3ఎస్‌

Funday Special chit chat with heroine huma qureshi - Sakshi

హుమా ఖురేషీ  అంటే? మూడు ముక్కల్లో చెప్పాలంటే... స్పాంటేనిటీ, స్టైల్, స్టేట్‌మెంట్స్‌. గుంపులో ఒకరిగా కాకుండా తనదైన ప్రత్యేకతను బాలీవుడ్‌లో నిలుపుకుంటూ వస్తున్న ఖురేషీ ‘కాలా’ సినిమాతో ‘జరీనా’గా దక్షిణాది సినిమాకు పరిచయమైంది. ‘ఉన్నదున్నట్లే మాట్లాడితే సినిమా ఇండస్ట్రీలో కష్టం’ అంటూనే నిర్మొహమాటంగా మాట్లాడే హుమా ఖురేషీ అంతరంగ తరంగాలు...

అభిమానం వరకే...
చిన్నప్పుడు సినిమాలు తెగ చూసేదాన్ని. అద్దం ముందు నిల్చొని డ్యాన్స్‌లు చేయడం, డైలాగులు చెప్పడం సరేసరి. మధుబాల, మాధురి దీక్షిత్, శ్రీదేవి...నా అభిమాన తారలు. అంతమాత్రాన...నేను ఎప్పుడూ వారిని అనుకరించే ప్రయత్నం చేయలేదు. నాదైన ముద్ర కోసం ప్రయత్నం చేశాను.

నా అదృష్టం!
సవాలు విసరని ఇండస్ట్రీ అంటూ ఏదీ ఉండదు. కాబట్టి సవాళ్లను ఎదుర్కోవడానికి సదా సిద్ధంగా ఉంటాను. ఇండస్ట్రీలో నేను ప్రముఖుడి కూతురు, బంధువై ఉంటే ‘ఎక్స్‌పెక్టేషన్స్‌’ ఎక్కడో ఉండేవి. అవేమీ లేకపోవడం, ఇతరులతో పోలిక తేకపోవడం నా అదృష్టంగానే భావిస్తున్నాను.

శిక్షణ
మంచి యాక్టింగ్‌ స్కిల్స్‌ ఉండాలంటే థియేటర్‌ ట్రైనింగ్‌ తప్పనిసరి. ఇది సినిమాలకు ఎంతగానో  ఉపయోగపడుతుంది. మలయాళ సినిమా ‘వైట్‌’ కోసం డైలాగ్‌ చెప్పాల్సి వచ్చినప్పుడు నేను థియేటర్‌లో నేర్చుకున్న ‘జిబ్బరీష్‌ టెక్నిక్‌’ను వాడుకున్నాను.

ఒక్కటైనా చాలు...
సంవత్సరానికి పది సినిమాలు చేయాలనే ఆరాటం నాలో లేదు.నంబర్‌లతో నటనను అంచనా వేయలేం. సంవత్సరానికి ఒక్క సినిమా చేసినా ఫరవాలేదుగానీ... నలుగురు మెచ్చే పాత్ర చేయాలనేది నా కోరిక.‘బాగా డబ్బులు సంపాదించాలి’ అనే కోరిక మనల్ని ఎప్పుడూ సృజనాత్మకత అనే గమ్యానికి చేర్చదు. అలాగే ‘భారీ తారగణం’ ‘భారీ బడ్జెట్‌’....ఈ రెండు ‘భారీ’లు మాత్రమే ఒక సినిమాను విజయవంతం చేయలేవు.

అద్భుతం!
ఒకప్పుడు మన సినిమాలు అంటే ఇతర దేశాల్లో ‘సింగింగ్‌ అండ్‌ డ్యాన్సింగ్‌’ సినిమా అనే పేరు ఉండేది. ఇప్పుడు దృశ్యం మారిపోయింది. మన సినిమాలపై ఆసక్తి పెరిగిపోయింది. మన దగ్గర అద్భుతమైన దర్శకులు, రచయితలు ఉన్నారు. అందరూ కలిసి నిర్మాణాత్మకంగా కృషి చేస్తే మరిన్ని సృజనాత్మక అద్భుతాలు సృష్టించడం కష్టమేమీ కాదు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top