అశ్వనీదత్‌గారికి ఆ లోటు తీరిపోయింది

mahanati and celebrates the success meet in chiranjeevi - Sakshi

చిరంజీవి

‘‘నా అభిమాన నటి సావిత్రి అనే విషయం అందరికీ తెలిసిందే. ‘పునాది రాళ్లు’ సినిమాలో సావిత్రిగారు హీరో తల్లి పాత్రలో నటిస్తే.. నేను హీరో ఫ్రెండ్స్‌లో ఒకడిగా నటించాను. రెండు మూడు సన్నివేశాలు సావిత్రి గారితో కలిసి నటించే అవకాశం కలగడం నా అదృష్టం. మంచి ఆర్టిస్ట్‌గా ఎదగాలని అప్రిషియేట్‌ చేశారు. అలాంటి మహనటిపై సినిమా తీయడం. అది కూడా అశ్వనీదత్‌ నిర్మాణ సారథ్యంలో తన కుమార్తెలు స్వప్నా, ప్రియాంకలు చేయడం ఆనందంగా ఉంది.

నాగ్‌ అశ్విన్‌ అత్యద్భుతంగా తీశాడు’’ అన్నారు చిరంజీవి. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో కీర్తీ సురేశ్‌ టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘మహానటి’. వైజయంతి మూవీస్‌. స్వప్నా సినిమాస్‌ బ్యానర్‌పై ప్రియాంకా దత్‌ నిర్మించారు. సమంత, దుల్కర్‌ సల్మాన్, విజయ్‌ దేవరకొండ ముఖ్య తారలుగా నటించారు. ఈ నెల 9న సినిమా రిలీజ్‌ అయింది. సినిమా చూసిన చిరంజీవి చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘సావిత్రి బయోపిక్‌ను నాగ్‌ అశ్విన్‌ చేస్తున్నాడు అనగానే కొంచెం సందేహం కలిగింది.

సావిత్రి గురించి ఏం తెలుసు? ఎంత వరకూ న్యాయం చేయగలడని అనుకున్నాను. కానీ అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా చూశాక ఎంత రీసెర్చ్‌ చేశాడో అర్థం అయింది. తెలుగు సినిమా స్థాయిని, ఖ్యాతినీ పెంచిన వాళ్లలో అశ్విన్‌ నిలిచారు. సావిత్రిగా కీర్తీ సురేశ్‌ జీవించింది. జెమినీ పాత్ర చేసిన దుల్కర్‌ని అభినందిస్తున్నాను. సమంత, నాగ చైతన్య, విజయ్‌ దేవరకొండ వంటి స్టార్స్‌ క్యారెక్టర్‌ ఇంపార్టెన్స్‌ తెలుసుకొని నటించారు.

మంచి కమర్షియల్‌ తీశాను కాని క్లాసిక్‌ సినిమా తీయలేకపోయాను అని అనేవారు  అశ్వనీదత్‌గారు. స్వప్నా, ప్రియాంక తండ్రికి ఆలోటు లేకుండా ‘మహానటి’ సినిమాను బహుమతిగా అందించారు. ఈ సినిమాకు రివార్డులే కాదు అవార్డులు కూడా వస్తాయి. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రిలీజ్‌ అయిన మే9నే ‘మహానటి రిలీజ్‌ అవ్వడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వనీదత్, నాగ్‌ అశ్విన్, స్వప్నా, ప్రియాంకా పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top