త్రిష గర్జన మొదలైంది

త్రిష గర్జన మొదలైంది


నటి త్రిష గర్జన మొదలైంది. సాధారణంగా వయసు పెరిగేకొద్దీ కథానాయికల మార్కెట్‌ తగ్గుతుంటుంది. అయితే ఇందుకు చెన్నై చిన్నది త్రిషను అతీతమనే చెప్పాలి. ఈ బ్యూటీ సినిమా వయసు ఒకటిన్నర దశాబ్దం. తమిళం, తెలుగు, కన్నడం, చివరికి బాలీవుడ్‌ చిత్ర నటనానుభాన్ని కూడా చవి చూసేశారు. అలాంటి త్రిషకు ఒక సమయంలో మార్కెట్‌ పడిపోయింది. ఇక అమ్మడి పనైపోయిందనే ప్రచారం జోరందుకుంది. త్రిష కూడా సంసార జీవితంలో సెటిలైపోదామని వివాహానికి సిద్ధమైపోయారు. సినీ నిర్మాత, వ్యాపారవేత్త ప్రేమ, పెళ్లి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. అయితే అక్కడే త్రిష జీవితం అనుకోని మలుపు తిరిగింది.


త్రిష పెళ్లి పీట ల వరకూ వెళ్లలేదు. అది ఎలాంటి అనుభవాన్ని కలిగించిందోగానీ, ఇకపై నటనపైనే తన దృష్టి అంతా అని త్రిష నిర్ణయం తీసుకున్నారు. అంతే తన మార్కెట్‌ అంతకుమించి అన్నట్లు పెరిగిపోయింది. అప్పటి వరకూ కమర్షియల్‌ చిత్రాల్లో హీరోలతో డ్యూయెట్లు పాడుతూ అందాలారబోతకు పరిమితమైన త్రిషకు స్త్రీ ప్రధాన ఇతివృత్త కథా చిత్రాల అవకాశాలు రావడం విశేషం. అలా ఈ భామ నటించిన నాయకి నిరాశపరచినా తన క్రేజ్‌ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం చేతిలో అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. అందులో సగం హీరోయిన్  ఓరియంటెడ్‌ చిత్రాలే కావడం మరో విశేషం.


నటుడు ధనుష్‌ సరసన కొడి చిత్రంలో రాజకీయ నాయకురాలిగా త్రిష అద్భుతమైన విలనిజాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా మోహిని అనే హీరోయిన్ సెంట్రిక్‌ కథా చిత్రంతో పాటు అరవిందస్వామి సరసన చతురంగ వేట్టై–2, విజయ్‌సేతుపతికి జంటగా 96, ఒక మలయాళ చిత్రం, 1818 అనే మరో చిత్రంలో నటించడానిక కమిట్‌ అయ్యారు. తాజాగా మరో చిత్రం త్రిష ఖాతాలో చేరింది. అదే గర్జన. హిందీలో అనుష్క శర్మ నాయకిగా నటించిన ఎన్ హెచ్‌–10 చిత్రానికి రీమేక్‌ ఈ గర్జన. రోడ్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఇందులో త్రిష సరసన బుల్లితెర నటుడు అమిత్‌ భార్గవ్‌ నటిస్తున్నారు. వంశీకృష్ణ ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సుందర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ సోమవారం ప్రారంభమైంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top