విశాల్‌ కార్యాలయంలో జీఎస్టీ తనిఖీలు

Vishal

సాక్షి, చెన్నై: మెర్శల్‌ సినిమాకు మద్దతుగా నిలిచిన హీరో విశాల్‌పై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు హెచ్‌ రాజాపై విమర్శలు చేసి కొన్ని గంటలు గడవకముందే ఆయనకు షాక్‌ ఇచ్చింది. విశాల్‌ కార్యాలయంలో జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వడాపళనిలోని విశాల్‌ కార్యాలయానికి వచ్చిన అధికారులు ఆయన చిత్ర నిర్మాణ సంస్థకు సంబంధించిన చెల్లింపు వివరాలను పరిశీలించారు. వస్తు, సేవా పన్ను చెల్లింపుల్లో ఏదైనా ఎగవేత జరిగిందా అనే దాని గురించి శోధించేందుకు జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

కాగా, ఇటీవల విడుదలైన మెర్శల్ సినిమాలో జీఎస్టీకి వ్యతిరేకంగా డైలాగులు పెట్టడం వివాదస్పదమైంది. ఈ మాటలు తొలగించాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. మెర్శల్‌ చిత్ర యూనిట్‌కు ప్రతిపక్షాలు దన్నుగా నిలిచాయి. కమల్‌హాసన్‌, రజనీకాంత్ సహా సినిమా ప్రముఖులు మెర్శల్‌కు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో విశాల్‌ కార్యాలయంపై జీఎస్టీ అధికారులు దాడి చేయడం సంచలనంగా మారింది. ‘మెర్శల్‌’కు అండగా నిలబడిన మిగతావారిపైనా దాడులు జరిగే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

కాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైలాగులు పెట్టిన మెర్శల్‌ సినిమా పైరసీ కాపీని చూశానని హెచ్‌ రాజా ప్రకటించడంతో క్షమాపణ చెప్పాలని విశాల్‌ డిమాండ్‌ చేశారు. బాధ్యతగల పదవిలో ఉండి పైరసీ సినిమా చూడటానికి సిగ్గులేదా అని ఘాటుగా విమర్శించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top