢమైంది. అప్పట్లో మదరాసులో వాడు హోటల్‌లో ఉండేవాడు. ఆ సమయంలో మా ఇంటికి వచ్చేవాడు. అప్పటికి అంబరీష్‌కి పెళ్లి కాలేదు. సుమలత, నేను 10–12 సినిమాలు యాక్ట్‌ చేశాం. చాలా మంచి అమ్మాయి. అంబరీష్, తనూ పెళ్లి చేసుకోవడం.. ఇలా ఆ కుటుంబానికి చెందినవన్నీ మాకు, మా కుటుంబానికి చెందినవన్నీ వాళ్లకూ తెలుసు. నేను బెంగళూర్‌ వెళితే వాడికి ఫోన్‌ చేయాల్సిందే. లేకపోతే ఊరుకోడు. గొప్ప స్నేహితుడు, శ్రేయోభిలాషి.

► అంబరీష్‌గారు నటుడి నుంచి రాజకీయ నాయకు డిగా ఎదగడం చూశారు.. ఆయన ఎదుగుదల గురించి?
నిజానికి మా ఇద్దరి స్నేహం మొదలైనప్పుడు నేను విలన్‌గా చేస్తున్నాను. అంబరీష్‌ అప్పటికే మంచి స్టార్‌. కానీ మా మధ్య ఆ తేడాలేవీ ఉండేవి కాదు. మంచి నటుడు అనిపించుకున్నాడు. యంఎల్‌ఏ అయ్యాడు. అన్నీ కష్టపడి సాధించుకున్నాడు. ఆ ఎదుగుదలలో భాగంగా వాడు ఏ ఫంక్షన్‌కి పిలిచినా వెళ్లేవాడిని. ఒకవేళ  ఒకటీ అరా వెళ్లకపోతే ఇంట్లో వాళ్లకు ఫోన్‌ చేసి ‘ఎక్కడ వాడు.. ఆ రాస్కెల్‌ ఎక్కడ?’ అని అడిగేవాడు. నన్ను తిట్టేవాళ్లలో మొదటి వ్యక్తి వాడే. ‘అరేయ్‌ ఒరేయ్‌’ అనే మాటలకన్నా నన్ను ఎక్కువగానే తిట్టేవాడు. అంత చనువుంది. మా స్నేహాన్ని మాటల్లో చెప్పలేం.

► అంబరీష్‌గారు భోజనప్రియుడు అని విన్నాం. ఏది ఇష్టంగా తినేవారు?
 మదరాసులో హోటల్‌లో ఉండేవాడని చెప్పాను కదా. హోటల్‌లో ఉండే అన్ని రకాల వంటకాలు ఇంట్లో లేకపోయినా ఇంట్లో ఉండే ఒకటీ రెండు కూరలు మనకు బ్రహ్మాండంగా అనిపిస్తాయి. అందుకే మా ఇంటి నుంచి క్యారేజీ పంపించేవాళ్లం. చికెన్, మటన్‌ బాగా ఇష్టపడి తినేవాడు. ఎందుకో కానీ చేపలంటే తనకి ఇష్టం ఉండేది కాదు. నన్ను కూడా తినొద్దనేవాడు. నేను బెంగళూరు వెళితే అప్పుడు కూడా ఫిష్‌ తప్ప చికెన్, మటన్‌ వండించేవాడు.

► చివరిసారిగా అంబరీష్‌గారిని మీరెప్పుడు కలిశారు?
మా అమ్మగారు చనిపోయిన రోజున (ఈ ఏడాది సెప్టెంబర్‌ 20) ఫోన్‌ చేశాడు. ‘కొంచెం ఆరోగ్యం బాగాలేదు.. రాలేకపోతున్నాను. బాధగా ఉంది. కొన్ని రోజుల తర్వాత వచ్చి కలుస్తాను’ అన్నాడు. పది రోజుల ముందు ఫోన్‌ చేశాడు. నేను అప్పుడు తిరుపతిలో ఉన్నాను. వైకుంఠ ఏకాదశికి కుటుంబంతో తిరుపతి రావాలనుకుంటున్నాను అన్నాడు. అంతకు ముందు సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున ఫ్యామిలీతో సహా తిరుపతి వచ్చాడు. నేనే దగ్గరుండి తీసుకెళ్లాను. రెండు గంటల పాటు దైవ సన్నిధిలోనే ఉన్నాం.

► స్నేహం ఏమీ ఆశించదంటారు.. మీ ఇద్దరి స్నేహం అలానే సాగిందా?
ఈ రోజు వరకూ కూడా వాడు ఫలానాది కావాలి అని అడిగింది లేదు. ఎప్పుడైనా నేనేమైనా అడిగానేమో గుర్తు లేదు. మాది స్వచ్ఛమైన స్నేహం. నా లైఫ్‌లో గొప్ప స్నేహితుడు వాడు. శ్రేయోభిలాషి.  అంబరీష్‌ లేడనే మాట విని బాధపడిపోయాను. మా కుటుంబం మొత్తం ఇక్కడే ఉన్నాం. అంబరీష్‌ అంతిమక్రియలు జరిగే వరకూ బెంగళూరులోనే ఉంటాను. నా మిత్రుడికి చివరి వీడ్కోలు ఇచ్చినప్పటికీ నా మనసులో నుంచి ఎప్పటికీ చెరిగిపోడు. నా ఆప్తమిత్రుల్లో ఒకరిని కోల్పోయాను. నన్ను నేను కోల్పోయినట్లుగా అనిపిస్తోంది.

‘అడుగు ఆపకూడదు అనేవారు’
— సీనియర్‌ నరేశ్‌
చివరిసారిగా అంబరీష్‌గారిని ఎప్పుడు కలిశారు?
గతేడాది బెంగళూరులో ఆయన వెడ్డింగ్‌ యానివర్సరీ సందర్భంగా అందర్నీ పిలిచారు. అప్పుడు కలిశాను. ఆ తర్వాత కన్నడ నటీనటుల సంఘం (కళారధి) భవనం ప్రారంభోత్సవానికి వెళ్లాను. నటీనటుల కోసం బెంగళూరులో అంత పెద్ద బిల్డింగ్‌ రావడం ఆయన కృషి వల్లే సాధ్యమయింది. నేను చివరిసారిగా అంబీ అన్నను కలిసింది ఆ బిల్డింగ్‌ ఓపెనింగ్‌ అప్పుడే. దాదాపు 9 నెలలు అవుతుంది అనుకుంటున్నాను.

అసలు మీరు అంబరీష్‌గారిని ఫస్ట్‌ ఎక్కడ కలిశారు?
1983–84–85 టైమ్‌లో ఆయన చెన్నైలో ఉండేవారు. ఆ టైమ్‌లో ఫస్ట్‌ కలిశాను. ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు. నా కెరీర్‌ తొలినాళ్లలో ఆయన వందో చిత్రం షూటింగ్‌ టైమ్‌లో కలిశాను. ఆయన్ను బ్రదర్‌లా అనుకునేవాడిని.

అంబరీష్‌గారిలోని నటుడ్ని చూసి మీకేనిపించేది?
కన్నడంలో రాజ్‌కుమార్‌గారి తర్వాత మాస్‌ హీరో అంటే అంబరీష్‌గారే. ఆయన్ను తొలిసారి బ్లాక్‌ అండ్‌ వైట్‌ మూవీ ‘అంత’ (తెలుగులో ‘అంతం కాదిది ఆరంభం’)లో వెండితెరపై చూశాను. స్క్రీన్‌పై అంబీ అన్న నటన చూసి, ఆశ్చర్యపోయాను. సౌత్‌ నుంచి ఓ సినీ దిగ్గజం వెళ్లిపోయింది.

అంబరీష్‌గారు ఎలాంటి వారు?
ఆయనకు వయసు భేదం లేదు. అందరినీ కలుపుకునే పెద్ద మనసు ఉన్న వ్యక్తి. ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఇదే చెబుతారు. చాలా ధారాళమైన హృదయం ఉన్న వ్యక్తి. చాలా సరదా మనిషి.
అంబరీష్‌గారితో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారా?
కలిసి నటించలేదు. కృష్ణగారితో సుమలతగారు సినిమాలు చేశారు. అలా ఆ కుటుంబానికీ, మా కుటుంబానికీ మంచి అనుబంధం ఉంది.

