నేడు తెలుగు సినిమా పుట్టినరోజు

నేడు తెలుగు సినిమా పుట్టినరోజు

 మన తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’. తెలుగు నాట టాకీ వేళ్లూనుకోవడానికి ఈ సినిమానే శ్రీకారం చుట్టింది. అందుకే ఈ చిత్రం విడుదలైన రోజుని తెలుగు సినీ ప్రియులందరూ కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. నిన్న మొన్నటివరకూ ‘భక్త ప్రహ్లాద’ 1931 సెప్టెంబర్ 15న విడుదలైందనే అనుకున్నారు. అయితే సీనియర్ పాత్రికేయుడు రెంటాల జయదేవ నాలుగేళ్లు శ్రమించి, ఎంతగానో పరిశోధించి విడుదల తేదీపై వాస్తవ చరిత్రను వెలికి తీశారు. ఆయన పరిశోధన ప్రకారం తెలుగు సినిమా అసలు సిసలు పుట్టినరోజు 1932 ఫిబ్రవరి 6. ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా సంపాదించారు. మొత్తం 9,762 అడుగుల నిడివి గల పది రీళ్ల ‘భక్తప్రహ్లాద’ చిత్రం 1932 జనవరి 22న బొంబాయిలో సెన్సారింగ్ జరుపుకుంది. 

 

 ఆ సెన్సార్ సర్టిఫికెట్ నెంబర్-11032. ‘తొలి 100% తెలుగు టాకీ’గా సగర్వంగా ప్రకటించుకున్న ‘భక్త ప్రహ్లాద’ చిత్రం 1932 ఫిబ్రవరి 6న బొంబాయిలోని కృష్ణా సినిమా థియేటర్‌లో తొలుత విడుదలైంది. ఆ లెక్క ప్రకారం ఈ సినిమాకు నేటికి 82 ఏళ్లు నిండాయి. హెచ్.ఎమ్.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సురభి నాటక కళాకారులే అధిక పాత్రలు పోషించారు. మునిపల్లె సుబ్బయ్య, సురభి కమలాబాయి, మాస్టర్ కృష్ణారావు, ఎల్వీ ప్రసాద్ తదితరులు ఇందులో ముఖ్య పాత్రధారులు. ‘తెలుగు సినిమా పుట్టినరోజు’ని ప్రతి ఏటా పరిశ్రమ ఓ వేడుకగా ఘనంగా నిర్వహిస్తే బావుంటుంది.

 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top