నాకు ఇల్లు లేదు;జాకీ చాన్‌ కూతురు

Jackie chan Daughter Living Under A Bridge - Sakshi

తండ్రేమో ప్రపంచ ప్రసిద్ధి చెందిన యాక్షన్‌ హీరో...మరి అలాంటప్పుడు ఆయన వారసులకు దేనికి కొరత ఉండదు అనే అభిప్రాయం సహజం. కానీ జాకీ చాన్‌(62) కూతురు పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నది. జాకీ చాన్‌ కుతూరు ఎట్టా ఎన్‌(18) ‘ప్రస్తుతం నాకు ఉండేందుకు ఇల్లు లేదు. నెల రోజుల నుంచి నేను నా గర్ల్‌ఫ్రెండ్‌ ఇద్దరమూ హంగ్‌కాంగ్‌లోని ఒక బ్రిడ్జి కింద తలదాచుకుంటున్నాము’ అంటూ ఒ​క వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేసింది.

ఎట్టా పోస్టు చేసిన వీడియోలో ‘మేము ఒక నెల నుంచి ఈ బ్రిడ్జి కిందనే తలదాచుకుంటున్నాము. తినడం, పడుకోవడం అంతా ఇక్కడే. మా​కు ఆశ్రయం కల్పించమని పోలీసులు, ఆస్పత్రి, ఆహార బ్యాంకు, ఎల్‌జీబీటీక్యూ(లెస్బియన్, గే, బైసెక్సువల్, లింగమార్పిడి) కమ్యూనిటిల దగ్గరకు కూడా వెళ్లాము. కానీ వారు మాకు ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించారు. ఎవ్వరు మాకు సాయం చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అందుకే ఈ విషయాలన్నింటిని ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ’ అని తెలిపింది. ఈ వీడియోలో ఎట్టాతో పాటు ఆమె స్నేహితురాలు అండీ ఆటుమాన్‌ కూడా ఉన్నది.

ఎట్టా మాజీ అందాల రాణి ఎలెన్‌ ఎన్‌, జాకీ చాన్‌ల కూతురు. ఈ యాక్షన్‌ హీరో ప్రస్తుత భార్య జోన్‌ లిన్‌ కంటే ముందు ఎలెన్‌తో జాకీ చాన్‌కు సంబంధం ఉంది. వీరి బంధం గురించి ఈ హీరో బహిరంగంగా ఒప్పుకున్నప్పటికీ కూతురు ఎట్టా విషయంలో మాత్రం మౌనంగానే ఉన్నాడు. అయితే ఎలెన్‌ కూతురు చేసిన ఆరోపణనలను ఖండిస్తూ ఇలాంటి పనులు చేసే బదులు ఏదైనా పని వెతుక్కుంటే మంచిదని హితవు పలికారు. ‘నీకు డబ్బులు కావాలంటే కష్టపడి పనిచేసి సంపాదించు, అంతేకానీ ఇలా ఒకరి పేరు ప్రతిష్టల మీద ఆధారపడటం మంచి పద్దతి కాద’ని తెలిపారు. ఎట్టా గతంలో తన తండ్రి జాకీ చాన్‌ గురించి ‘అతను నా జీవితంలో లేడు...నేను అతన్ని ఒక తండ్రిగా ఎప్పటికి పరిగణించను’ అని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top