మీకు ఏమైనా సలహాలు ఇచ్చేవారా?
లైఫ్‌లో ఎప్పుడూ ఒక అడుగు ముందుకు వేస్తూనే ఉండాలి. ఆగకూడదు అనేవారు. చాలా మొండివాడు. ధైర్యవంతుడు. సినిమాల్లో, రాజకీయాల్లోనూ, దానధర్మాల్లోనూ ముందు ఉండేవారు.

అంబరీష్‌గారి నుంచి స్ఫూర్తి పొందే విషయాలు చెబుతారా?
చాలా ఉన్నాయి. మేజర్‌గా ధైర్యం, కలుపుగోలుతనం, దానగుణం.

'స్థాయిని బట్టి మాట్లాడే వ్యక్తి కాదు'
– ఖుష్బూ

మీ కెరీర్‌ స్టార్టింగ్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడు అంబరీష్‌గారు స్టార్‌. ఆయనతో సినిమా చేసినప్పుడు ఎలా ఉండేది?
అంబరీష్‌గారు చాలా కంఫర్ట్‌బుల్‌. చాలా ఫ్రెండ్లీ నేచర్‌. ఆయనతో పని చేయడాన్ని ఎంజాయ్‌ చేయొచ్చు. ఎవరైనా సరే రిపీటెడ్‌గా వర్క్‌ చేయాలనుకునే స్టార్‌ అంబరీష్‌. అంత కంఫర్ట్‌బుల్‌.

ఫస్ట్‌ టైమ్‌ అంబరీష్‌గారిని ఎప్పుడు కలిశారు?
‘ఒంటి సలగా’ అనే కన్నడ సినిమా సెట్లో మెదటిసారి కలిశాను. నేను సూపర్‌స్టార్‌ని. నన్ను అందరూ గౌరవించాలి, నన్ను చూసి భయపడాలి అనుకునే మనిషి కాదు అంబరీష్‌గారు. అలాంటివి కోరుకోరు కూడా. చాలా హంబుల్‌గా ఉండేవారు. అందుకని నాకు భయం అనిపించలేదు.

పవర్‌ఫుల్‌ మాస్‌ రోల్స్‌ చేయడంవల్ల అంబరీష్‌గారికి ‘రెబల్‌స్టార్‌’ ట్యాగ్‌ ఉంది. లొకేషన్‌లో అసిస్టెంట్స్‌తో ఎలా ఉండేవారు?
 స్క్రీన్‌ మీదే ఆయన రెబల్‌ స్టార్‌. బయట అందరినీ సమానంగా చూసేవారు. కెరీర్‌ చివరి వరకూ కూడా ఆయన అలానే ఉన్నారు. స్థాయిని బట్టి మాట్లాడే గుణం లేదాయనకు.

1980లలో నటించిన తారలందరూ ‘రీయూనియన్‌’ అంటూ ప్రతి ఏడాదీ కలుస్తున్నారు. అప్పుడు అంబరీష్‌గారు సందడి చేసేవారా?
ఈ ఏడాది ఆరోగ్య కారణలతో హాజరు కాలేకపోయారు. కానీ ప్రతీ ఏడాది ఫుల్‌ హుషారుగా, సరదాగా ఉండేవారు. చాలా సింపుల్‌గా, నార్మల్‌గా ఉంటారు. కానీ 2015లో మోహన్‌లాల్‌ ఏర్పాటు చేసిన మీట్‌లో చాలా సరదాగా ఆడుతూ పాడుతూ ఉన్నారు. శనివారం వెళుతూ వెళుతూ ఓ చేదు వార్త వినేలా చేస్తుందని ఊహించలేదు. మా అందరికీ పెద్ద షాక్‌. అత్యంత ఆప్తుడిని కోల్పోయాం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top