ఇప్పుడైతే ఆర్. నారాయణమూర్తితో సినిమా చేస్తాను..!

ఇప్పుడైతే ఆర్. నారాయణమూర్తితో సినిమా చేస్తాను..! - Sakshi

పూరి జగన్నాథ్ అంటేనే ఓ పవర్ హౌస్. తన మాటల్లోనూ చేతల్లోనూ తీసే సినిమాల్లోనూ ఓ ఎనర్జీ కనిపిస్తుంది. అయితే పైకి కనిపించే జగన్ వేరు. ఇన్నర్ జగన్ వేరు. ఆ లోపలి మనిషిలో ఓ తాత్వికత,  ఓ విప్లవాత్మకత, ప్రపంచం పట్ల అవగాహన,  కొంచెం చిలిపితనం, ఇంకొంచెం ఘాటుతనం కనిపించకుండానే కనిపిస్తాయి. తనలోని భిన్నత్వాన్ని ‘సాక్షి’ ముందు ప్రత్యేకంగా ఆవిష్కరించారు. నేడు పూరి జగన్నాథ్ పుట్టిన్రోజు. ఈ సందర్భంగా ఆయన ఇన్నర్‌వ్యూ.

 

 ***  మీరు వదిలేసుకున్న గొప్ప అవకాశం?

 చరణ్‌ని లాంచ్ చేయడం కోసం సల్మాన్‌ఖాన్ ‘వాంటెడ్’ సినిమా వదిలి తప్పు చేశాను.

 

 ***  మీరు కోరుకుంటున్న గొప్ప అవకాశం?

 నాకు హింగ్లిష్‌లో సినిమా చేయాలని ఉంది. అందులో పాత్రలన్నీ హిందీ లేదా ఇంగ్లిష్ మాట్లాడతాయి.

 

 ***  ప్రతి మనిషిలోనూ హీరో, విలన్, కమెడియన్ ఉంటాడు. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి బయటికొస్తుంటాడు. మరి మీలో?

 ఇన్నేళ్ల జీవితంలో నేను హీరోగా, కమెడియన్‌గా వేసిన వేషాలు చాలు. ఇప్పుడు విలన్ వేషాలు వెయ్యాలనుంది. నాలో ఉన్న విలన్‌ని ఎంకరేజ్ చేద్దామనుకుంటున్నాను.

 

 ***  మీకు బాగా నచ్చిన ఓ ఐదు తెలుగు సినిమాలు?

 మిస్సమ్మ 25 సార్లు చూశాను. బొబ్బిలిపులి, ఆకలిరాజ్యం, నాయకుడు, క్షణ క్షణం... ఇవి కూడా నాకు బాగా నచ్చిన సినిమాలు.

 

 ***  కొడుకు, భర్త, తండ్రి, ప్రేమికుడు, స్నేహితుడు, దర్శకుడు, నిర్మాత... ఇలా ఒక్కొక్క పాత్రకి ఎన్నెన్ని మార్కులు వేసుకుంటారు?

 మీరిచ్చిన అన్ని పాత్రలకీ నేను సగం కంటే ఎక్కువ న్యాయం చేయలేదు. కాబట్టి ఒక్కోదానికి 50 మార్కులే వేసుకుంటా.

 

 ***  మీరు తరచుగా కలవాలనుకునే వ్యక్తి?

 ఒకే ఒక్క ప్రాణి... రాంగోపాల్‌వర్మ

 

 ***  ఇన్నేళ్ల అనుభవంలో సినిమా ఫీల్డ్ నుంచి మీరేం నేర్చుకున్నారు?

 నాకేమీ రాదు.. నాకేమీ తెలియదు... అనే విషయం నేర్చుకున్నాను.

 

 ***  మీ ఫేవరెట్ హీరో, హీరోయిన్?

 అబ్బాయిల్లో - అమితాబ్ బచ్చన్, అమ్మాయిల్లో - శ్రీదేవి

 

 ***  చనిపోయే లోపు మీరు కచ్చితంగా ఏం చేయాలనుకుంటున్నారు? 

 అందరికీ స్వర్గం చూడాలని ఉంటుంది. అది చూడాలంటే చావాలి. సో... చనిపోతేగానీ స్వర్గం కనిపించదు. మన పనికోసం ప్రాణాలు వదిలేసే దమ్ముంటే అన్ని స్వర్గాలూ చూడొచ్చు. అందుకే నేను చనిపోయే ముందు మళ్లీ మళ్లీ చావాలనుంది.

 

 ***  మిమ్మల్ని సంతోషంగా ఉంచే అంశాలు?

 మ్యూజిక్ వినడం, అప్పుడప్పుడు సినిమాలు చూడడం, ఒంటరిగా విదేశీ పర్యటన, భార్యతో పిచ్చాపాటీ, స్నేహితులతో బాతాఖానీ, టెక్నాలజీ పిచ్చి, కొత్త గాడ్జెట్‌ల గోల.

 

 ***  మిమ్మల్ని మీరు రిపేర్ చేసుకునే అవకాశం వస్తే?

 నన్ను నేను రిపేర్ చేసుకునే వయసు దాటిపోయింది. కాబట్టి ఈ బండితో ఇలాగే నాలుగు రోజులు తిరిగేద్దామనుకుంటున్నాను.

 

 ***  మీ సినిమాల్ని రిపేర్ చేసుకునే అవకాశమొస్తే?

 గంట గడిచిపోయిన తర్వాత ముల్లు వెనక్కి తిప్పలేం. ఇక ముందైనా కొన్ని మంచి సినిమాలు తీస్తే చాలు.

 

 ***  మీరిప్పుడే ఫీల్డ్‌లోకి ఎంటరయ్యారనుకుందాం. డైరక్టర్‌గా మీ తొలి సినిమా ఎవరితో చేస్తారు?

 ఆర్. నారాయణమూర్తి

 

 ***  మళ్లీ జన్మించే అవకాశం వస్తే ఎవరిలా పుట్టాలనుకుంటారు?

 బ్రూస్‌లీ. గబుక్కున బ్రూస్‌లీలా పుట్టేయాలి. గబగబా ఫైట్లు చేసెయ్యాలి. 32 ఏళ్లు తిరక్కుండా చనిపోవాలి.

 

 ***  ఈ ప్రపంచం నుంచి డబ్బుని బ్యాన్ చేస్తే?

 బ్యాన్ చేయాల్సింది డబ్బుని కాదు... మనుషులని. ఈ భూమ్మీద డబ్బు వదిలేసి మనుషులని తీసేస్తే బెటరు. నాకో క్రేజీ ఐడియా ఉంది. డబ్బు లేకుండా, ఏ వసతి లేకుండా ఎవరూ లేని ఒక ఐల్యాండ్‌లో ఒంటరిగా నెలరోజులు గడపాలని ఉంది.

 

 ***  మీ అప్పులన్నీ తీర్చేశారా? బాగా డబ్బు విలువ తెలిసొచ్చిందా?

 ఏదో అప్పు ఉండబట్టే ఈ లోకంలో పుట్టాం. అప్పు తీరిపోతే చస్తాం. మనం బతికి ఉండాలంటే అప్పు పెరుగుతూనే ఉండాలి. మీరన్నట్టు డబ్బు విలువ నాకు బాగా తెలిసొచ్చింది.

 

 ***  ఈ సృష్టి నుంచి స్త్రీని డిలీట్ చేసేస్తే?

 డిలీట్ చేయలేం. స్త్రీ లేకుండా సృష్టి ఉండదు. ఆ దేవుడు కూడా ఏదో స్త్రీకి పుట్టినవాడే. కాకపోతే ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నాడో... వాడు దేవుడై పుట్టాడు. మనం మనుషులమై పుట్టాం అంతే!

 

 ***  మీ దృష్టిలో ఈ ప్రపంచంలో గొప్ప అందగత్తె ఎవరు?

 మా ఆవిడ (ఇలా చెబితే మా ఆవిడ నమ్మదు. మీరు కూడా నమ్మరు. కానీ ఇది పచ్చి నిజం).

 

 ***  కారులో లాంగ్ డ్రైవ్ చేయాల్సి వస్తే ఎవరితో కలిసి చేస్తారు?

 అంత లాంగ్ డ్రైవ్ అంటే నన్ను బాగా ఎంటర్‌టైన్ చేసే మనిషి కావాలి. రాంగోపాల్‌వర్మ తప్ప ఇంకెవరున్నారు?

 

 ***  ఎన్టీఆర్, సావిత్రి, ఎస్వీఆర్, రాజనాల, సాలూరు రాజేశ్వరరావు, మార్కస్ బార్‌ట్లే, ఆత్రేయ లాంటి పాతతరం ప్రముఖులంతా బతికొస్తే ఎలాంటి సినిమా తీస్తారు?

 ఏం చేస్తానో తెలియదు. కచ్చితంగా వాళ్లతో బ్లాక్ అండ్ వైట్ సినిమానే చేస్తాను. కలర్ అస్సలు తీయను.

 

ఒక వ్యక్తిని ఒకే ఒక్క వాక్యంలో నిర్వచించడం కష్టం. కానీ అందులోనే మజా ఉంటుంది. కొంతమంది పేర్లు చెప్పగానే మీ మనసులో పుట్టిన నిర్వచనాన్ని టకీమని చెప్పగలరా?

 

 అమితాబ్ బచ్చన్ -  నా టైం బావుంది

 చిరంజీవి - కష్టజీవి

 నాగార్జున - క్రమశిక్షణ కలిగిన వ్యక్తి

 పవన్‌కల్యాణ్ - ఫొటో పెట్టుకోవాలి

 మహేష్ - పేరంటేనే కిక్

 ఎన్టీఆర్ - అంటేనే ఎనర్జీ

 ప్రభాస్ - నా డార్లింగ్

 చరణ్ - మహర్జాతకుడు

 బన్నీ - నా తమ్ముడు

 రవితేజ - మొహం మీద తిడతాడు

 రక్షిత - స్వీట్ హార్ట్

 అసిన్ - తెలివైన కుట్టి

 ఇలియానా - అందమైన నడుం

 తమన్నా - బంగారం

 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top