బాహుబలి ఫార్ములానే వాడతారా? | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 2 2018 3:33 PM

Director Teja NTR Biopic in Two Parts - Sakshi

జానపద నేపథ్యం ఉన్న ఓ కథను బాహుబలి సిరీస్‌గా తెరకెక్కించి ఒక తెలుగు చిత్రం గురించి ప్రపంచమంతా చర్చించుకునేలా చేశాడు దర్శకుడు రాజమౌళి. నిజానికి తొలుత ఒక పార్ట్‌లో తీయాలని ఆయన భావించారంట. కానీ, నిడివి... కట్టప్ప వెన్నుపోటు లాంటి ట్విస్ట్‌.. పైగా ప్రధాన పాత్రల ద్వారా రెండో భాగంపై ఆసక్తి పెరగాలనే ఉద్దేశంతో విభజించానని తర్వాత పలు ఇంటర్వ్యూలో జక్కన్న చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఇదే ఫార్ములాను ఎన్టీఆర్‌ బయోపిక్‌కు కూడా అన్వయించబోతున్నారని సమాచారం. 

‘ఎన్టీఆర్‌’ కోసం చాలా గ్రౌండ్‌ వర్క్‌ చేసిన దర్శకుడు తేజ.. పెద్ద స్క్రిప్ట్‌నే రూపొందించాడంట. రామారావు జీవితంలో ఎన్నో మలుపులు.. ఎన్నో పాత్రలు.. అన్నింటికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఈ చిత్రాన్ని సింపుల్‌గా కీలకాంశాలు చూపించి అయిపోగొట్టడం లాంటిది చేయకూడదనే ఆలోచనకు వచ్చాడంట. ఈ నేపథ్యంలో రెండు పార్ట్‌లుగా తెరకెక్కించేందుకు సిద్ధమైపోతున్నాడు. మొదటి పార్ట్‌ ట్విస్ట్‌తో ముగిసి.. దానిని రెండో పార్ట్‌ నుంచి కొనసాగించాలని యోచిస్తున్నాడంట. అందుకోసం ఇప్పుడు ఈ చిత్ర హీరో బాలకృష్ణను కన్విన్స్‌ చేసే పనిలో పడ్డాడని తెలుస్తోంది. రెగ్యులర్‌ షూటింగ్‌ సమయానికి దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

బయోపిక్‌ను కమర్షియల్‌ ఫార్మట్‌లో తెరకెక్కించాలంటే దానికి నాటకీయత చాలా అవసరం. ఆ ప్రయత్నంలో వాస్తవాలను కూడా చూపించాల్సి ఉంటుంది. దానికి ఎంఎస్‌ ధోనీ చిత్ర విజయమే ఉదాహరణ. ఎన్టీఆర్‌ లాంటి దిగ్గజం జీవితగాథను బాలయ్య లాంటి హీరోతో తెరకెక్కించడం తేజకు సవాలే. వ్యక్తిగత జీవితంతోపాటు కీలకమైన రాజకీయ ప్రస్థానం అంటే.. ముఖ్యమంత్రి కావటం.. వెన్నుపోటు లాంటి ఘట్టాలను పూర్తిగా చూపిస్తేనే ప్రేక్షకుడు కన్విన్స్‌ అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా ఒక దశ వరకు చూపించి.. అర్థాంతరంగా ముగిస్తే మాత్రం అది సరైంది కాదన్నది సినీ విశ్లేషకుల అభిప్రాయం.

Advertisement
Advertisement