పవన్‌పై మరోసారి ‘కత్తి’ దూసాడు

Mahesh Kathi Questions Pawan’s Loyalty to Kapus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జనసేన పార్టీ అధ్యక్షుడు, హీరో పవన్‌ కళ్యాణ్‌పై సినీవిమర్శకుడు మహేశ్‌ కత్తి మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. గురువారం రాజమండ్రిలో జనసేన కార్యకర్తల సమావేశంలో తన చుట్టూ ఒక కులమే.. ఉందని తనకు ఓ కులానికి పరిమితం చేస్తే అందరి కుల లెక్కలు బయటపెడతానన్న ​పవన్‌ వ్యాఖ్యలపై ‘కత్తి’ సెటైరిక్‌గా విమర్శించారు. 

‘తుని ఘటన జరిగినప్పుడు కేరళ నుంచి హుటాహుటిన ప్రత్యేక విమానంలో వచ్చిన ఈ విశ్వమానవుడు, మరే ఇతర కుల సమస్య గురించి ఒక్కసారైనా ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అంతేగాకుండా.. మోదీతో చెట్టాపట్టాలేసుకుని ఎన్నికల ప్రచారం చేసిన నిన్ను, మతోన్మాద శక్తులతో చెయ్యి కలపకు అన్న శేఖర్ కమ్ముల చెడ్డోడు అయ్యాడా! ప్రధానమంత్రి అయినంత మాత్రాన మోదీ గుజరాత్ లో చేసింది రైట్ అయిపోతోందా? నీ ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతూనే ఉంది పవన్ కళ్యాణ్’ అని సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించారు.

ఇక అంతకు ముందు చిరంజీవి సామాజిక న్యాయమంటూ మోసం చేశాడు. ఇప్పుడు నువ్వొచ్చావ్‌.. అధికారం వద్దు అంటున్నావ్. రాజకీయం చేసేదే గెలుపుకోసం. అధికారం కోసం. అవి అవసరం లేకుండా సేవ చెయ్యాలంటే ఎన్జీవో పెట్టుకో... రాజకీయాలు ఎందుకు? కాస్త తెలుసుకుని మాట్లాలని సూచిస్తూ.. మహేశ్‌ కత్తి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

గత కొద్దిరోజులుగా కత్తి మహేశ్‌, పవన్‌ అభిమానుల మధ్య మాటల యుద్దం నడుస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఇక ప్రజాక్షేత్రంలో ఉంటా అని పవన్‌ వచ్చిన సమయంలో మహేశ్‌ కత్తి ఎంత మాత్రం వెనక్కు తగ్గకుండా విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. 

 

Back to Top