
మీడియా సమావేశంలో దిల్ రాజు తదితరులు
22.5 శాతం వేతనాల పెంపునకు నిర్మాతల అంగీకారం
నేటి నుంచి యథావిధిగా చిత్రీకరణలు
సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు: ‘దిల్’ రాజు
సాక్షి, హైదరాబాద్: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కార్మికుల సమ్మెకు ఎట్టకేలకు తెరపడింది. కార్మికుల వేతనాలు 30 శాతం పెంచాలంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 4 నుంచి కార్మికులు సమ్మె చేస్తుండటం తెలిసిందే. కార్మికశాఖ కార్యాలయంలో కార్మికశాఖ అదనపు కమిషనర్ గంగాధర్ ఆధ్వర్యంలో గురువారం ఫిల్మ్ చాంబర్, నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులతో సుదీర్ఘంగా జరిగిన చర్చలు ఫలించాయి.
కార్మికులు 30 శాతం వేతనాల పెంపు కోసం డిమాండ్ చేయగా 22.5 శాతం వేతనం పెంపునకు నిర్మాతలు ఓకే అన్నారు. దీంతో 18 రోజులుగా జరుగుతున్న సమ్మెకు ఫుల్‌స్టాప్ పడింది. దీంతో శుక్రవారం నుంచి యథావిధిగా చిత్రీకరణలు జరగనున్నాయి.
సీఎం సూచనతో పరిష్కారం చూపాం: ‘దిల్’రాజు
చర్చల అనంతరం తెలంగాణ రాష్ట్ర చలన చిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్, నిర్మాత ‘దిల్’ రాజుతోపాటు పలువురు సినీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ‘నిర్మాతలకు, ఫెడరేషన్‌కు మధ్య నెలకొన్న సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశంతో గురువారం ఫెడరేషన్, ఫిల్మ్ చాంబర్, ఎఫ్‌డీసీ ద్వారా పరిష్కారం చూపాం. ఇందుకుగాను చిత్ర పరిశ్రమ తరఫున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, కార్మికశాఖ అదనపు కమిషనర్ గంగాధర్‌కు సినీ పరిశ్రమ, ఫెడరేషన్ తరఫున ధన్యవాదాలు.
సినీ పరిశ్రమలో ఎప్పుడూ ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి. భారతీయ చిత్రాలన్నీ హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకునేలా ఉండాలనేది ముఖ్యమంత్రి ఫ్యూచర్ విజన్. తెలుగు సినిమాలతోపాటు అన్ని భాషల సినిమాలూ హైదరాబాద్‌లో చిత్రీకరణలు జరుపుకునేలా చేయడం మనందరి బాధ్యత. హైదరాబాద్‌ను ఫిల్మ్ హబ్‌గా తయారు చేద్దాం’ అని ‘దిల్’రాజు పేర్కొన్నారు.
రోజుకు రూ. 2 వేలలోపు ఉంటే తొలి ఏడాది 15 శాతం పెంపు
సినీ కార్మికులకు 22.5 శాతం వేతనాలు పెంచేందుకు నిర్మాతలు ముందుకురాగా ఫెడరేషన్ ప్రతినిధులు అందుకు ఒప్పుకున్నారని కార్మికశాఖ అదనపు కమిషనర్ గంగాధర్ తెలిపారు. రోజుకు రూ. 2 వేలలోపు వేతనాలు ఉన్న వారికి తొలి ఏడాది 15 శాతం, రెండో ఏడాది 2.5 శాతం, మూడో ఏడాది 5 శాతం పెంచనున్నారని చెప్పారు. అలాగే రూ. 2 వేల నుంచి రూ. 5 వేలు ఉన్నవారికి తొలి ఏడాది 7.5 శాతం, రెండో ఏడాది 5 శాతం, మూడో ఏడాది 5 శాతం వేతనాలు పెంచుతారని వివరించారు. ఇతర విషయాలపై చర్చించేందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.
మరోవైపు ఇప్పటివరకు ఆదివారాలు షూటింగ్ చేస్తే డబుల్ కాల్‌షీట్ లెక్కన వేతనాలు చెల్లిస్తుండగా ఇకపై పెద్ద సినిమాలకు ఒకటిన్నర కాల్షీట్, చిన్న సినిమాలకు మాత్రం రెండు, నాలుగో ఆదివారాలకే ఒకటిన్నర కాల్షీట్ ఉంటుందని గంగాధర్ తెలిపారు. చిన్న సినిమాల నిర్మాతలు సమస్యలపైనా చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో పరిష్కారం: వల్లభనేని అనిల్‌కుమార్
‘వేతనాల పెంపుపై లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో పరిష్కారం కుదిరింది. 30 శాతం వేతనాల పెంపు కోసం మేం అడగ్గా నిర్మాతలు 22.5 శాతానికి ఒప్పుకున్నారు. ప్రొడక్షన్ అసిస్టెంట్ యూనియన్, మహిళా వర్కర్స్, స్టూడియో వర్కర్స్, లైట్‌మెన్ యూనియన్ల కార్మికులకు ఎక్కువ వేతనం కావాలని అడిగాం. దీనిపై ఒక కమిటీ వేసి చర్చిస్తామని చెప్పారు. అంతిమంగా ఫైటర్లకు 7.5 శాతం, డ్యాన్సర్లకు 5.5 శాతం పెంచేందుకు ఒప్పుకున్నారు’ అని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్ తెలిపారు.
కలిసిమెలిసి ముందుకు సాగాలి
‘ఎంతో జటిలమైన ఇండస్ట్రీ సమస్యను సామరస్యంగా, సమన్యాయం జరిగే విధంగా పరిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. తెలుగు చిత్రసీమ అభివృద్ధికి ఆయన తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. హైదరాబాద్‌ను దేశానికే కాదు, ప్రపంచ చలన చిత్ర రంగానికే ఓ హబ్‌గా మార్చాలన్న ఆయన ఆలోచనలు, అందుకు చేస్తున్న కృషి హర్షించదగినవి. తెలుగు చిత్రసీమ ఎప్పుడూ ఇలానే కలిసి మెలిసి ముందుకు సాగాలి. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా అండదండలు అందిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ – చిరంజీవి