సుధీర్‌ సొంతంగా నిలబడటం హ్యాపీ

Mahesh Babu About Sudheer Babu at Sammohanam Pre Release - Sakshi

మహేశ్‌బాబు

‘‘సుధీర్‌ నా ఫంక్షన్స్‌కి వచ్చి స్పీచ్‌లు ఇరగదీస్తుంటాడు. తన ఫంక్షన్‌లో మాత్రం సైలెంట్‌ అయిపోతున్నాడు. ‘సమ్మోహనం’ ఫంక్షన్‌ చూస్తుంటే ఒక సూపర్‌ హిట్‌ వైబ్‌ కనిపిస్తోంది. ఆల్‌ ది వెరీ బెస్ట్‌ టు యూనిట్‌’’ అని హీరో మహేశ్‌బాబు అన్నారు. సుధీర్‌బాబు, అదితీరావు హైదరీ జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సమ్మోహనం’. శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ–రిలీజ్‌ వేడుకలో మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘నరేశ్‌గారు ఎప్పుడూ అంత ఎగై్జటెడ్‌గా లేరు.

‘సమ్మోహనం’ ఈ ఇయర్‌ వన్నాఫ్‌ ది బిగ్గెస్ట్‌ హిట్స్‌ అవుతుందని చెప్పడంతో నిజంగా చాలా ఆనందంగా ఉంది. పొద్దున్నే ‘దిల్‌’ రాజుగారు కూడా చెప్పారు. సినిమాపై చాలా మంచి రిపోర్ట్స్‌ క్యారీ అవుతున్నాయని. సుధీర్‌ గురించి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. మా అందరి పనుల్లో మేం బిజీగా ఉంటాం. సుధీర్‌ని ఎప్పుడూ ఏ విధంగా సపోర్ట్‌ చేయలేదు. ఇలా ఆడియో ఫంక్షన్స్‌కి రావడం తప్ప. తను సొంతంగా నిలబడుతున్నందుకు చాలా హ్యాపీ. ఆల్‌ ది వెరీ బెస్ట్‌ సుధీర్‌. మోహనకృష్ణగారి ‘అష్టా చమ్మా, జెంటిల్‌మన్‌’ సినిమాలు చూశా.

చాలా బాగా నచ్చాయి. ‘అష్టా చమ్మా’ నా ఫేవరెట్‌ ఫిల్మ్‌. అంటే.. నా పేరు వాడారని కాదు. నిజంగా ఆ సినిమా నాకు బాగా నచ్చింది. తెలుగు ఇండస్ట్రీకి అదితీకి స్వాగతం పలుకుతున్నా. ‘భరత్‌ అనే నేను’ తర్వాత మిమ్మల్నందర్నీ (అభిమానులు) ఇప్పుడే కలవటం. నిజంగా చాలా ఆనందంగా ఉంది. మీ ఆశీస్సులు, అభిమానం ఇలాగే ఉండాలి. సుధీర్‌ సినిమాని పెద్ద హిట్‌ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ– ‘‘2008లో ఒక రోజు నేను రైలులో వెళ్తుంటే ఓ చిన్నపాప ‘పోకిరి’ సినిమా డైలాగ్‌లు చెబుతోంది.

అప్పుడు నాకు ‘అష్టా చమ్మా’ మూవీ ఐడియా వచ్చింది. కథ రాస్తున్నప్పుడు సినిమాలో మహేశ్‌బాబుగారి ఫుటేజ్‌ ఏమైనా వాడదామా? అన్నారు. నేను పేరు చాలు అన్నాను. ఆ పేరులో మత్తు, మ్యాజిక్, వైబ్రేషన్స్‌ ఉన్నాయి. విజయవాడలో ‘అష్టా చమ్మా’ ప్రీమియర్‌లో ‘మహేశ్‌గారితో ఎప్పుడు సినిమా చేస్తారు’ అని మహేశ్‌ అభిమాని అడిగారు. ఆల్రెడీ చేసేశాను. ‘అష్టా చమ్మా’ అంతా మహేశ్‌గారిదే అని చెప్పాను. నేను చాలా ఇష్టపడి, నా హృదయానికి దగ్గరగా రాసుకుని తీసిన చిత్రం ‘సమ్మోహనం’.

ఈ చిత్రం కేవలం సుధీర్‌బాబు మాత్రమే చేయగలడని సినిమా చూసిన తర్వాత అందరూ అంటారు’’ అన్నారు. ‘‘ఈ పండుగకి మహేశ్‌బాబుగారు రావడం చాలా ఆనందంగా ఉంది. యూనిట్‌ అంతా కలసి ఒక మంచి సినిమా చేశాం. చాలా మంచి పేరొస్తుంది. పేరుతో పాటు డబ్బు కూడా వస్తుంది. ఎందుకంటే ఇది నెక్ట్స్‌ లెవల్‌ ఫిల్మ్‌ అనిపించింది. ఈ సినిమాని ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్‌. ‘‘ఈ ఫంక్షన్‌కి రాకముందు వరకూ ఓ చిన్న భయం ఉండేది.

