దర్శకుణ్ణి నమ్మిన ఏ హీరో చెడిపోలేదు | Dasari narayana rao viswa vijetha vijaya gatha book released | Sakshi
Sakshi News home page

దర్శకుణ్ణి నమ్మిన ఏ హీరో చెడిపోలేదు

Dec 29 2013 12:35 AM | Updated on Sep 2 2017 2:04 AM

దర్శకుణ్ణి నమ్మిన ఏ హీరో చెడిపోలేదు

దర్శకుణ్ణి నమ్మిన ఏ హీరో చెడిపోలేదు

అదృష్టానికి అందరి అడ్రస్సులూ తెలుసు. ఎప్పుడు ఎవర్ని వరించాలో దానికి బాగా తెలుసు. దానికోసం ఎదురు చూడాల్సిన పనిలేదు.

‘‘అదృష్టానికి అందరి అడ్రస్సులూ తెలుసు. ఎప్పుడు ఎవర్ని వరించాలో దానికి బాగా తెలుసు. దానికోసం ఎదురు చూడాల్సిన పనిలేదు. అందుకు నా జీవితమే ఓ ఉదాహరణ’’ అన్నారు దాసరి నారాయణరావు. ఆయన దర్శకత్వం వహించిన 150 సినిమాల సినీ ప్రస్థానంపై సీనియర్ పాత్రికేయుడు వినాయకరావు రచించిన ‘విశ్వవిజేత విజయగాథ’ పుస్తకావిష్కరణ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. సూపర్‌స్టార్ కృష్ణ పుస్తకాన్ని ఆవిష్కరించి, తొలి ప్రతిని ప్రతాప్ ఆర్ట్స్ కె.రాఘవకు అందించారు. 3 లక్షల వెయ్యి నూటపదహార్లకు దాసరి కిరణ్‌కుమార్ వేలం పాటలో ఈ పుస్తకాన్ని సొంతం చేసుకున్నారు. అనంతరం దాసరి మాట్లాడుతూ-‘‘నా జీవితాన్ని తలచుకుంటే ఓ కలలా అనిపిస్తుంది. 
 
 నాటకాలు వేసుకునే నేను మద్రాసు వెళ్లి ఆర్టిస్టుగా ప్రయత్నాలు చేసి వెనక్కి రావడం ఏంటి?  కాలగమనంలో 150 సినిమాలకు రచన, దర్శకత్వం వహించడమేంటి?. ఈ రోజు నా పేరిట ఓ పుస్తకం వచ్చేస్థాయికి నేను చేరుకున్నానంటే... దానికి కారణం ప్రతాప్ ఆర్ట్స్ రాఘవగారు. ఆయన నన్ను నమ్మి అవకాశం ఇవ్వబట్టే ఈ రోజు ఇంత సాధించగలిగాను. దాదాపు అన్ని తరాల నటులతో, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేసే అదృష్టం నాకు దక్కింది. నేటి తరంవారికి నేను చెప్పేదొక్కటే. తనపై తొలిక్లాప్ కొట్టేవరకూ ఎన్టీఆర్ ‘బొబ్బిలిపులి’ కథ వినలేదు. దర్శకుణ్ణి అప్పట్లో అంతగా నమ్మేవారు. దర్శకుణ్ణి నమ్మిన ఏ హీరో చెడిపోలేదు. నేనే హీరో అనుకున్న ప్రతి హీరో నాశనమయ్యాడు. అది గుర్తుంచుకోండి. సినిమాకు ఎన్ని వసూళ్లు వచ్చాయన్నది ముఖ్యం కాదు. ఎన్నాళ్లు జనహృదయాల్లో సినిమా నిలిచిందనేది ముఖ్యం.
 
  ఇక ఈ పుస్తకం విషయానికొస్తే... ఇది నా జీవిత చరిత్ర కాదు. నా 150 సినిమాల వెనకున్న చరిత్ర ఇది. నా గురించి పుస్తకం రాస్తానని చాలామంది అడిగారు. కానీ వినాయకరావుపై నమ్మకంతో అతనికి ఈ బాధ్యత అప్పగించా. త్వరలో నా జీవిత చరిత్ర నేనే రాసుకోబోతున్నా’’ అని చెప్పారు. ‘‘ఈ పుస్తకం కోసం రెండేళ్లు శ్రమించాను. వందేళ్ల సినిమా చరిత్రలో దాసరి ఒక శకం’’ అని వినాయకరావు చెప్పారు. ఇంకా డి.రామానాయుడు, టి.సుబ్బిరామిరెడ్డి, కృష్ణంరాజు, మోహన్‌బాబు, పి.సి.రెడ్డి, కోడి రామకృష్ణ, రమేష్ ప్రసాద్, కోదండరామిరెడ్డి, జయసుధ, గీతాంజలి, సి.కల్యాణ్ తదితర  సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement