ఆస్తి తగాదాలపై కోర్టుకెళతా! | Karthik's Mother Files Complaint Against Him! | Sakshi
Sakshi News home page

ఆస్తి తగాదాలపై కోర్టుకెళతా!

Nov 1 2014 9:20 AM | Updated on Sep 2 2017 3:39 PM

ఆస్తి తగాదాలపై కోర్టుకెళతా!

ఆస్తి తగాదాలపై కోర్టుకెళతా!

చెన్నైలోని పొయస్ గార్డెన్‌లో ఉన్న ఇంట్లో తనకు రావాల్సిన వాటాను చట్టపరంగా దక్కించుకుంటానని సీనియర్ నటుడు కార్తీక్ చెప్పారు.

 ‘‘చెన్నైలోని పొయస్ గార్డెన్‌లో ఉన్న ఇంటికి సంబంధించి కొంత కాలంగా నాకూ, నా సోదరుడు గణేశన్‌కీ మధ్య వివాదం నడుస్తోంది. ఆ ఇంట్లో నాకు రావాల్సిన వాటాను చట్టపరంగా దక్కించుకుంటా’’ అని సీనియర్ నటుడు కార్తీక్ అన్నారు. శుక్రవారం చెన్నైలో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ప్రముఖ నటుడు స్వర్గీయ ముత్తురామన్ తనయుడైన కార్తీక్ తమిళంలో మాత్రమే కాదు.. 1980లలో ‘అభినందన’ చిత్రంతో తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. తండ్రి ముత్తురామన్ ఆస్తులు పంచుకొనే విషయంలో ఆయన తనయుల మధ్య వివాదం మొదలైంది.
 
ఈ నేపథ్యంలో పొయస్ గార్డెన్ ఇంటి నుంచి కార్తీక్ బయటికొచ్చేశారనీ, విడిగా ఉంటున్నారనీ వార్తలొచ్చాయి. కాగా, సోదరుడు గణేశన్‌పై పోలీస్ స్టేషన్‌లో కార్తీక్ ఫిర్యాదు చేశారు. విచిత్రం ఏంటంటే.. కార్తీక్ తల్లి సులోచన కార్తీక్‌పై అదే పోలీస్ స్టేషన్‌లో కేసుపెట్టారు. తమ మధ్య జరుగుతున్న వివాదం గురించి ఇన్నాళ్లూ నోరువిప్పని కార్తీక్ శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడుతూ -‘‘మా నాన్నగారి స్థిరాస్తుల్లో వాటా దక్కించుకోవడానికి కోర్టుకెళ్లడానికి నేను వెనకాడను. నాన్నగారి మరణానంతరం ఆస్తులకు సంబంధించిన అసలు వీలునామాను దాచేసి,  నకిలీవి సృష్టించారు. అదేమిటని నా సోదరుడు గణేశన్‌ని అడిగితే,  ‘ఇది అమ్మ రాసిన వీలునామా’ అని చెప్పారు.
 
ఆ వీలునామా ఆంగ్ల భాషలో ఉంది. నిజానికి మా అమ్మగారికి ఆంగ్లం రాదు.  గణేశన్‌తో మనస్పర్థలు వచ్చిన తర్వాత నేను ఆ ఇంటి నుంచి వెళ్లిపోయానని అందరూ చెప్పుకుంటున్నారు. నేనెక్కడికీ వెళ్లలేదు. పొయస్ గార్డెన్ ఇంట్లోనే ఉంటున్నాను. మరో రెండు రోజుల్లో ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకోవడానికి గణేశన్ ముందుకు రాకపోతే చట్టపరంగా కోర్టుకెక్కాలనుకుంటున్నా’’ అని చెప్పారు. తనకు తగిన భద్రత కల్పించాలని కూడా ఈ సందర్భంగా కార్తీక్ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement