
ముంబై: మాఫియా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ అల్లుడు జుబైర్ ఖాన్ తాజాగా హిందీ బిగ్‌బాస్ షోలో దర్శనమిచ్చాడు. కలర్స్ చానెల్‌లో ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో జుబైర్ పాల్గొనడం పలువురిని ఆశ్చర్యపరిచింది.
పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించిన జుబైర్ మాట్లాడుతూ తనకు దావూద్‌తో ఎలాంటి లింక్స్ లేవని స్పష్టం చేశారు. దావూద్‌కు చుట్టమన్న ఒకే ఒక్క కారణంతో తన కెరీర్ దెబ్బతిన్నదని, బిగ్‌బాస్ షో ద్వారా తనపై పడిన తప్పుడు ముద్రను చెరిపేస్తానని ఆయన చెప్పారు.
'దావూద్‌కు నేను చుట్టం అని తెలిసినప్పటి నుంచి నా సినిమా ప్రాజెక్టుల నుంచి బయ్యర్లు, ఇన్సెస్టర్లు వెనుకకు తగ్గారు. ప్రజలు నన్ను చూస్తే భయపడేవారు. చిత్ర పరిశ్రమలో నాపై చాలామందికి ఉన్న అభిప్రాయాన్ని మార్చేందుకు బిగ్‌బాస్ షో ఒక అవకాశంగా భావిస్తున్నా' అని జుబైర్ తెలిపారు. సంఘవిద్రోహ శక్తులపై పోరాటడమే తనకు కావాల్సిందని, తాను ఎవరికీ భయపడనని ఆయన చెప్పారు.
'నేను పెళ్లి చేసుకున్ననాటి నుంచే రిస్క్ మొదలైంది. అప్పటి నుంచి బెదిరింపు కాల్స్ రావడం ప్రారంభమైంది. నేను వాటిని లెక్కచేయలేదు. జీవితంలో పుట్టుక-చావు ఒక్కసారే వస్తాయి. మార్పు నిరతరం.. మరణం శాశ్వతం. ఒకరోజు ఎలాగైనా మరణం వస్తుంది. కాబట్టి పోరాడి చనిపోవడమే ఉత్తమం. పిరికితనంతో ఉండాలని నేను అనుకోవడం లేదు. సంఘ వ్యతిరేక శక్తులపై పోరాడుతాను' అని జుబైర్ తెలిపారు. బాలీవుడ్ చిత్రపరిశ్రమలో అనేక చీకటి కోణాలు తనకు తెలుసునని, త్వరలోనే వాటిని బయటపడతానని హెచ్చరించారు. తమకు సమస్య వస్తే పరిశ్రమలోని చాలామంది దావూద్‌తో మాట్లాడుతారని, బాలీవుడ్‌లో మురికి రాజకీయాలు ఎక్కువ అని జుబైర్ వ్యాఖ్యానించారు.