‘సమ్మోహనం’ మంచి సినిమా, ప్రేక్షకులకు రీచ్‌ అవుతుందా? లేదా? అని. ఎప్పుడైతే మహేశ్‌ ఓ కొత్త గెటప్‌తో ఈ ఫంక్షన్‌కి వస్తున్నాడని తెలిసిందో అప్పుడు చాలామంది ఇక్కడికి రావడానికి ట్రై చేస్తారు. ఎంతోమంది టీవీల్లో చూస్తారు. ఇప్పుడు చూడకపోయినా యూట్యూబ్‌లో చూస్తారు. చూసేటప్పుడు ‘సమ్మోహనం’ గురించి వింటారు. టీజర్, ట్రైలర్‌ చూస్తారు. వాళ్లకి నచ్చుతుంది. తర్వాత సినిమా కూడా చూస్తారనే నమ్మకం వచ్చింది. ఇక్కడికి వచ్చినందుకు మహేశ్‌కి థ్యాంక్స్‌. ఇంద్రగంటిగారి నుంచి చాలా నేర్చుకున్నా. కానీ, నాకు ఇప్పుడు ఎలా చెప్పాలో మాటలు రావడం లేదు. ‘సమ్మోహనం’ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్‌’’ అన్నారు సుధీర్‌బాబు. ‘‘సమ్మోహనం’ నా తొలి తెలుగు సినిమా. సుధీర్‌ అమేజింగ్‌ కో–స్టార్‌.

టీమ్‌ అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు అదితీరావ్‌ హైదరీ. తనికెళ్ల భరణి మాట్లాడుతూ – ‘‘గ్రహణం’ సినిమా  నుంచి ‘సమ్మోహనం’ వరకూ మా మోహనకృష్ణ ఎదుగుదల కంగారు లేకుండా స్థిమితంగా హాయిగా ఉంది. ఇవాళ తెలుగు సినిమా రూట్‌ మారుతోంది. కొత్త చిత్రాలను విపరీతంగా ఎంకరేజ్‌ చేసి, చిన్న సినిమాలకు కొత్త ఊపిరి పోస్తున్నారు నూతన దర్శకులు. శివలెంకగారు ‘ఆదిత్య 369’ నుంచి నాకు పరిచయం. కమిటెడ్‌ ప్రొడ్యూసర్‌ ఆయన. ఇంద్రగంటి షూటింగ్‌కి ఎప్పుడెళ్లినా మన ఇంటికి మళ్లీ మనం వెళ్లినట్లుంటుంది. ఈసారి పెద్ద సినిమా, ఎక్కువ రోజులు ఉండే సినిమా తీయాలని కోరుతున్నా’’ అన్నారు.

నిర్మాత ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘మరో వారంలో మన 25వ సినిమా (మహేశ్‌బాబు) మొదలవుతుంది. ‘అష్టాచమ్మా, జెంటిల్‌మన్‌’ వంటి ఎన్నో మంచి సినిమాలను మోహనకృష్ణగారు మనకు అందించారు. హీరోయిన్‌ని ఓ కుర్రాడు ప్రేమిస్తే ఏంటన్న కథాంశంతో ‘సమ్మోహనం’ తీశారు. ఈ కథకి ప్రతి ఒక్కరూ రిలేట్‌ అవుతారు. సినిమా చాలా బాగుందని పోస్ట్‌ ప్రొడక్షన్‌లోనే రిపోర్ట్స్‌ వస్తున్నాయి. దర్శక–నిర్మాతలకు ఆల్‌ ది బెస్ట్‌. సుధీర్‌కి ఇంకో హిట్‌ రాబోతోంది’’ అన్నారు.

దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ – ‘‘ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చిన టైటిల్స్‌లో ‘సమ్మోహనం’ ఒకటి. ఒక లవ్‌స్టోరీకి ఇంతకంటే మంచి టైటిల్‌ పెట్టలేమేమో? ఇంద్రగంటిగారు తీసిన చిత్రాల్లో ఈ సినిమా పెద్ద స్థాయిలో హిట్‌ అవుతుందనుకుంటున్నా. ట్రైలర్‌ చూశా. లుకింగ్‌ వెరీ ఫ్రెష్‌. సుధీర్‌ కెరీర్‌లో ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. దర్శకుడు హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ – ‘‘మనకున్న మంచి రచయిత–దర్శకుల్లో వన్నాఫ్‌ ది ఫైనెస్ట్‌ ఇంద్రగంటిగారు. సార్‌.. నేను మీ పనికి ఫ్యాన్‌ని. ఈ ఫంక్షన్‌ నాకు చాలా స్పెషల్‌. ఎందుకంటే ఈ సినిమాలో నేనూ పార్ట్‌ అయ్యాను.

సుధీర్‌ ఇటీవల నిర్మాతగా మారారు. ఇప్పుడు ప్రొడక్షన్‌ ఎందుకు? అన్నాను. ‘ఇక్కడ సంపాదించింది ఇక్కడే పెట్టాలి కదా భయ్యా’ అన్నాడు. ఆ మాటకి హ్యాట్సాఫ్‌ సుధీర్‌. డైరెక్టర్స్‌ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు నటించే వ్యక్తి మహేశ్‌గారు. ఏ పాత్రలో అయినా ఒదిగిపోతారు’’ అన్నారు. కెమెరామేన్‌ పి.జి.విందా, సంగీత దర్శకుడు వివేక్‌ సాగర్, దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, వంశీ పైడిపల్లి, తరుణ్‌ భాస్కర్, నిర్మాత అచ్చిరెడ్డి,  నటులు నరేశ్, కాదంబరి కిరణ్, రాహుల్‌ రామకృష్ణ, నటి  పవిత్రా లోకేశ్, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top