తెలుగు సినిమాల్లో సరిగ్గా 91 ఏళ్ల కిందట.. తొలి డైరెక్టర్‌ ఎవరంటే..

Bhaktha Prahlada 91 Years Lets Celebrate Telugu Talkies Birthday - Sakshi

తొలి పూర్తి తెలుగు టాకీ సినిమా ‘భక్త ప్రహ్లాద’ విడుదలై నేటికి సరిగ్గా 91 ఏళ్లు నిండాయి. ఇది తెలుగు సినిమా పరిశ్రమలో ఒక చరిత్రాత్మక సంఘటన. అంతకు ముందు సగం తెలుగు, సగం తమిళంతో 1931 అక్టోబర్‌ 31న తొలి దక్షిణ  భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్‌’ వచ్చింది. ఆ పైన పూర్తిగా తెలుగు మాటలు, పాటలతో ‘భక్త ప్రహ్లాద’ 1932 ఫిబ్రవరి 6న విడుదలై సంచలనం సృష్టించింది. అందుకే ఫిబ్రవరి 6న మొదటి పూర్తి తెలుగు టాకీ ఆవిర్భావ సంబరాలు జరుపుకొంటారు.

గతంలో ఈ సినిమా సెప్టెంబరు 15న విడుదల అయినట్టు ప్రచారం జరిగింది. కాని సీనియర్‌ జర్నలిస్టు డా‘‘ రెంటాల జయదేవ ఎన్నో యేళ్ళు ఊరూరా తిరిగి, ఎంతో పరిశోధించి, సాక్ష్యాలు సేకరించి, ఈ సినిమా 1932 జనవరి 21న బొంబాయిలో సెన్సారై, ఫిబ్రవరి 6న అక్కడే తొలిసారి విడుదలై నట్లు ఆధారాలతో నిరూపించారు. ఆ విధంగా 1932 ఫిబ్రవరి 6న బొంబాయి శ్రీకృష్ణా సినిమా ధియేటర్‌లో విడుదలైన తర్వాత, విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్ళి, విజయవంతంగా ఆడింది. 1932 ఏప్రిల్‌ 2న మద్రాసులోని ‘నేషనల్‌ పిక్చర్‌ ప్యాలస్‌’లో విడుదల చేశారు. ఈ చిత్ర దర్శకుడు హెచ్‌ఎమ్‌ రెడ్డి. సురభి కళాకారులు సహా పలువురిని బొంబాయి తీసుకెళ్ళి అక్కడ స్టూడియోలో 20 రోజుల్లో షూటింగ్‌ పూర్తిచేశారు. ఆ రోజుల్లో.. 

చిత్ర నిర్మాణా నికి సుమారు రూ. 20 వేలు ఖర్చయింది. ఈ సినిమా సహజంగానే అనేక రికార్డులు నమోదు చేసుకుంది. ఇందులో లీలావతిగా నటించిన ‘సురభి’ కమలాబాయి తొలి తెలుగు తెర ‘కథా నాయిక’. ఈ చిత్ర నిర్మాణానికి ప్రధాన కారకులు పూర్ణా మంగరాజు. ఆంధ్రాలో తొలి సినీ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ‘క్వాలిటీ పిక్చర్స్‌’ వ్యవస్థాపకుడు. ఈ చిత్ర గీత రచయిత ‘చందాల కేశవదాసు’. ఆ విధంగా తొలి పూర్తి తెలుగు సినిమా తయారై సంచలనం సృష్టించింది. దురదృష్టవశాత్తూ ఈ ఫిల్మ్‌ ప్రింట్‌ ఇప్పుడు లభ్యం కావడం లేదు. నిజానికి, టాకీలు రావడానికి చాలాకాలం ముందే మూకీల కాలం నుంచి మన సినీ పితామహులు రఘుపతి వెంకయ్య నాయుడు వంటివారెందరో మన గడ్డపై సినిమా నిలదొక్కు కొని, అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేశారు. అప్పట్లోనే  తన కుమారుడు ప్రకాశ్‌ని విదేశాలకు పంపి ప్రత్యేక సాంకేతిక శిక్షణనిప్పించి, సినిమాలు తీసి తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేశారు వెంకయ్య.  

ఇలాంటి వారి గురించి ముందు తరాల వారికి తెలియజేసే కార్యక్రమాలను సినిమా పెద్దలు, ఫిల్మ్‌ ఛాంబర్‌ లాంటి సంస్థలు, పాలకులు నిర్వహించాలి. తెలుగు సినిమా ఆవిర్భావ దినాన్ని ఒక ఉత్సవంగా నిర్వహించి... భావి తరాలకు తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన విషయాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే పాత చిత్రాలు అన్నీ సేకరించి ఒక సినీ మ్యూజియం ఏర్పాటు చేయాలి. ఇటువంటిది దేశంలో పుణేలో ఉంది. ప్రపంచ ఉత్తమ చిత్రాలు ప్రదర్శిస్తున్న వైజాగ్‌ ఫిలిం సొసైటీ  ‘తెలుగు టాకీ సినిమా ఆవిర్భావ దినోత్సవం’ సందర్భంగా ఫిబ్రవరి 6 నుండి 8 వరకు క్లాసిక్‌ చిత్రాలు ప్రదర్శిస్తోంది. ఉచిత ఫిల్మ్‌ వర్క్‌షాప్‌ నిర్వహిస్తోంది.

(‘భక్త ప్రహ్లాద’ విడుదలై నేటికి 91 ఏళ్లు) 

::: నరవ ప్రకాశరావు; గౌరవ కార్యదర్శి,
వైజాగ్‌ ఫిలిం సొసైటీ 

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top